బతుకు బండి ఎటు? చదువు లేదు.. స్కిల్ లేదు.. కొలువు లేదు.. రాష్ట్ర యువతలో ప్రతి నలుగురిలో ఒకరు ఖాళీ

బతుకు బండి ఎటు? చదువు లేదు.. స్కిల్ లేదు.. కొలువు లేదు.. రాష్ట్ర యువతలో ప్రతి నలుగురిలో ఒకరు ఖాళీ
  • తెలంగాణలో 26.5 శాతానికి ‘నీట్’ రేట్
  • కేంద్ర పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేలో వెల్లడి
  • 42.7% మందితో కొత్తగూడెం జిల్లా టాప్
  • ఖమ్మంలో 38.2%, నిజామాబాద్‌‌‌‌లో 31.6% 
  • కామారెడ్డి బెస్ట్..నీట్ కేటగిరీలో 17.2% మందే 
  • నిరుద్యోగంలోనూ భద్రాద్రి టాప్, తర్వాత ఖమ్మం, మూడో స్థానంలో రంగారెడ్డి జిల్లా

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో లక్షలాది మంది యువత భవిష్యత్తును  తీర్చిదిద్దుకోవాల్సిన వయసులో అటు ఉన్నత చదువులు చదవక.. ఇటు ఉద్యోగాలు చేయక.. కనీసం ఏదైనా వృత్తి నైపుణ్య శిక్షణ(ట్రైనింగ్) కూడా పొందకుండా కాలం వెళ్లదీస్తున్నారు.

కేంద్ర గణాంక శాఖ విడుదల చేసిన ‘పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే’ తాజా నివేదికలో ఈ విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. తెలంగాణలో ప్రతి నలుగురు యువతలో ఒకరు ఏ ఉద్యోగమూ చెయ్యకుండా.. చదువుకోకుండా.. ఇటు శిక్షణా తీసుకోకుండా ఖాళీగా ఉంటున్నారు. 

రాష్ట్రంలో15 నుంచి 29 ఏండ్ల మధ్యలో ఉన్నవారిలో 26.5 శాతం మంది ‘నీట్(నాట్ ఇన్ ఎంప్లాయ్‌‌‌‌మెంట్, ఎడ్యుకేషన్ ఆర్ ట్రైనింగ్)’ కేటగిరీలో ఉన్నారు.

కేంద్రం తొలిసారిగా జిల్లాలవారీగానూ లెక్కలు విడుదల చేసింది. ఎంత మంది ఉపాధి పొందుతున్నారు.. వర్కింగ్ పాపులేషన్ రేషియో ఎంత.. నీట్ రేట్ ఎంత అనే విషయాలను పొందుపరిచింది. మన రాష్ట్రంలో జిల్లాల వారిగా డేటాను విడుదల చేసింది. అయితే, నీట్ రేట్ అబ్బాయిల్లోనే ఎక్కువగా ఉండడం మరింత కలవర పరుస్తున్నది. దాదాపు ఏ పనీపాటా.. చదువుల్లేకుండా ఉన్న అబ్బాయిలు ఏకంగా 38 శాతం మంది ఉండగా.. అమ్మాయిల్లో 26 శాతం మందే ఉన్నారు.   
  
జిల్లాలవారీగా పరిశీలిస్తే నిరుద్యోగం, చదువుల లేమి గ్రామీణ, వెనుకబడిన జిల్లాలను తీవ్రంగా కుదిపేస్తోంది. ఈ సర్వే ప్రకారం రాష్ట్రంలో అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ‘నీట్’ రేటు ఏకంగా 42.7 శాతంగా నమోదైంది.

ఇక్కడ దాదాపు సగం మంది యువత ఎలాంటి ఉపాధి, విద్య లేకుండా బతుకుతున్నట్టు కేంద్ర గణాంకాలు స్పష్టం చేశాయి. ఈ జిల్లాలో నిరుద్యోగ రేటు కూడా 9.5 శాతంగా ఉండడం కలవరపరుస్తున్నది. దీని తర్వాత ఖమ్మం జిల్లాలో 38.2 శాతం మంది, నిజామాబాద్ జిల్లాలో 31.6 శాతం మంది యువత నీట్ కేటగిరీలో ఉన్నారు. 

డిగ్రీలు, పీజీలు చేసినప్పటికీ స్థానికంగా ఉపాధి అవకాశాలు లేకపోవడం, ఉన్నత చదువులు కొనసాగించే స్థోమత లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని నివేదిక స్పష్టం చేస్తున్నది. అయితే, కామారెడ్డి జిల్లా మాత్రం మంచి పనితీరు కనబరిచింది. 

ఆ జిల్లాలో ఉద్యోగాలు, చదువులు లేకుండా ఉన్న యువత కేవలం17.2 శాతమేనని నివేదిక వెల్లడించింది. అక్కడి వారు కనీసం ఏదో ఒక పనిలో ఉంటున్నట్టు తెలిపింది. ఇక పారిశ్రామిక, ఐటీ హబ్‌గా పేరున్న హైదరాబాద్‌లోనూ పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. ఇక్కడ 25 శాతం మంది నీట్ కేటగిరీలో ఉన్నారు.   

