ఎస్టీ గురుకులాలకు నిధుల కటకట ..జీతాలు తప్ప మిగతా సమస్యలకు నో బడ్జెట్

ఎస్టీ గురుకులాలకు నిధుల కటకట ..జీతాలు తప్ప మిగతా సమస్యలకు నో బడ్జెట్
  • ఆరుగురు ఉండాల్సిన చోట ఇద్దరు, ముగ్గురు సిబ్బందితో డ్యూటీలు
  • అదిలాబాద్ జిల్లా హాస్టల్స్ లో పాములు వస్తున్నాయంటున్న స్టూడెంట్స్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎస్టీ గురుకులాలను  నిధుల కొరత వేధిస్తోంది. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు దానికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. సిబ్బంది జీతభత్యాలకు తప్ప, విద్యార్థుల కనీస అవసరాలు, భవనాల నిర్వహణ, అత్యవసర పనులకు బడ్జెట్ విడుదల కాకపోవడంతో గురుకులాలు సమస్యల నిలయాలుగా మారాయి. ఎస్టీ గురుకుల సొసైటీ పరిధిలో మొత్తం 160 స్కూళ్లు, హాస్టల్స్, ఏకలవ్య, ఆశ్రమ పాఠశాలల్లో సుమారు లక్షన్నర మంది స్టూడెంట్స్ చదువుతున్నారు.

తక్కువ జీతాలు, సిబ్బంది కొరత

గురుకులాల్లో సిబ్బంది కొరత పరాకాష్టకు చేరింది. ఒక్కో ఎస్టీ గురుకుల సొసైటీ స్కూల్, హాస్టల్ లో  స్టూడెంట్స్ సంఖ్యను బట్టి కనీసం 6 మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉండాలి. ఇందులో సెక్యూరిటీ, అటెండెర్స్, వంట చేసే వాళ్లు ఉంటారు. కానీ చాలా స్కూళ్లలో ఇద్దరు, ముగ్గురు మాత్రమే పనిచేస్తున్నారు. వీరికి జీతాలు రూ.10 వేల లోపే ఇస్తుండటంతో ఈ డ్యూటీలు చేసేందుకు ఎవరూ ముందుకు రావటం లేదు.  కనీస వేతనం కూడా ఇవ్వటం లేదని సిబ్బంది వాపోతున్నారు.

ప్రస్తుతం చాలాచోట్ల ఆరుగురు ఉండాల్సిన స్థానంలో కేవలం ఇద్దరు లేదా ముగ్గురితోనే నెట్టుకొస్తున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా ఇద్దరు ముగ్గురే షిఫ్టులు మార్చుకుంటూ అదనపు పనిభారంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. సరైన నిఘా లేకపోవడంతో రాత్రి వేళల్లో విద్యార్థుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇటీవల నాగర్ కర్నూల్ జిల్లాలో ఫుడ్ పాయిజన్ ఘటనతో 15 మంది స్టూడెంట్స్ హాస్పిటల్ పాలయ్యారు. ఇందులో కుకింగ్ సిబ్బందిని ఉన్నతాధికారులు తొలగించారు. అయితే తక్కువ జీతానికి పనిచేయటానికి ఎవరూ ముందుకు రాకపోవటంతో తొలగించిన వారినే మళ్లీ విధుల్లోకి తీసుకున్నారు.

శిథిలావస్థలో ఏజెన్సీ భవనాలు

రాష్ర్టంలో ఏజెన్సీ జిల్లాలైన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఆసిఫాబాద్, అదిలాబాద్, నిర్మల్ వంటి జిల్లాల్లోని ఎస్టీ గురుకులాలు, హాస్టళ్ల భవనాలు తీవ్రంగా శిథిలమయ్యాయి. వర్షాకాలంలో భవనాలు కారడం, గోడలు పెచ్చులు ఊడిపడుతున్నాయని అధికారులు ఉన్నతాధికారులకు చెబుతున్నారు. కిటికీలు, తలుపులు విరిగిపోయి, మరుగుదొడ్లు, స్నానాల గదుల నిర్వహణకు నిధులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది.

హాస్టల్ భవనాల చుట్టూ పిచ్చి మొక్కలు, పొదలు పెరిగిపోవడం, గోడలకు రంధ్రాలు పడటంతో రాత్రి వేళల్లో గదుల్లోకి, నిద్రపోతున్న విద్యార్థుల పక్కల్లోకి పాములు, తేళ్లు వస్తున్నాయి. టీచర్లు, ప్రిన్సిపల్స్ కు స్టూడెంట్స్ చెబుతున్నా భవనాల మరమ్మతులు, సొంత భవనాల నిర్మాణాలకు నిధులు లేవని ఉన్నతాధికారులు చెబుతున్నారు. గురుకులాలకు అత్యవసర నిధులు విడుదల చేసి, శిథిల భవనాలకు రిపేర్లు చేపట్టి రక్షణ కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. 

ప్రిన్సిపాల్స్ దగ్గర అత్యవసర నిధి నిల్

గతంలో గురుకులాల్లో చిన్న చిన్న రిపేర్లు, విద్యార్థుల వైద్య అత్యవసరాలు, తాగునీరు, విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రిన్సిపాళ్ల వద్ద 'ఎమర్జెన్సీ ఫండ్' అందుబాటులో ఉండేది.  3 నెలలకు సరిపోయే విధంగా రూ.30 వేల అత్యవసర నిధి ఉండేది. 6 నెలలుగా ఈ నిధులు విడుదల కాకపోవడంతో ప్రిన్సిపాళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా సొంత డబ్బులు వెచ్చించాల్సి వస్తోందని చెబుతున్నారు. సొంత పైసలతో సమస్యలను పరిష్కరించినా ఆ నిధులు సైతం రావటం లేదని వాపోతున్నారు.  అత్యవసర నిధి లేకపోవటంతో సమస్యను అలానే వదిలేయాల్సి వస్తోందని ప్రిన్సిపాల్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.