సోషల్ మీడియా దిగ్గజం Xలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎలాన్ మస్క్ నియమించిన ప్రొడక్ట్ హెడ్ నికితా బియర్ తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. గత ఏడాది జూన్‌లో Xలో చేరిన ఆయన.. దాదాపు ఏడాది పాటు ప్లాట్‌ఫామ్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. “టార్చ్‌ను మరో వ్యక్తికి అందించే సమయం వచ్చింది.. ఇక నా సహజ స్థితి అయిన పోస్టర్‌గా మారుతున్నాను” అంటూ నికితా తన ఎగ్జిట్ మెసేజ్ లో పంచుకున్నారు.
నికితా బియర్ తన పదవీకాలంలో Xలో అనేక కీలక మార్పులు తీసుకొచ్చారు. అకౌంట్ ఏ దేశం నుంచి నిర్వహిస్తున్నారో చూపించే “About This Account” ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. దీంతో తమ అసలు గుర్తింపును దాచుకుని వేరే దేశాల పేర్లతో పనిచేస్తున్న కొన్ని అకౌంట్లు బయటపడ్డాయి. అలాగే ఎంగేజ్‌మెంట్ కోసం ఫేక్ పద్ధతులు పాటించే వారిపై చర్యలు తీసుకోవడం, ఇతరుల కంటెంట్‌ను కాపీ చేసే క్రియేటర్లపై నియంత్రణ వంటి నిర్ణయాలు కూడా ఈయనే తీసుకున్నారు.
అదే సమయంలో Xలో కొత్త ఫీచర్ల అభివృద్ధిపై కూడా నికితా దృష్టి పెట్టారు. ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ కోసం X Chat వంటి సేవలను ప్రారంభించారు. తన టీమ్‌తో కలిసి ఏడాది కాలంలో దాదాపు 30 కొత్త ఉత్పత్తులపై పని చేశామని తెలిపారు. X యూజర్లు, ఎంగేజ్‌మెంట్‌లో భారీ గ్రోత్ సాధించిందని, యాప్ స్టోర్ ర్యాంకింగ్‌లో కూడా మెరుగైన స్థానం సాధించిందన్నారు.
నికితా బియర్ నిష్క్రమణపై ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. “ఈ ప్లాట్‌ఫామ్‌ను మెరుగ్గా మార్చడంలో మీ సహకారం ఎంతో విలువైనది. మీరు మిస్ అవుతారు” అని పేర్కొన్నారు. అయితే Xకు సంబంధించిన కొన్ని వివాదాలు కూడా కాలంలోనే ఎదురయ్యాయి. ముఖ్యంగా AI చాట్‌బాట్ Grok విషయంలో వచ్చిన విమర్శలు ప్లాట్‌ఫామ్‌పై చర్చకు దారితీశాయి.
స్టార్టప్ రంగంలో గుర్తింపు పొందిన నికితా బియర్‌ను వైరల్ ప్రొడక్ట్స్ సృష్టించే వ్యక్తిగా భావిస్తారు. ఆయన స్థాపించిన tbh యాప్‌ను ఫేస్‌బుక్, Gas యాప్‌ను డిస్కార్డ్ కొనుగోలు చేశాయి. ప్రస్తుతం ఆయన Xకు సలహాదారుగా కొనసాగనున్నారు. ఇక కొత్త ప్రొడక్ట్ హెడ్ ఎవరు అవుతారనే అంశంపై ఆసక్తి నెలకొంది. నికితా లేకుండా X తన నెక్స్ట్ ఫేజ్ జర్నీని ఎలా కొనసాగిస్తుందనేది ఇప్పుడు టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది.
