- ఎన్ఎంఎంఎస్ కు 40 మంది
- అడ్మిషన్ల కోసం పోటాపోటీ..
మంచిర్యాల/జన్నారం, వెలుగు: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కిష్టాపూర్ లోని గవర్నమెంట్ హైస్కూల్ కార్పొరేట్‌కు దీటుగా నిలుస్తోంది. స్కూల్లో అత్యుత్తమ విద్యాబోధన సాగుతుండడంతో తమ పిల్లల అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులు పోటీ పడుతున్నారు. ఇప్పటివరకు కొత్తగా వచ్చిన 200 అడ్మిషన్లను కలపుకుని 565 మంది విద్యార్థులు స్కూల్లో చదవుతున్నారు. 19 మంది టీచర్లు విద్యాబోధన చేస్తున్నారు. ప్రైవేట్ స్కూళ్లను వదులుకొని విద్యార్థుల తల్లిదండ్రులు ఇక్కడ జాయిన్ చేస్తున్నారు. దీంతో ఏటా స్కూల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. గత బుధవారం ఒక్క రోజు వంద మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారు.
వంద శాతం రిజల్ట్
టీచర్లు అత్యుత్తమ విద్యాబోధన అందిస్తుండడంతో కిష్టాపూర్ స్కూల్లో చదువుకున్న ఎంతో మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీ, కార్పొరేట్ కాలేజీల్లో సీట్లు సాధించారు. 2023–24లో టెన్త్‌లో133 మంది విద్యార్థులకు గాను 98 శాతం రిజల్ట్ రాగా, 2024–25లో 127 మందిలో అందరూ పాసయ్యారు. 2025–26 లో 111 మంది విద్యార్థులకు గాను 99 శాతం రిజల్ట్ వచ్చింది. ఈ మూడేండ్లలో 14 మంది స్టూడెంట్లు ట్రిపుల్ ఐటీకి ఎంపికై సత్తా చాటారు. ఈ స్కూల్ నుంచి ఏటా ఎన్ఎంఎంఎస్ (నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్స్ స్కీమ్) కు ఎంపికవుతున్నారు. 2023–24లో 15 మంది, 2024–25లో 11 మంది, 2025–26లో 14 మంది ఎంపికయ్యారు. 2023–2026 మధ్యలో 40 మంది విద్యార్థులు ఎన్ఎంఎంఎస్ కు ఎంపిక కావడంతో జిల్లాలోనే స్కూల్ టాప్‌లో నిలిచింది.
పోటీల్లోనూ టాప్
ఈ స్కూల్స్టూడెంట్లు చదవుల్లోనే గాకుండా వివిధ పోటీల్లోనూ సత్తాచాటుతున్నారు. స్కూల్ కు చెందిన 9వ తరగతి విద్యార్థిని ఆకుల అరణ్య ఫిజికల్ సైన్స్ టాలెంట్ పోటీల్లో స్టేట్ లెవల్లో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. ఇంగ్లీషు టాలెంట్ పోటీల్లో అరవింద రాణి రెండో స్థానం సాధించింది. దేశ అర్థికాభివృద్ధిపై తీసుకోవాల్సిన చర్యలపై గతేడాది వారధి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో కట్ల సాకేత, దుంపటి అక్షిత, ఈర్ల రిషిక స్టేట్ లెవల్ లో మొదటి బహుమతిని గెలుచుకోగా, డిబేట్లో అరవిందరాణి, వర్షిత, త్రివేద రెండో ప్లేస్‌లో నిలిచి రూ.63 వేల ప్రైజ్ మనీ సాధించారు.
ఫిన్లాండ్కు టీచర్ కమలాకర్
విదేశీ విద్యను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత ఏప్రిల్‌లో ఫిన్లాండ్ దేశానికి రాష్ట్రం నుంచి పంపించిన 28 మంది ఉపాధ్యాయుల్లో ఈ స్కూల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న దామక కమలాకర్ కూడా ఉన్నారు. మిగతా టీచర్లతో కలిసి ఫిన్లాండ్లోని ప్రభుత్వ స్కూళ్లను సందర్శించి ఆ దేశంలో అమలవుతున్న విద్య విధానాన్ని అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపించారు.
టీచర్ల ప్రోత్సాహంతోనే..
స్కూల్ లో టీచర్లు ఇచ్చిన ప్రోత్సాహం వల్లనే మంచిగా చదవుకున్నా. క్రమంతప్పకుండా స్కూల్‌కు వెళ్లి టీచర్లు చెప్పే పాఠాలను శ్రద్ధగా విని, చదివి టెన్త్‌లో జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచాను. ఇప్పుడు ట్రిపుల్ ఐటీలో చదువుతున్నా. చదువు చెప్పిన టీచర్ల రుణం తీర్చుకోలేనిది.
– రాథోడ్ యోగేశ్వర్, ట్రిపుల్ ఐటీ విద్యార్థి
ఉపాధ్యాయుల సమష్టి కృషి వల్లనే..
ఉపాధ్యాయులు సమిషి కృషి వల్లనే కిష్టాపూర్ గవర్నమెంట్ హైస్కూల్ మెరుగైన ఫలితాలు సాధిస్తోంది. ప్రణాళికా పరంగా విద్యాబోధన చేస్తుండడంతో విద్యార్థులు ప్రతి పరీక్షల్లో ప్రతిభ కనబరుస్తున్నారు. ప్రతి ఏటా మా స్కూల్ కు జిల్లా, రాష్ట్రస్థాయిలో బహుమతులు, ప్రశంసాపత్రాలు రావడం ఆనందంగా ఉంది.-
గుండా రాజన్న, హెడ్ మాస్టర్
