వాషింగ్టన్: ఇరాన్ పాలకులను పూర్తిగా అంతం చేయాలా? వద్దా? అనే దానిపై త్వరలోనే ఒక పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇరాన్‌పై పూర్తిస్థాయిలో విరుచుకుపడి అక్కడి పాలకవర్గాన్ని సమూలంగా అంతం చేయాలా? లేక ఉపేక్షించాలా? అనేది తేల్చుకోవాలి. ఇది చాలా పెద్ద నిర్ణయం. నాతో ఏదైనా జరగొచ్చు’’ అని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు, వచ్చే వారం న్యూయార్క్‌లో జరగనున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పర్షియన్ గల్ఫ్ దేశాల నేతలతో ట్రంప్ భేటీ కానున్నారు. ఈ మీటింగ్‌కు ముందే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.
