పట్టిచ్చుకుంటలేరు ‘‘సర్’’.. 92.88 లక్షల మంది ఓటర్లకు నోటీసులు.. హాజరైంది కేవలం 31 లక్షల మందే !

పట్టిచ్చుకుంటలేరు ‘‘సర్’’.. 92.88 లక్షల మంది ఓటర్లకు నోటీసులు.. హాజరైంది కేవలం 31 లక్షల మందే !
  • అందులో 22 లక్షల మంది ఓట్లు ఓకే 
  • వెసులుబాటు ఇచ్చినా స్పందన కరువు
  • ఓటర్లకు ఫోన్లు చేస్తున్న అధికారులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నిర్వహిస్తున్న స్పెషల్​ ఇంటెన్సివ్​ రివిజన్ (సర్​) ప్రక్రియ మందగించింది. నోటీసులు అందుకున్న ఓటర్లలో అత్యధిక మంది విచారణకు హాజరయ్యేందుకు ఆసక్తి చూపడం లేదు. క్షేత్రస్థాయిలో దాదాపు 92.88 లక్షల మంది ఓటర్లకు బీఎల్వోల ద్వారా నోటీసులు పంపిణీ చేసినట్టు అధికారులు ప్రకటిస్తున్నప్పటికీ, ఆశించిన స్థాయిలో స్పందన కనిపించడం లేదు. 

ఇప్పటివరకు కేవలం 31 లక్షల మంది నోటీసులపై విచారణకు హాజరై.. అవసరమైన పత్రాలు సమర్పించారు. వారిలో 22 లక్షల మంది వివరాలు సరిగ్గా ఉన్నాయని తేలడంతో అధికారులు వారిని అర్హులుగా ధ్రువీకరించారు.

మరో 9 లక్షల మందికి సంబంధించి పత్రాల్లో కొన్ని లోపాలు లేదా స్పష్టత కొరవడటంతో వారికి అదనపు ఆధారాలు సమర్పించేందుకు అవకాశం కల్పించారు. రోజుకు లక్షల్లో విచారణలు జరగాల్సి ఉండగా, కేవలం వేల సంఖ్యలోనే నమోదు కావడం తుది జాబితా రూపకల్పనపై తీవ్ర ప్రభావం చూపేలా ఉంది. 

నోటీసులు అందినప్పటికీ ఓటర్లు తమ పని ఒత్తిడి లేదా విచారణ కేంద్రాల వద్ద తిరగలేక దూరంగా ఉంటుండటంతో అధికారులు స్వయంగా ఫోన్లు చేసి సంప్రదిస్తున్నారు. అనుకూలమైన సమయంలో హాజరయ్యేందుకు లేదా ప్రతినిధి ద్వారా పత్రాలు పంపేందుకు సడలింపులు ఇచ్చినప్పటికీ స్పందన మాత్రం అరకొరగానే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
   
నిబంధనలు సడలింపు..
వివిధ కారణాలతో నోటీసులు అందుకున్న ఓటర్లకు విచారణకు హాజరుకావడం పెద్ద సవాల్‌గా మారింది. దీనిని గమనించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) విచారణ నిబంధనలను కొంత సడలించారు. నోటీసు వచ్చిన ఓటరు స్వయంగా రావాల్సిన అవసరం లేకుండా, వారి కుటుంబంలో ఉన్న ఏదైనా వయోజన సభ్యుడు అవసరమైన పత్రాలతో ఈఆర్వో వద్దకు వెళ్లి వివరణ ఇవ్వవచ్చని స్పష్టం చేశారు. ఈ సడలింపు ఇచ్చినా కూడా విచారణ కేంద్రాల వద్ద ఆశించిన స్థాయిలో స్పందన కనిపించడం లేదు. 

సర్టిఫికెట్ల సేకరణలో పడుతున్న శ్రమతో చాలామంది ఓటర్లు తమ వంతు పరిశీలనకు దూరంగా ఉండిపోతున్నారు. నోటీసు ఇచ్చినా రానివారి జాబితాను సిద్ధం చేసి.. ప్రక్రియను వేగవంతం చేసేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది. విచారణ గడువు సమీపిస్తుండటంతో అధికారులు ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగక తప్పడం లేదు.

నోటీసులు అందుకొని విచారణకు రాని ఓటర్ల డేటాను పరిశీలించి, సిస్టమ్‌లో నమోదైన వారి ఫోన్ నంబర్లకు ఫోన్లు చేసి సంప్రదిస్తున్నారు. నోటీసు కారణాన్ని వివరించి, ఓటు హక్కు కోల్పోకుండా ఉండాలంటే వెంటనే తగిన పత్రాలతో విచారణ కేంద్రానికి రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

అంతేకాకుండా, స్థానిక బీఎల్వోలు సైతం నివాసాలకు వెళ్లి ఓటర్లను అప్రమత్తం చేస్తున్నారు. అక్టోబర్ 7వ తేదీతో అభ్యంతరాలు, క్లెయిమ్‌ల స్వీకరణకు గడువు ముగియనుండగా, నవంబర్ 5 నాటికి విచారణలన్నీ పూర్తి చేయాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ఓటర్ల స్పందన పెరిగితే తప్ప ‘సర్‌‌’  ప్రక్రియ సజావుగా పూర్తికావడం కష్టంగా మారనున్నది.

మూడో వంతు మంది కూడా స్పందించలే..
ముసాయిదా ఓటర్ల జాబితాలో  లోపాలు ఉన్నవారికి, అలాగే 2002 నాటి ‘సర్‌‌‌‌‌‌‌‌’ రికార్డులతో మ్యాపింగ్ కానివారికి ఎన్నికల యంత్రాంగం నోటీసులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 92.88 లక్షల నోటీసులను జనరేట్ చేసి, క్షేత్రస్థాయిలో బీఎల్వోల ద్వారా ఓటర్లకు చేరవేశామని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. అయితే, నోటీసులు అందుకున్న వారిలో మూడో వంతు మంది కూడా స్పందించకపోవడం అధికారులను విస్మయానికి గురిచేస్తోంది. 

వయస్సు, తండ్రి పేరు, కుటుంబ సంబంధాల వివరాల్లో తేడాలు ఉండటంతో జారీ చేసిన ఈ నోటీసులకు సంబంధిత ఆధార పత్రాలను జతచేసి ఈఆర్వోలు లేదా ఏఈఆర్వోల ముందు దాఖలు చేయాల్సి ఉంటుంది. కానీ రోజులు గడుస్తున్నా ఓటర్లు విచారణ కేంద్రాల వైపు రాకపోవడంతో.. దాదాపు 60 లక్షలకు పైగా నోటీసులను విచారించాల్సి ఉన్నది.