- స్టేషనరీ, యూనిఫాం అన్నీ స్కూల్లోనే కొనాలని హుకుం
- మార్కెట్‌లో రూ.2 వేలు అయ్యే వస్తువులకు స్కూల్లో రూ.20 వేలు వసూలు
- పలు బడుల్లో యాప్ ద్వారా బుకింగ్.. ఇంటికే డెలివరీ
హైదరాబాద్, వెలుగు : స్టూడెంట్లకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన స్కూళ్లు ప్రస్తుతం స్టేషనరీ, టైలరింగ్ షాపులుగా మారిపోయాయి. పలు ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు కమర్షియల్ కాంప్లెక్స్ లను తలపిస్తున్నాయి. స్టూడెంట్లకు కావాల్సిన యూనిఫామ్ తో సహా పుస్తకాలు, నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, బూట్లు, టై, బెల్ట్ తో పాటు చివరకు బ్యాగ్ సైతం తమ వద్ద గానీ, తాము చెప్పిన చోట గానీ కొనాలని ఆదేశాలు జారీ చేస్తున్నాయి. తప్పని పరిస్థితుల్లో కొనేందుకు వెళ్తున్న తల్లిదండ్రులకు అక్కడి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.
బయట మార్కెట్ లో దొరికే ధర కంటే మూడు, నాలుగు రెట్లు ఎక్కువ వసూలు చేస్తూ పేరెంట్స్ ను నిలువు దోపిడీ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం అకాడమిక్ ఇయర్ ప్రారంభంలో ఈ వ్యవహారం జరుగుతున్నా స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
స్కూల్ లోనే స్టేషనరీ షాప్
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 11 వేల ప్రైవేట్ స్కూళ్లలో 32 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆయా బడుల్లో ప్రీప్రైమరీ నుంచి టెన్త్ వరకు సెక్షన్లు కొనసాగుతున్నాయి. స్కూల్ ఆవరణలో ఎలాంటి అమ్మకాలు జరపకూడదు. కానీ, హైదరాబాద్ సహా పలు ప్రధాన నగరాలు, పట్ణణాల్లోని కార్పొరేట్ తో పాటు పలు ప్రైవేట్ స్కూళ్లు.. వాటి ఆవరణలోనే స్టేషనరీ షాప్ లను తెరిచేశారు. టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, వర్క్ షీట్లు అంటూ అధిక ధరలకు పేరెంట్స్ కు అంటగడుతున్నారు. ఒకటో తరగతి చదివే చిన్నారికి ఏకంగా 20 నుంచి 40 పుస్తకాలు కొనిపిస్తున్నారు. అదే స్థాయిలో నోట్ బుక్స్కూడా తీసుకోవాలని డిమాండ్చేస్తున్నారు.
వీటి అవసరం లేకున్నా సిలబస్, ప్రాక్టీస్ పేరుతో పేరెంట్స్‌కు అమ్మేస్తున్నారు. ఎల్‌కేజీ, యూకేజీ పిల్లలకు కూడా కిలోల కొద్దీ పుస్తకాలను అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. బయట మార్కెట్‌లో రూ.1500 నుంచి రూ.2 వేల లోపు వచ్చే పుస్తకాలు, బుక్స్ కిట్‌కు స్కూళ్లలో రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు చార్జ్ చేస్తున్నారు.
సాక్సులు, షూలనూ వదలట్లేదు
ప్రైవేట్ స్కూళ్ల దందా పుస్తకాలకే పరిమితం కాకుండా షూస్, సాక్స్, టై, బెల్టులు, బ్యాగుల వరకు చేరింది. స్టూడెంట్ కు అవసరమైన ప్రతి వస్తువును తమ వద్దే కొనాలని హుకుం జారీ చేస్తున్నారు. కొన్ని స్కూళ్లు రెండు రకాల యూనిఫాంలు (రెగ్యులర్, స్పోర్ట్స్ వేర్) పెట్టి వాటికి వేలల్లో ధర నిర్ణయించాయి. కొన్ని కార్పొరేట్ స్కూళ్లు మాత్రం ముందుగానే కొన్ని సంస్థలు, షాపులతో ఒప్పందం కుదుర్చుకొని వారి వద్దే కొనాలని ఆదేశాలిస్తున్నాయి.
యాప్ లో బుక్ చేస్తే హోం డెలివరీ
కొన్ని కార్పొరేట్ స్కూళ్లు ఆఫీసర్ల కళ్లు గప్పేందుకు కొత్త దారిని ఎంచుకున్నాయి. స్కూల్లో అమ్మితే ఆఫీసర్లు తనిఖీలకు వచ్చిన సమయంలో ఇబ్బంది అవుతుందన్న భయంతో... ప్రత్యేకంగా యాప్స్ రూపొందించాయి. దాని లింక్ ను పేరెంట్స్‌కు పంపించి యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఆర్డర్ చేయాలని చెబుతున్నారు. తర్వాత డెలివరీ చార్జీల పేరుతో అదనంగా వసూలు చేసి వస్తువులను హోం డెలివరీ చేస్తున్నారు.
పట్టించుకోని ఆఫీసర్లు
రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేట్, ప్రైవేట్ బడుల్లో ఈ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. ప్రైవేట్ స్కూళ్లలో బహిరంగంగానే ఈ దందా నడుస్తున్నా ఆఫీసర్లు మాత్రం అటువైపు కన్నెత్తి చూడడం లేదు. విద్యాసంవత్సరం ప్రారంభంలో.. స్కూళ్లను తనిఖీలు చేస్తామని ప్రకటనలు ఇవ్వడమే తప్ప.. ఏ ఒక్క స్కూల్ పైనా కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అయితే, ఆఫీసర్ల అండదండలతోనే మేనేజ్మెంట్లు ఈ దందా సాగిస్తున్నాయని పేరెంట్స్ ఆరోపిస్తున్నాయి. ఈ దందాను ఆపేలా సర్కారు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
స్కూళ్లపై చర్యలు తీసుకోవాలి
నగరంలోని దాదాపు అన్ని ప్రైవేట్ స్కూళ్లలో యూనిఫామ్స్, బుక్స్, స్టేషనరీ అమ్మకాలు సాగుతున్నాయి. భారీగా రేట్లు వసూలు చేస్తూ, నాణ్యత లేని వాటిని అంటగడుతున్నారు. వెంటనే విద్యాశాఖ అధికారులు బడుల్లో తనిఖీలు నిర్వహించి, ఈ వ్యాపారాలు చేస్తున్న స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి.
- అశోక్ రెడ్డి, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు-
