యుద్ధం, అణచివేతతో ఇరాన్‌లో  ప్రజలపై తీవ్ర ప్రభావం..నోబెల్ గ్రహీత నర్గీస్ మొహమ్మది

యుద్ధం, అణచివేతతో ఇరాన్‌లో  ప్రజలపై తీవ్ర ప్రభావం..నోబెల్ గ్రహీత నర్గీస్ మొహమ్మది

దుబాయ్: యుద్ధాలు, అంతర్గత అణచివేతల కారణంగా ఇరాన్ ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి కూడా వీలులేని పరిస్థితి ఏర్పడిందని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త నర్గీస్ మొహమ్మది ఆవేదన వ్యక్తం చేశారు. 1980ల నాటి ఇరాక్-ఇరాన్ యుద్ధకాలం నాటి భయానక బాల్య జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ, అప్పట్లోనే తనలో యుద్ధంపై తీవ్ర వ్యతిరేకత పెరిగిందన్నారు.

2022లో మహ్సా అమిని మృతి తర్వాత ఇరాన్ ప్రజలలో, ముఖ్యంగా యువతలో ప్రభుత్వ విధానాలపై తీవ్ర వ్యతిరేకత, హక్కుల కోసం పోరాడే ధైర్యం పెరిగాయని, ఇది తనకు ఎంతో ఆశను ఇస్తోందని తెలిపారు. డిసెంబర్‌లో ఒక మానవ హక్కుల వకీలు స్మారక సభలో ప్రసంగిస్తున్నప్పుడు భద్రతా బలగాలు తనపై దాడి చేసి అరెస్ట్ చేశాయని, ఆ సమయంలో తలపై తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. 2 నెలల పాటు ఏకాంత నిర్బంధంలో ఉన్నానని, ప్రస్తుతం కోలుకుంటున్నట్లు వెల్లడించారు. 

జైలులోనే జ్ఞాపకాల పుస్తకం

జైలులో ఉన్న సమయంలో తోటి ఖైదీల సాయంతో తన జ్ఞాపకాలను 'ఎ ఉమెన్ నెవర్ స్టాప్స్ ఫైటింగ్' పేరుతో పుస్తక రూపంలోకి తీసుకువచ్చినట్లు ఆమె తెలిపారు. కొద్దికొద్ది పేజీలుగా దానిని బయటికి చేరవేశాన్నారు. ఈ పుస్తకం ఫ్రెంచ్, జర్మన్ తదితర విదేశీ భాషల ఎడిషన్లు ఈ నెలలో విడుదలవుతుండగా, ఇంగ్లీష్ , పర్షియన్ ఎడిషన్లు వచ్చే ఏడాది విడుదల కానున్నాయి. ఇప్పటి వరకు మొత్తం 44 సంవత్సరాల జైలు శిక్షలను ఎదుర్కొన్న మొహమ్మది.. పదేళ్లు జైలు జీవితం గడిపారు. గత మే నెలలో అపస్మారక స్థితికి చేరుకోవడంతో జైలు నుంచి ఆసుపత్రికి తరలించి, ఆ తర్వాత వైద్య కారణాలరీత్యా తాత్కాలిక బెయిల్‌పై బయట ఉన్నారు.