ఐపీఎల్‌లో మరో బిగ్ ట్రేడ్: హార్దిక్ కోసం రాజస్థాన్ ప్రయత్నం.. ఆ స్టార్ ప్లేయర్ని ఇవ్వమన్న ముంబై!

ఐపీఎల్‌లో మరో బిగ్ ట్రేడ్: హార్దిక్ కోసం రాజస్థాన్ ప్రయత్నం.. ఆ స్టార్ ప్లేయర్ని ఇవ్వమన్న ముంబై!

Hardik Pandya Trade: ఐపీఎల్‌ 2026 సీజన్ ముగిసిన తర్వాత ముంబై ఇండియన్స్ (MI) ఫ్రాంచైజీలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్‌కు వచ్చి జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, ఇప్పుడు ఆ జట్టును వీడేందుకు సిద్ధమయ్యాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్ల మధ్య వచ్చిన విభేదాల వల్లే హార్దిక్ ముంబై ఫ్రాంచైజీని వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. 

రాజస్థాన్ నుంచి ముంబైకి రానున్న డాషింగ్ ఓపెనర్: 
రెవ్‌స్పోర్ట్స్ (RevSportz) నివేదిక ప్రకారం.. హార్దిక్ పాండ్యాను ట్రేడ్ చేసుకోవడానికి రాజస్థాన్ రాయల్స్ (RR) ఫ్రాంచైజీ రేసులో ముందుంది. ఈ డీల్‌లో భాగంగా రాజస్థాన్ తమ స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను ముంబై ఇండియన్స్‌కు అప్పగించనుండగా, హార్దిక్ పాండ్యా ఆర్ఆర్ గూటికి చేరనున్నాడు. ముంబై రంజీ జట్టుకు ఆడే జైస్వాల్‌కు, ఎంఐ ఫ్రాంచైజీలోకి రావడం ఒక పర్ఫెక్ట్ హోమ్‌కమింగ్ లాంటిదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

అందుకే ముంబై వైపు జైస్వాల్ చూపు:
గత ఏడాది కాలంగా యశస్వి జైస్వాల్ భవిష్యత్తుపై అనేక ఊహాగానాలు కొనసాగుతున్నాయి. సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ నుంచి నిష్క్రమించిన తర్వాత జైస్వాల్ ఆ జట్టుకు బిగ్గెస్ట్ స్టార్ అవుతాడని, అలాగే కెప్టెన్సీ రేసులోనూ అతనే ముందుంటాడని అందరూ అనుకున్నారు. కానీ రాజస్థాన్ మేనేజ్‌మెంట్ జైస్వాల్‌ను కాదని రియాన్ పరాగ్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. అంతేకాదు, బ్యాటింగ్ విభాగంలో 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ అదిరిపోయే పర్ఫామెన్స్‌తో మోస్ట్ ఎక్సైటింగ్ టాలెంట్‌గా ఎదిగాడు. దీంతో తన కెరీర్‌ను మళ్లీ ట్రాక్‌లో పెట్టడానికి రాజస్థాన్ నుంచి బయటకు రావడమే జైస్వాల్‌కు ఉత్తమమైన ఆప్షన్‌ అని భావించాడు. 

ముంబైలో సీనియర్ల ప్రక్షాళన: 
ముంబై ఇండియన్స్ కేవలం హార్దిక్ పాండ్యానే కాదు, జట్టులోని వయసు పైబడుతున్న సీనియర్ స్టార్లను వదిలించుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే టీ20 స్పెషలిస్ట్ సూర్యకుమార్ యాదవ్ కూడా కొత్త టీమ్ కోసం చూస్తున్నట్లు టాక్. ఉత్తరాదికి చెందిన రెండు ఫ్రాంచైజీలు సూర్యకు కెప్టెన్సీ ఆఫర్ ఇస్తూ తమ జట్టులోకి లాగేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.

ALSO READ : ఐపీఎల్ బిగ్గెస్ట్ ట్రేడ్ డీల్

ముంబై ఇండియన్స్ నెక్స్ట్ ప్లాన్: 
రోహిత్ శర్మ కెరీర్ ముగింపు దశకు రావడం, మరోవైపు హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ ఇద్దరూ జట్టును వీడే ఆలోచనలో ఉండటంతో ముంబై ఇండియన్స్‌కు తమ భవిష్యత్తు జట్టును నిర్మించడానికి కొత్త సూపర్ స్టార్స్ అవసరం ఉంది. 3 ఫార్మాట్లలోనూ టీమిండియాలో కీలక సభ్యుడిగా ఉన్న యశస్వి జైస్వాల్ ముంబైకి పర్ఫెక్ట్ ఛాయిస్ అవుతాడు. కానీ ముంబై ఇండియన్స్ జైస్వాల్‌కు జట్టు కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పగిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.