ఖమ్మం, వెలుగు: ఆసుపత్రుల్లో వైద్య సేవలతో పాటు పరిపాలనపైనా డాక్టర్లు దృష్టి పెట్టాలని ఖమ్మం కలెక్టర్ దివాకర సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో అడిషనల్ కలెక్టర్ డాక్టర్ శ్రీజతో కలిసి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ పనితీరుపై రివ్యూ చేశారు. అన్ని ఆసుపత్రుల్లో ఉన్న పరికరాల పనితీరుపై సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం ప్రతి పీహెచ్‌సీ ల్యాబ్ లో సామగ్రిని అందుబాటులో ఉంచాలని సూచించారు.
హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ లక్ష్యాలను పూర్తి చేయాలని, సమయపాలన పాటించాలని, ఆసుపత్రుల్లో అనవసర గందరగోళానికి తావులేకుండా చూడాలన్నారు. డాక్టర్లు అందుబాటులో లేరనే పరిస్థితి రాకుండా చూసుకోవాలన్నారు. డీఎంహెచ్వో రామారావు, అడిషనల్ డీఎంహెచ్ వో చందు నాయక్, ఎన్‌సీడీ పీవో అరుణాదేవి పాల్గొన్నారు.
