న్యూఢిల్లీ: జూన్ 14న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సృష్టి దూబే అనే విద్యార్థిని అభ్యర్థన మేరకు.. అధికారులు పరీక్షా కేంద్రంలో ప్రత్యేక రూమ్, మెడికల్ సపోర్ట్, స్టాండ్‌బై అంబులెన్స్ ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా ఆమె తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడారు. భారీ వర్షాల కారణంగా కోల్‌కతాలో ట్రాఫిక్ నిలిచిపోవడంతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులుబ పడ్డారు.
భోపాల్‌లో ప్రమాదం కారణంగా కొద్ది నిమిషాలు ఆలస్యంగా వచ్చిన ఇద్దరు విద్యార్థులను లోపలికి అనుమతించలేదు. ఇక రాజస్తాన్‌లోని అజ్మీర్‌లో కుల్సుమ్ బానో అనే విద్యార్థిని బురఖా ధరించి రావడంతో అధికారులు మొదట నిరాకరించినట్టు వార్తలు వచ్చాయి. ‘నాకు పరీక్ష కంటే నా గుర్తింపు, బురఖా ముఖ్యం’ అని ఆమె స్పష్టం చేసింది. అయితే ఆ తర్వాత ఎన్టీఏ జోక్యం చేసుకొని ప్రొటోకాల్ ప్రకారం తనిఖీ చేసి ఆమెను పరీక్షకు అనుమతించినట్టు స్పష్టత ఇచ్చింది.
ముంబైలో రవాణా కార్మికుల సమ్మె జరుగుతున్నప్పటికీ.. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ విద్యార్థుల కోసం 60 ప్రత్యేక బస్సుల ద్వారా 180 ట్రిప్పులు నడిపి అభ్యర్థులను కేంద్రాలకు చేర్చింది. ఢిల్లీలో విద్యార్థులకు తోడుగా వచ్చిన పేరెంట్స్ కోసం సెంటర్ల వద్ద అధికారులు కూలింగ్ జోన్లు ఏర్పాటు చేశారు.
