రియాద్ (సౌదీ అరేబియా): యెమెన్‌లో ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారులు ఎర్రసముద్రంలోని బాబ్ ఎల్‌మాండెబ్ జలసంధికి చేరుకున్నారు. అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన ఈ జలసంధి సమీప ప్రాంతాలను హౌతీలు తమ ఆధీనంలోకి తెచ్చుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హౌతీల అక్రమణతో యెమెన్‌లో 12 ఏండ్లుగా కొనసాగుతున్న అంతర్యుద్ధం మళ్లీ రాజుకోవడమే కాకుండా, సౌదీ అరేబియా చమురు ఎగుమతులపై ఆందోళన వ్యక్తం అవుతుంది.
ఎర్రసముద్ర తీరంలోని కీలక నౌకాశ్రయ నగరం ‘మోఖా’ను, బాబ్ ఎల్-మండేబ్ జలసంధి పరిధిలోని పలు దీవులను హౌతీలు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం చమురు నిల్వలు అధికంగా ఉన్న మారిబ్ ప్రావిన్స్‌తో పాటు పశ్చిమ యెమెన్‌లోని తైజ్ నగరంపై పట్టు సాధించేందుకు హౌతీలు దాడులను తీవ్రతరం చేస్తున్నారు. మరోవైపు, హౌతీలు సౌదీ అరేబియా చమురు క్షేత్రాలు, ట్యాంకర్లే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. తమపై విధించిన ఆంక్షలు, దిగ్బంధాన్ని ఎత్తివేయించడమే లక్ష్యంగా సౌదీ నౌకలపై దాడులు చేస్తున్నట్లు హౌతీ అధికార ప్రతినిధి మహమ్మద్ అల్-బుఖైతీ స్పష్టం చేశారు.
హౌతీల దాడులు ప్రస్తుతానికి సౌదీ నౌకలకే పరిమితమైనప్పటికీ, రాబోయే రోజుల్లో మిగతా అంతర్జాతీయ నౌకలకు ముప్పు విస్తరించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సంక్షోభంలో జోక్యం చేసుకునేందుకు సౌదీ మిత్రదేశమైన అమెరికా సుముఖంగా కనిపించడం లేదు. హౌతీలు కూడా అమెరికాను నేరుగా రెచ్చగొట్టకుండా జాగ్రత్త పడుతున్నారు. మరోవైపు ఒమన్ వేదికగా అమెరికా-హౌతీ ప్రతినిధుల మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. ఈ ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఈజిప్ట్, టర్కీలు మధ్యవర్తిత్వ ప్రయత్నాలు మొదలుపెట్టాయి.
