భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సింగరేణి మెడికల్ బోర్డు దందాలో మణుగూరు ఏరియా హాస్పిటల్ లో వార్డు బాయ్‌గా పని చేస్తున్న మల్లికార్జున్ ను డిస్మిస్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. కొత్తగూడెంలోని సింగరేణి మెయిన్ హాస్పిటల్ లో పని చేస్తున్న సమయంలో డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ లో భాగంగా నిర్వహించిన మెడికల్ బోర్డు దందాలో మల్లికార్జున్ హస్తం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. విజిలెన్స్ తో పాటు డిపార్ట్మెంట్ ఎంక్వైరీ అనంతరం మల్లికార్జున్ ను ఉద్యోగం నుంచి యాజమాన్యం తొలగించింది.
గతేడాది కొత్తగూడెంలోని సింగరేణి మెయిన్ హాస్పిటల్లో ఎక్స్‌రే టెక్నీషియన్ గా పని చేస్తున్న ఒకరిని ఇప్పటికే యాజమాన్యం డిస్మిస్ చేయగా, అంతకుముందు ఓ సెక్యూరిటీ గార్డును ఉద్యోగం నుంచి తొలగించింది. అక్రమాల్లో అధికారుల పాత్ర ఉన్నప్పటికీ, వారిని బదిలీ చేసి చేతులు దులుపుకుందని, కార్మికులను మాత్రం ఉద్యోగాల నుంచి తొలగిస్తోందని పలువురు విమర్శిస్తున్నారు. మెడికల్ బోర్డు అక్రమాలపై ఏసీబీ విచారణ నివేదికలను బయటపెట్టాలని కోరుతున్నారు.
