భారతదేశం వేల ఏళ్ల క్రితమే జ్ఞానం, విజ్ఞానం, వైద్యం, ఆధ్యాత్మికతలకు నిలయంగా ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. మన రుషులు, మునులు మానవ జీవితాన్ని ఆరోగ్యవంతంగా, ఆనందమయంగా, ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దే ఎన్నో విద్యలను ప్రపంచానికి అందించారు. అలాంటి భారతీయ సంస్కృతికి, సనాతన సంప్రదాయానికి ప్రతీకగా నిలిచిన మహోన్నత సాధనా మార్గమే యోగా.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. యోగా అనే పదం సంస్కృతంలోని ‘యుజ్’ అనే ధాతువు నుంచి వచ్చింది. దీనికి కలయిక లేదా ఏకత్వం అనే అర్థం. అంటే శరీరం, మనసు, ఆత్మల సమన్వయమే యోగం. మన పెద్దలు చెప్పినట్లు మనసు ప్రశాంతంగా ఉంటే జీవితం పరమానందంగా ఉంటుంది. ఆ ప్రశాంతతను, ఆత్మసాక్షాత్కారాన్ని అందించే మార్గమే యోగా.
దాదాపు ఐదు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన వరం. ఇది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు, సంపూర్ణ ఆరోగ్యానికి, ఆధ్యాత్మిక వికాసానికి దారి చూపే జీవన విధానం. రుగ్వేదంతోపాటు అనేక వేదాలు, ఉపనిషత్తులు యోగా గొప్పతనాన్ని వివరించాయి.
శరీర దారుఢ్యం, మానసిక స్థైర్యం, ఆత్మవిశ్వాసం, ఆధ్యాత్మిక చైతన్యం వంటి అంశాలకు యోగా మూలాధారంగా నిలుస్తుందని మన ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. యోగతత్వాన్ని ప్రపంచానికి శాస్త్రీయంగా అందించిన మహర్షి పతంజలి. ఆయన రచించిన యోగసూత్రాలు యోగశాస్త్రానికి ప్రామాణిక గ్రంథంగా గుర్తింపు పొందాయి.
అందుకే ఆయనను యోగశాస్త్ర పితామహుడుగా గౌరవిస్తారు. పతంజలి మహర్షి చెప్పిన యోగశ్చిత్తవృత్తి నిరోధః అనే సూత్రం యోగా సారాంశాన్ని తెలియజేస్తుంది. అంటే మనసులో నిరంతరం ఉప్పొంగే ఆలోచనలు, భావోద్వేగాలు, చంచలత్వాన్ని నియంత్రించడమే యోగం. మనసును జయించినవాడు ప్రపంచాన్ని జయించినట్లే అని మన సంస్కృతి చెబుతుంది.
ఫాస్ట్‌ఫుడ్ సంస్కృతి
నేటి ఆధునిక యుగంలో మనిషి జీవితం ఉరుకులు, పరుగులతో నిండిపోయింది. మారుతున్న ఆహారపు అలవాట్లు, పెరుగుతున్న ఫాస్ట్‌ఫుడ్ సంస్కృతి, శారీరక శ్రమ తగ్గిపోవడం, ఒత్తిడి పెరగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా యువతలో ఊబకాయం, మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, మానసిక ఒత్తిడి, క్యాన్సర్ వంటి వ్యాధులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి.
‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అని మన పెద్దలు చెప్పినమాట నేటి పరిస్థితుల్లో మరింత సార్థకంగా కనిపిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) గణాంకాల ప్రకారం 2022లో ప్రపంచవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారిలో 31 శాతం మంది కనీస స్థాయి శారీరక వ్యాయామం కూడా చేయడం లేదు.
2030 నాటికి ఈ సంఖ్య 35 శాతానికి చేరే అవకాశం ఉందని అంచనా. 2024 లెక్కల ప్రకారం భారతదేశంలో దాదాపు 49.4 శాతం మంది తగినంత శారీరక శ్రమ చేయడం లేదని నివేదికలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో యోగా అవసరం గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగింది. యోగా వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఏకాగ్రత పెరుగుతుంది.
విశ్వవ్యాప్త ఉద్యమంగా యోగా
యోగాతో ఆత్మవిశ్వాసం బలపడుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీవితంపై సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. ఆరోగ్యవంతమైన శరీరమే ఉన్నతమైన జీవితానికి పునాది. ఆ పునాదిని బలపరిచే శక్తి యోగాకి ఉంది. యోగాను విశ్వవ్యాప్త ఉద్యమంగా మార్చడంలో భారతదేశం కీలక పాత్ర పోషించింది. 2014లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రకటించాలని ప్రతిపాదించారు.
ఈ ప్రతిపాదనకు ప్రపంచంలోని 177 దేశాలు మద్దతు తెలిపాయి. అనంతరం 2015 జూన్ 21న తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహించడమైనది. జూన్ 21 తేదీకి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఉత్తరార్థ గోళంలో ఇది సంవత్సరంలో అత్యంత పెద్ద రోజు. ప్రకృతి శక్తి, సూర్యకాంతి, జీవచైతన్యానికి ఇది ప్రతీకగా భావిస్తారు. అలాగే వేద సంప్రదాయాల ప్రకారం ఆదియోగి అయిన పరమశివుడు ఈ రోజునే సప్త రుషులకు యోగ జ్ఞానాన్ని బోధించినట్లు
పేర్కొంటారు. అందువల్ల జూన్ 21 ఆధ్యాత్మిక దృష్ట్యా కూడా ఎంతో పవిత్రమైన రోజు.
ప్రపంచ మానవాళికి ఆరోగ్య సందేశం
నేడు యోగా భారతదేశ సరిహద్దులను దాటి ప్రపంచ మానవాళికి ఆరోగ్య సందేశంగా మారింది. యోగా ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక వికాసం సాధ్యమవుతాయి. ప్రతి ఒక్కరూ యోగాను జీవితంలో భాగంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం ఇస్తుంది అనే భావనతో ప్రతి ఒక్కరూ యోగాని ఆచరించాలి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా గొప్ప తనాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. యోగా వల్ల కలిగే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలపై అవగాహన పెంచాలి. ఆరోగ్యవంతమైన వ్యక్తి, కుటుంబం, సమాజం ద్వారా ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్మించాలి. యోగాని నిత్యజీవితంలో భాగం చేసుకొని సర్వే జనాః సుఖినో భవంతు అనే భారతీయ తత్వాన్ని సాకారం చేసే దిశగా ముందుకుసాగాలి.
- నేతి మంగమ్మ,
అసిస్టెంట్ సెక్రటరీ,
తెలంగాణ ప్రభుత్వం
Note: ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.
