ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి తన పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక ప్రాజెక్టులు, పెండింగ్ నిధుల సాధనే లక్ష్యంగా ఆయన కేంద్ర మంత్రులను వరుసగా కలుస్తున్నారు.
ఆగస్టు 5వ తేదీ ఉదయం కేంద్ర మంత్రి భూపేందర్ సింగ్ యాదవ్‌ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి.. అనంతరం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి వెంట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు వంశీకృష్ణ, అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి ఉన్నారు.
ఈ భేటీలో భాగంగా తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి , తక్షణ నిధుల విడుదల కోసం కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి వినతి పత్రాలు అందజేశారు. ప్రత్యేకించి, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ఎత్తును 150 మీటర్లకు పెంచేలా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా సాగుతున్న ఈ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