‘నీట్’కు, నిరుద్యోగానికి తేడా ఏంటి ? 
సాధారణంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ దొరకని వారిని నిరుద్యోగులుగా చెబుతుంటారు. కానీ, ‘నీట్’ కేటగిరీ అంతకంటే ప్రమాదకరమైనదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాలేజీలు, స్కూళ్లకు వెళ్లి చదువుకోరు. పాలిటెక్నిక్, ఐటీఐ లేదా మరేదైనా నైపుణ్య శిక్షణ తీసుకోరు. ఎక్కడా పని చేయరు. దీని వల్ల హ్యూమన్ రీసోర్సెస్ ఎక్కువగా ఉన్నా కూడా నిరుపయోగంగా మారుతున్నాయని అంటున్నారు. 

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు చదువు ఆపేసి ఎలాంటి ఆదాయం లేని ఇంటి పనులకే పరిమితం కావడం, యువకులు ఉద్యోగ ప్రయత్నాలు సైతం విరమించుకుని ఇళ్ల వద్దే ఉండిపోతుండటం ఈ రేటు పెరగడానికి కారణమవుతోందని చెబుతున్నారు.   

అందుకే స్కిల్స్ యూనివర్సిటీ.. డీట్​ 
రాష్ట్రంలో విద్యా వ్యవస్థకు, పరిశ్రమల అవసరాలకు మధ్య భారీ వ్యత్యాసం ఉంటోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాలేజీల్లో డిగ్రీలు వస్తున్నా.. మార్కెట్‌కు అవసరమైన స్కిల్స్ ఉండట్లేదు. దీంతో ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు దొరకడం లేదు. మరోవైపు ప్రభుత్వ కొలువుల భర్తీ ఆలస్యం కావడం, పోటీ పరీక్షల సన్నద్ధత పేరిట ఏళ్ల తరబడి రూముల్లోనే ఉండిపోవడంతో వేలాది మంది యువత ప్రొడక్టివ్ వయసును కోల్పోతున్నారు. 

అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిస్థితులను మార్చేందుకే ఇండస్ట్రీ అవసరాలకు తగ్గట్టుగా చర్యలు చేపట్టింది. ఇండస్ట్రీలు కోరుకునే నైపుణ్యాలను యువతకు అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది. అందులోనే యువతకు ట్రైనింగ్ ఇస్తున్నది.

సర్టిఫికెట్లను అందిస్తున్నది. క్యాంపస్‌లోనే ఇండస్ట్రీలు తమకు కావాల్సిన వారిని ఎంపికచేసుకునే విధంగా యువతను సన్నద్ధం చేస్తున్నది. ఈ మిషన్‌ను మరింత పెంచేందుకూ కసరత్తులు చేస్తున్నది. అంతేకాదు.. నిరుద్యోగాన్ని తగ్గించేందుకు.. ప్రైవేట్ సెక్టార్‌‌లో యువతకు ఉపాధి చూపించేందుకు ప్రత్యేకంగా డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్ ఆఫ్ తెలంగాణ(డీట్)నూ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసింది. 

అయితే, ఈ రెండూ ఇటీవలి కాలంలోనే ఏర్పాటు చేయడంతో ఫలితాలు రావడానికి మరికొంత సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ రెండు ఇనీషియేటివ్స్ ద్వారా భవిష్యత్తులో నీట్ లాంటి సమస్యలు తగ్గుతాయని పేర్కొంటున్నారు.  

ఉపాధిలో జగిత్యాల బెటర్.. 
ఉపాధి కల్పన (లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్–ఎల్‌ఎఫ్‌పీఆర్) విషయంలో జగిత్యాల మెరుగైన పొజిషన్‌లో ఉంది. ఆ జిల్లాలో 70.3 శాతం మంది ఏదో ఒక పని చేసుకుంటూ బతుకుతున్నారు. వికారాబాద్ జిల్లాలోనూ 70.2 శాతం మంది పనుల్లో ఉన్నారు. ఈ విషయంలో మన రాష్ట్ర సగటు 61.4 శాతంతో పోలిస్తే ఈ రెండు జిల్లాలు మెరుగ్గా ఉన్నాయి. నిరుద్యోగం మాత్రం భద్రాద్రి కొత్తగూడెంలో ఎక్కువగా ఉంది. ఆ జిల్లాలో 9.5 శాతంగా నిరుద్యోగ రేటు నమోదైంది.

ఖమ్మంలో 7.8 శాతం, రంగారెడ్డి(హైదరాబాద్)లో 6.7 శాతం చొప్పున ఉంది. నిరుద్యోగ రేటు అత్యల్పంగా ఉన్న జిల్లా నల్గొండ ఉంది. ఆ జిల్లాలో కేవలం 2.7 శాతం  నిరుద్యోగం ఉంది. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్‌లో రంగారెడ్డి జిల్లా అట్టడుగున ఉండడం విశేషం. ఇక్కడ నిరుద్యోగ రేటు కూడా 6.7 శాతంగా ఉన్నట్టు కేంద్ర గణాంక శాఖ నివేదిక తేటతెల్లం చేస్తున్నది. నిరుద్యోగంలో టాప్ 3లో రంగారెడ్డి జిల్లా ఉండడం ఆందోళనకరమైన విషయం.