12 ఓవర్లకి 12 పాయింట్లు కట్.. ఇంగ్లాండ్‌కు గట్టి షాక్ ఇచ్చిన ఐసీసీ

12 ఓవర్లకి 12 పాయింట్లు కట్.. ఇంగ్లాండ్‌కు గట్టి షాక్ ఇచ్చిన ఐసీసీ

ICC Penalty England Team: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్ జట్టుకు ఒకేసారి రెండు షాక్స్ తగిలాయి. ఒకవైపు రెండో టెస్టులో కివీస్ చేతిలో 253 రన్స్ తేడాతో ఘోర పరాజయం చవిచూడగా, మరోవైపు స్లో ఓవర్ రేట్ కారణంగా ఐసీసీ (ICC) ఆ జట్టుకు భారీ పెనాల్టీ విధించింది. ఈ పరిణామాలతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ చేరాలనే ఇంగ్లాండ్ ఆశలు మరింత సంక్లిష్టంగా మారాయి. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పట్టికలో ఇంగ్లాండ్ ఏడో స్థానంలో నిలిచింది. 

12 ఓవర్లు లేట్.. 12 పాయింట్లు కట్: 
ఆదివారం ముగిసిన రెండో టెస్టులో ఇంగ్లాండ్ ఓడిపోవడంతో డబ్ల్యూటీసీ పట్టికలో ఆ జట్టు పర్సంటేజీ 34.72 శాతం నుంచి ఒక్కసారిగా 26.38 శాతానికి పడిపోయింది. ఈ టెస్టు మ్యాచ్‌కు ముందు ఇంగ్లాండ్ ఖాతాలో 50 పాయింట్లు ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ నిర్ణీత సమయం కంటే ఏకంగా 12 ఓవర్లను ఆలస్యంగా వేయడంతో 12 పాయింట్లను కోల్పోవాల్సి వచ్చింది. దీంతో ఇంగ్లాండ్ పాయింట్ల సంఖ్య 38కి పడిపోయింది.

ఇంగ్లాండ్ జట్టుకు మ్యాచ్ ఫీజులో 50 శాతం ఫైన్: 
రెగ్యులర్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అందుబాటులో లేకపోవడంతో ఈ మ్యాచ్‌కు జో రూట్ తాత్కాలిక సారథిగా కొనసాగారు. స్లో ఓవర్ రేట్ కారణంగా కేవలం పాయింట్ల కోత మాత్రమే కాకుండా, కెప్టెన్‌గా వ్యవహరించిన జో రూట్‌తో పాటు జట్టులోని సహచరులందరికీ ఐసీసీ 50 శాతం మ్యాచ్ ఫీజును జరిమానాగా విధించింది. 

ALSO READ : నేడే అర్జెంటీనా vs ఆస్ట్రియా బిగ్ ఫైట్..

కెప్టెన్ బెన్ స్టోక్స్ రీ-ఎంట్రీ: 
ఇంగ్లాండ్ ఫ్యాన్స్‌కు ఒక గుడ్ న్యూస్.. బాక్సర్‌తో గొడవ కారణంగా రెండో టెస్టుకు దూరమైన రెగ్యులర్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మళ్లీ తుది జట్టులోకి రాబోతున్నాడు. న్యూజిలాండ్‌తో జరగబోయే మూడో టెస్టు కోసం ప్రకటించిన స్క్వాడ్‌లో అతనికి చోటు లభించింది. కెప్టెన్ తిరిగి రావడంతో ఇప్పుడు తుది జట్టు (Playing XI) నుంచి ఎవరిని పక్కన పెడతారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం సిరీస్ 1–1తో సమంగా ఉండటంతో, సిరీస్ విజేతను తేల్చే మూడో టెస్టు జూన్ 25 నుంచి నాటింగ్‌హామ్ వేదికగా స్టార్ట్ కానుంది.