- ఉద్ధవ్ సేన ఎంపీ సంజయ్ రౌత్
ముంబై: ప్రజాగ్రహానికి భయపడి కొందరు అసమ్మతి ఎంపీలు తిరిగి తమ పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నారని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ ఆదివారం తెలిపారు. జూన్ 17న ఢిల్లీలో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరుకాని రెబెల్ ఎంపీలు సాంకేతికంగా ఇంకా తమ పార్టీలోనే ఉన్నారని స్పష్టం చేశారు. ఈ విషయంలో స్పీకర్ ఓం బిర్లా నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదన్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై రౌత్ మండిపడ్డారు. మహారాష్ట్రలో ఒకటే శివసేన ఉందని, అది ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలో కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ పరిణామాలపై మంత్రి గిరీశ్ మహాజన్ స్పందిస్తూ.. ఓ వైపు వెళ్లాలనుకునే వారు వెళ్లొచ్చని రెబెల్ ఎంపీలపై ఫైర్ అయ్యారని, ఆ మరుసటి రోజు అదే ఎంపీలపై సేన (యూబీటీ) మెత్తబడిందని ఎద్దేవా చేశారు. ఉద్ధవ్ థాక్రే తీరుపై అసంతృప్తితోనే నేతలు ఆ పార్టీని వీడుతున్నారని మహాజన్ చెప్పారు.
