ఆయిల్ పామ్ రైతుల తలరాతను మారుస్తది..మూడేండ్లలో 10 లక్షల ఎకరాల్లో విస్తరింపజేస్తం

ఆయిల్ పామ్ రైతుల తలరాతను మారుస్తది..మూడేండ్లలో 10 లక్షల ఎకరాల్లో విస్తరింపజేస్తం
  •   పర్యావరణాన్ని కాపాడకపోతే భవిష్యత్ లో..
  •  ప్రమాదాలు తప్పవు : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

అశ్వారావుపేట/దమ్మపేట, వెలుగు : ఆయిల్ పామ్ సాగు రైతుల తలరాతను మారుస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం గుత్తవారిగూడెం గ్రామంలో ఆదివారం నిర్వహించిన ఆయిల్ పామ్ రైతుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి హాజరయ్యారు.

 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 31 జిల్లాల్లో రెండు సంవత్సరాల్లో రెండు లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ ను సాగు చేయించామన్నారు. రాబోయే మూడేండ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల ఎకరాల్లో సాగు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఖమ్మం జిల్లాలోని కల్లూరుగూడెం, వైరా నియోజకవర్గాలలో ఈ ఏడాది పామాయిల్ ఫ్యాక్టరీలను  ప్రారంభించ బోతున్నట్లు ప్రకటించారు. 

వరి, పత్తి, మొక్కజొన్న మార్కెటింగ్ విధానాల వల్ల రైతులు నష్టపోతున్నారన్నారు. దీనిని నివారించేందుకే పంట మార్పిడికి వెళ్లాలని రైతులకు సూచిస్తున్నామన్నారు. ఇతర దేశాల నుంచి పంటల దిగుమతి కారణంగా స్థానిక పంటకు డిమాండ్ లేక రేట్లు పడిపోతున్నాయన్నారు. ఎల్ నినో కారణంగా రుతుపవనాలు మందగించి వర్షాలు ముఖం చాటేశాయని, భవిష్యత్ లో మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. 

పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం వల్లే ఈ సమస్యను అధిగమించొచ్చని చెప్పారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ సుంకపల్లి వీరభద్రరావు, దమ్మపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి, దమ్మపేట సర్పంచ్ పడాల రమాదేవి, నాయకులు మురళి మహిపాల్, పైడి వెంకటేశ్వరరావు, దొడ్డకుల రాజేశ్వరరావు, కేవీ. సత్యనారాయణ, కొయ్యల అచ్యుతరావు పాల్గొన్నారు.