- యుద్ధం ఎఫెక్ట్‌తో ఇరాన్ ప్రజలకు అవస్థలు
- పైసల కోసం పాత వస్తువులను అద్దెకూ ఇస్తున్న జనం
- పైసా పైసాకు పాకులాట.. పెర్ఫ్యూమ్ సీసాలూ అమ్మకానికి
- దెబ్బతింటున్న కొనుగోలు శక్తి.. పెరుగుతున్న ద్రవ్యోల్బణం
- సర్వైవల్ ఎకానమీ పరిస్థితికి చేరిన దేశం
టెహ్రాన్: అమెరికాతో ఆరు నెలలుగా సాగుతున్న యుద్ధం కారణంగా ఇరాన్ ప్రజలకు తీవ్ర అవస్థలు మొదలయ్యాయి. ఒకవైపు ధరలు విపరీతంగా పెరిగిపోవడం.. మరోవైపు సరైన సంపాదన లేకపోవడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. డబ్బు సంపాదించడం కోసం ప్రజలు తమ జుట్టును, పెర్ఫ్యూమ్ సీసాలను, సెకండ్ హ్యాండ్ వస్తువులను అమ్ముకుంటున్నారు. అంతేకాకుండా వ్యక్తిగత వస్తువులను అద్దెకు ఇస్తూ అదనపు సంపాదన కోసం కష్టపడుతున్నారు.
ఇరాన్‌కు చెందిన ఐఎల్‌ఎన్ఏ వార్తా సంస్థ కథనం ప్రకారం.. యుద్ధం కారణంగా దేశంలో సర్వైవల్ ఎకానమీ(కేవలం మనుగడ కోసమే చేసే ఆర్థిక లావాదేవీలు) పరిస్థితి పుట్టుకొచ్చింది. సాధారణంగా ఎలాంటి విలువ లేని వస్తువులను సైతం కుటుంబాలు డబ్బుగా మల్చుకుంటున్నాయి. సహజమైన జుట్టు అమ్ముకుంటున్నారు. వాడిన పెర్ఫ్యూమ్ సీసాలను ఆన్‌లైన్‌లో విక్రయానికి పెడుతున్నారు. పాత బట్టలు, బూట్లను కూడా అమ్మకానికి పెడుతున్నారు. ల్యాప్‌టాప్‌లను స్వల్పకాలిక అవసరాల కోసం అద్దెకు ఇస్తున్నారు.
ప్రతి పైసా విలువైనదే..
ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో సతమతమవుతున్న కుటుంబాలకు ప్రతి అదనపు రియాల్ (ఇరాన్ కరెన్సీ) కూడా చాలా ముఖ్యమైనదిగా మారింది. ఐఎల్‌ఎన్ఏ కథనం ప్రకారం.. ఆన్‌లైన్ క్లాసిఫైడ్ ప్లాట్‌ఫారమ్‌లలో వాడిన బట్టలు, కార్మికులు పని ప్రాంతంలో వాడే బూట్లు, వాడిన పెర్ఫ్యూమ్ సీసాలు, సహజమైన జుట్టు విక్రయ ప్రకటనలు విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా జుట్టు విక్రయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
జుట్టు పొడవు, రంగు, నాణ్యత ఆధారంగా హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ కోసం సహజమైన జుట్టును అమ్ముకుంటున్నారు. దీని ధర కొన్ని వేల ఇరానీ రియాల్స్ వరకు పలుకుతోంది. అలాగే వాడిన పెర్ఫ్యూమ్ సీసాలకు కూడా గిరాకీ ఏర్పడింది. సాధారణంగా ఉపయోగం అయిపోయిన తర్వాత ఎలాంటి విలువ లేని ఇతర గృహోపకరణాలను కూడా అమ్ముతున్నారు. కొందరు అమ్మకందారులు కొనుగోలుదారులను ఆకర్షించడానికి తక్కువ విలువైన అనేక వస్తువులను కలిపి ఒకే లిస్టింగ్‌లో పెడుతున్నట్లు ఐఎల్‌ఎన్ఏ తెలిపింది.
ఇది కాకుండా, ఆఫీసు పనుల కోసం లేదా ఆన్‌లైన్ క్లాసులకు హాజరు కావడానికి ప్రజలు అద్దెకు ల్యాప్‌టాప్‌లను వెతుకుతున్నారు. అవసరమైనప్పుడు వాడుకుని, పని పూర్తయిన తర్వాత తిరిగిచ్చేసేలా కొన్ని కుటుంబాలు దీనిని మల్చుకున్నాయి.
