అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విదేశీ నిపుణులు, ముఖ్యంగా భారతీయ టెక్కీలపై మరోసారి ఉక్కుపాదం మోపారు. H-1B వీసాదారులపై విధిస్తున్న లక్ష డాలర్ల ఫీజులను మరో ఏడాది పాటు పొడిగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. లక్ష డాలర్లు అంటే దాదాపు రూ.95 లక్షలకు పైగా భారీ ఫీజు రూల్స్ సెప్టెంబర్ 2027 వరకు పొడిగిస్తున్నట్లు వైట్‌హౌస్ అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా అమెరికన్ ఉద్యోగులను తొలగించి, ఆ స్థానంలో విదేశీ సిబ్బందిని నియమించే కంపెనీలపై మరింత కఠిన నిఘా పెట్టాలని ఆదేశించింది.
అమెరికా టెక్ రంగంలోకి ప్రవేశించే అగ్రరాజ్య నిపుణుల ప్రధాన పైప్‌లైన్‌ను దెబ్బతీసే ఈ నిర్ణయం.. ఏళ్ల తరబడి అక్కడి ఉద్యోగాల కోసం కలలు కనే లక్షలాది మంది భారతీయ నిపుణులకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. రిక్రూట్‌మెంట్ల కోసం భారత్ నుంచి టెక్కీలను అమెరికాకు తరలించే టాప్ ఐటీ కంపెనీలకు ఈ రూల్ ఆర్థిక భారాన్ని మోపుతోంది. ట్రంప్ సర్కార్ కఠిన వైఖరితో టెక్ దిగ్గజాలు ఇకపై అమెరికాలో రిస్క్ చేయడం కంటే బెంగళూరు, హైదరాబాద్, పూణే లాంటి నగరాల్లోనే తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను(GCCs) విస్తరించేందుకు వేగంగా పావులు కదుపుతున్నాయి.
అయితే ఈ ఇందులో కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. అమెరికాలోని యూనివర్సిటీల్లో చదువు పూర్తి చేసుకుని F-1 వీసాలపై ఉండి.. హెచ్-1బీకి మళ్లే అంతర్జాతీయ విద్యార్థులకు, అలాగే ఇప్పటికే ఉన్న వీసాల రెన్యువల్స్‌కు ఈ భారీ ఫీజు నుంచి వెసులుబాటు కల్పించారు. ఇది కొంతవరకు అక్కడి విద్యార్థులకు ఊరటనిచ్చే విషయమనే చెప్పుకోవాలి. అయినప్పటికీ కొత్తగా వెళ్లాలనుకునేవారికి మాత్రం కష్టమే. ఈ భారీ వీసా ఫీజు చట్టం ప్రస్తుతం ఫెడరల్ కోర్టుల్లో న్యాయపరమైన చిక్కుల్లో కూరుకుపోయి ఉన్నప్పటికీ.. ట్రంప్ యంత్రాంగం మాత్రం తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. మొత్తానికి అమెరికాలో జాబ్ కొట్టి సెటిల్ అవ్వాలని భావించే ఇండియన్ ఐటీ డ్రీమర్స్ కలలకు ఈ రూల్స్ పెద్ద అడ్డంకిగా మారాయి.
