న్యూఢిల్లీ: అయోధ్య రామమందిర విరాళాల్లో అవకతవకల కేసు సుప్రీంకోర్టుకు చేరింది. రామ జన్మభూమి ట్రస్ట్‌కు సంబంధించిన ఆర్థిక అవకతవకలపై సమగ్ర దర్యాప్తు కోరుతూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. న్యాయవాదులు అజయ్ కుమార్ రాయ్, దినేష్ కుమార్ యాదవ్ సంయుక్తంగా ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు సంబంధించిన ఆర్థిక అవకతవకలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి.. సీబీఐ నేతృత్వంలో సిట్ దర్యాప్తు చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. భక్తుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు పటిష్టమైన ఆడిట్, పర్యవేక్షణ యంత్రాంగాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలీ.
అసలేం జరిగిందంటే..?
అయోధ్య రామ మందిర విరాళాల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. రామ మందిర ప్రాంగణంలోని విరాళాల పెట్టెల నుంచి డబ్బు మాయమైందని ప్రతిపక్ష సమాజ్ వాదీ, కాంగ్రెస్ పార్టీలు ఆరోపించాయి. ఈ ఘటనపై విచారణ చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.
మరోవైపు.. ఆలయ ప్రతిష్టను దెబ్బతీసే లక్ష్యంగా జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కోవడానికి.. వాస్తవాలను నిర్ధారించుకోవడానికి విచారణకు ఆదేశించాలని శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కూడా ప్రభుత్వాన్ని కోరింది. ప్రతిపక్షాల డిమాండ్, ట్రస్ట్ అభ్యర్థన మేరకు రామ మందిర విరాళాల వివాదంపై యోగి సర్కార్ సిట్ విచారణకు ఆదేశించింది.
►ALSO READ | బెంగాల్ పాలిటిక్స్‌లో సంచలనం: TMC చీఫ్‌గా మమతా బెనర్జీ ఔట్.. అభిషేక్ బెనర్జీ సస్పెండ్
ఈ మేరకు లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కిరణ్ ఎస్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి నీల్ రతన్ ముగ్గురు సభ్యులతో కూడిన సిట్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ వివాదంపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి, నివేదిక సమర్పించాలని ప్రభుత్వం సిట్ను ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కేసును సీరియస్గా తీసుకున్న సిట్.. అయోధ్యలోని రామ మందిర ట్రస్ట్కు సంబంధించిన విరాళాలు, ఆర్థిక నిర్వహణపై లోతుగా విచారణ చేపట్టింది.
ఇందులో భాగంగా ఆలయ విరాళాల లెక్కింపుతో సంబంధం ఉన్న పలువురు ఉద్యోగులు, సిబ్బందిని సిట్ విచారించింది. ఆరు రోజుల పాటు పలువురిని ప్రశ్నించింది. స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) సీసీటీవీ ఫుటేజ్తో పాటు ఇతర సాంకేతిక, భౌతిక సాక్ష్యాలను పరిశీలించింది. ఆరు రోజుల విచారణ అనంతరం కేసుకు సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు నివేదికను సీఎంకు అందజేసింది సిట్. ఓ వైపు సిట్ విచారణ జరుగుతుండగానే.. మరోవైపు ఈ కేసు సుప్రీం కోర్టుకు చేరడం గమనార్హం.
