- ఏఐ సాయంతో కుటుంబానికి అప్పగింత
చండీగఢ్: మతిమరుపుతో దారి తప్పిన1,200 కి.మీ దూరం వెళ్లిన ఓ వృద్ధుడి ఆచూకీని చాట్‌జీపీటీ కనిపెట్టింది. పంజాబ్ రాష్ట్రం లూథియానా జిల్లాలోని ఫతేగఢ్ గుజ్రాన్ గ్రామానికి చెందిన చమన్ లాల్.. ‘ముఖ్యమంత్రి తీర్థయాత్ర పథకం’ కింద ఈ నెల 11న శ్రీ హర్మందిర్ సాహిబ్ (స్వర్ణ దేవాలయం) దర్శనానికి వెళ్లాడు. ఆయనకు కొంతకాలంగా మతిమరుపు సమస్యలున్నాయి. అమృత్‌సర్‌లో తన గ్రూప్ నుంచి విడిపోయి, రైల్వే స్టేషన్ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడి నుంచి బిహార్ వెళ్లే రైలెక్కి, ఇంటికి సుమారు 1,200 కిలోమీటర్ల దూరంలో ఉన్న గయకు చేరుకున్నాడు.
అయితే, తన ఊరి పేరు ‘ఫతేగఢ్ గుజ్రాన్’ అని.. తాను ఎవరో, ఎక్కడి నుంచి వచ్చానో కూడా మర్చిపోయాడు. దారితప్పి కంగారుగా ఉన్న చమన్లాల్ను స్థానిక యువకుడు నీరజ్.. తన ఇంటికి తీసుకెళ్లాడు. భోజనం పెట్టి, ఆశ్రయం ఇచ్చాడు. ఆ వృద్ధుడు ఏ ప్రాంతానికి చెందినవాడో తెలుసుకోవడానికి ఆయన నలుగురు కుటుంబ సభ్యులతో కలిసి 4 రోజుల పాటు వెతికాడు. చమన్ లాల్ కేవలం పంజాబీ మాత్రమే మాట్లాడటంతో.. అతడి సొంతూరు తెలుసుకునేందుకు నీరజ్.. చాట్‌జీపీటీని, ఇంటర్నెట్ సెర్చ్‌లను ఉపయోగించాడు.
మూడు రోజుల అనంతరం చివరకు లూథియానా జిల్లాలోని మచ్చివారా సాహిబ్ సమీపంలో ‘ఫతేగఢ్ గుజ్రాన్’ అనే గ్రామం ఉన్నట్లు నీరజ్గుర్తించాడు. లొకేషన్ దొరికిన తర్వాత, చమన్ లాల్‌ను ఒంటరిగా పంపకుండా నీరజ్ స్వయంగా గయ నుంచి లుథియానాకు, అక్కడి నుంచి మచ్చివారాకు సుదూర ప్రయాణం చేసి ఆయనతో పాటు వెళ్లాడు. మచ్చివారాలో స్థానికులకు చమన్ లాల్ ఫొటోను చూపించి ఆరా తీశారు. ఆ సమయంలో ఆ ప్రాంత నివాసి మాస్టర్ కృష్ణన్ లాల్ ఆ వృద్ధుడిని గుర్తించాడు. చమన్ లాల్ మనుమడు సుఖ్‌చైన్ సింగ్ వెంటనే మచ్చివారాకు చేరుకుని తన తాతను గుర్తించి నిర్ధారించుకున్నాడు. చమన్లాల్ను జాగ్రత్తగా ఇంటికి చేర్చిన నీరజ్‌కు వృద్ధుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
