సిద్దిపేట, వెలుగు: విధుల్లో నిర్లక్ష్యంతో పాటు సమయపాలన పాటించని సిద్దిపేట మల్టిపర్పస్ బాయ్స్ హైస్కూల్ కు చెందిన ఆరుగురు టీచర్లపై సస్పెన్షన్ వేటు చేస్తూ మంగళవారం కలెక్టర్ కె.హైమవతి ఉత్తర్వులు జారీ చేశారు.
గత నెల 28న సిద్దిపేట మల్టిపర్పస్ బాయ్స్ హైస్కూల్ ను కలెక్టర్ హైమవతి సందర్శించారు. ఆ సమయంలో రిజిస్టర్లో సంతకం చేసిన టీచర్లు స్కూల్లో లేకపోవడం, వార్షిక ప్రణాళికలు, డైరీలు రాయకపోవడం, ఫేషియల్ రికగ్నైజేషన్ లో 50 శాతం వరకు విద్యార్థుల హాజరు నమోదు లేకపోవడం వంటి అంశాలు గుర్తించారు. స్కూల్ నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తున్నారని తేల్చారు.
ఈ విషయంపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి పూర్తి నివేదిక అందజేయాలని డీఈవోను ఆదేశించారు. ఆ నివేదిక ఆధారంగా స్కూల్ అసిస్టెంట్లు జి బాలముకుంద శర్మ, అక్బర్ ఉన్నీసా, నికత్ సుల్తానా, రాజేందర్, నాగరాణి, సుభద్ర రాణిని సస్పెండ్ చేశారు.
హెచ్ఎం శ్రీదేవి నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ షోకాజ్ నోటీస్ జారీ చేశారు. ఫేషియల్ రికగ్నైజేషన్ విషయంలో నిర్లక్ష్యం వహించిన సీఆర్పీలు క్రాంతి కుమార్, సవిత పనితీరుపై విచారణ జరిపి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే టీచర్లపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.
