ఏం లోకంరా బాబూ.. ఎలాంటి మనుషులు ఉన్నార్రా సమాజంలో.. అనారోగ్యంగా ఉందని ఆస్పత్రికి వెళితే.. ముందూ వెనకా చూడకుండా ఇంజెక్షన్ చేశారు.. ఆ తర్వాత రోగం నయం కాకపోగా.. ఉన్న చెయ్యి తీసేశారు.. 20 ఏళ్ల యువతి.. మరికొన్ని రోజుల్లో పెళ్లికి రెడీ అవుతుంది.. ఎంతో భవిష్యత్ ఉన్న ఆ యువతి ఇప్పుడు ఓ చెయ్యి లేకుండా.. సమాజంలో ఎలా బతకాలి.. ఇంజెక్షన్ చేసినోడు బాగనే ఉన్నాడు.. తప్పుడు వైద్యం చేసినోళ్లు దర్జాగానే బయట తిరుగుతున్నారు.. సర్వనాశనం అయిన జీవితం మాత్రం ఆ యువతిది.. బీహార్ రాష్ట్రం పాట్నాలో వెలుగు చూసిన ఈ ఘోరం ఇప్పుడు దేశాన్ని కదిలిస్తుంది.. కన్నీళ్లు తెప్పిస్తుంది.
బీహార్‌లోని శివహర్ జిల్లాకు చెందిన 20 ఏళ్ల రేఖా కుమారి జీవితాన్ని ఒక హాస్పిటల్ విజిట్ పూర్తిగా మార్చేసింది. చెవి సమస్యకు చికిత్స చేయించుకోవాలని ఆమె పాట్నాలోని మహావీర్ ఆరోగ్య సంస్థ ఆస్పత్రికి వెళ్లింది. చిన్న చికిత్సతో ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వస్తాననుకున్న రేఖా.. చివరకు తన చేతిని కోల్పోయి జీవితాంతం మరిచిపోలేని విషాదంతో బయటకు వచ్చింది. దీంతో నవంబర్‌లో జరగాల్సిన ఆమె పెళ్లి కూడా రద్దయింది.
సర్జరీ తర్వాత నర్సు సిరలో ఇవ్వాల్సిన ఇంజెక్షన్‌ను పొరపాటున ధమనిలో ఇచ్చింది. వెంటనే రేఖా చేతిలో తీవ్రమైన నొప్పి, అసౌకర్యం ఉందని పలుమార్లు చెప్పినా ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోలేదని రేఖా ఫ్యామిలీ వెల్లడించింది. సమయానికి సరైన చికిత్స అందకపోవడంతో ఇన్‌ఫెక్షన్ తీవ్రరూపం దాల్చి, చివరకు ఆమె చేతిని కట్ చేసి తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు.
ఒక చేతిని కోల్పోవడమే కాదు, రేఖా జీవితంపై ఎన్నో కలలు కూడా ఒక్కసారిగా కుప్పకూలాయి. పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో జరిగిన ఈ ఘటనతో ఆమె కుటుంబం తీవ్ర మనోవేదనలో ఉంది. ఆస్పత్రి నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి కారణమని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లినా.. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ఈ ఘటన వైద్య సేవల్లో బాధ్యత, జవాబుదారీతనం ఎంత ముఖ్యమో మరోసారి గుర్తు చేస్తోంది. చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లిన ఓ యువతి శాశ్వత వైకల్యంతో తిరిగి రావడం అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ కేసులో నిజానిజాలు దర్యాప్తులో తేలాల్సి ఉన్నప్పటికీ, బాధితురాలికి న్యాయం జరగాలని, ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఆరోగ్య వ్యవస్థలో కఠినమైన బాధ్యతాయుత చర్యలు అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
