5Gలో కొత్త మార్పులు.. జియో, ఎయిర్‌టెల్ స్లైసింగ్ సేవలకు TRAI గ్రీన్ సిగ్నల్

5Gలో కొత్త మార్పులు.. జియో, ఎయిర్‌టెల్ స్లైసింగ్ సేవలకు TRAI గ్రీన్ సిగ్నల్

భారత టెలికాం రంగం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5G నెట్‌వర్క్ స్లైసింగ్ పై టెలికాం రెగ్యులేటరీ సంస్థ ట్రాయ్ కీలక అడుగులు వేసింది. 5G స్టాండలోన్ ఆర్కిటెక్చర్ అందుబాటులోకి రావడంతో టెలికాం కంపెనీలు వినియోగదారులకు ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా మెరుగైన నెట్‌వర్క్ అనుభవాన్ని అందించే అవకాశం ఏర్పడింది. నెట్‌వర్క్ స్లైసింగ్ అంటే ఒకే 5G నెట్‌వర్క్‌ను అనేక ప్రత్యేక భాగాలుగా విభజించి, ఒక్కో కస్టమర్‪కు అవసరమైన స్పీడ్, సామర్థ్యం, లేటెన్సీ వంటి అంశాలను ప్రత్యేకంగా కేటాయించడం.

జియో, ఎయిర్‌టెల్ సిద్ధం చేసిన కొత్త సేవలు
భారత టెలికాం దిగ్గజాలు ఇప్పటికే 5G నెట్‌వర్క్ స్లైసింగ్ అవకాశాలపై దృష్టి పెట్టాయి. ముఖ్యంగా ఎయిర్‌టెల్ తొలుత “Priority” పేరుతో ప్రారంభించిన సర్వీసును తర్వాత “Fast Lane”గా మార్చింది. ప్రీమియం వినియోగదారులకు వేగవంతమైన, మెరుగైన సర్వీస్ అనుభవాన్ని అందించడమే దీని ఉద్దేశం.

ప్రీమియం సేవలకు ప్రత్యేక సౌకర్యం.. 
TRAI ప్రతిపాదించిన డ్రాఫ్ట్ రూల్స్ ప్రకారం టెలికాం సంస్థలు ప్రీమియం కస్టమర్లకు ప్రత్యేక 5G స్లైస్‌లను అందించవచ్చు. అయితే దీని కారణంగా సాధారణ వినియోగదారుల సేవల్లో నాణ్యత తగ్గకూడదని రెగ్యులేటర్ స్పష్టం చేసింది. అంటే అదనపు రుసుము చెల్లించని కస్టమర్లకు కూడా సరైన వేగం, నాణ్యమైన కనెక్టివిటీ కొనసాగాలి. సాధారణ వినియోగదారుల అనుభవం దెబ్బతింటే టెలికాం కంపెనీలపై చర్యలు, జరిమానాలు ఉండే అవకాశం ఉంది.

4G, 5G ధరల్లో మార్పులకు అవకాశం
కొత్త నిబంధనల ప్రకారం టెలికాం కంపెనీలు 4G, 5G సేవలకు వేర్వేరు ధరలను నిర్ణయించే అవకాశం పొందనున్నాయి. ఇప్పటివరకు దేశంలో 5G సేవలకు ప్రత్యేక ఛార్జీలు వసూలు చేయలేదు. అయితే కంపెనీలు 2GB రోజువారీ డేటా ప్లాన్‌లు, పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు మాత్రమే 5G యాక్సెస్ పరిమితం చేశాయి. ఇది టెలికాం సంస్థలకు ఆదాయాలను పెంచుకునే అవకాశాన్ని కల్పించింది. భవిష్యత్తులో నెట్‌వర్క్ స్లైసింగ్ ద్వారా మరింత ప్రత్యేకమైన ప్లాన్‌లు అందుబాటులోకి రావచ్చు.

ALSO READ : ఏడాది పని.. 30 కొత్త ప్రొడక్టులు..

TRAI పర్యవేక్షణతో పారదర్శకత
నెట్‌వర్క్ స్లైసింగ్ అమలులో భాగంగా ప్రతి రేడియో నెట్‌వర్క్ సెల్‌లో ఏ స్లైస్‌కు ఎంత సామర్థ్యం కేటాయిస్తున్నారో టెలికాం కంపెనీలు TRAIకి వెల్లడించాల్సి ఉంటుంది. ఈ వివరాల సమర్పణ అక్టోబర్ 2026 నుంచి స్టార్ట్ కానుంది. 5G నెట్‌వర్క్ స్లైసింగ్ ద్వారా గేమింగ్, ఎంటర్‌ప్రైజ్ సేవలు, వీడియో స్ట్రీమింగ్, అత్యవసర కమ్యూనికేషన్ వంటి రంగాల్లో కొత్త అవకాశాలు తెరుచుకోనున్నాయి. అయితే ఈ కొత్త సాంకేతికత విజయవంతం కావాలంటే ప్రీమియం సేవలతో పాటు సాధారణ వినియోగదారుల హక్కులను కూడా సమానంగా కాపాడాల్సి ఉంటుంది.