భారతదేశంలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఇప్పుడు ప్రతిచోట హాట్ టాపిక్‌గా మారింది. బీజేపీ సారథ్యంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సీజేపీని దీటుగా ఎదుర్కోవడానికి ఒక వ్యూహాన్ని ఇంకా ఖరారు చేయలేక, ఇటీవలి తమ ప్రభుత్వం చేసిన తప్పులను నిశితంగా అధ్యయనం చేస్తోంది. ప్రతిపక్షాలు కూడా మోదీ సర్కారు దూకుడును అడ్డుకునేందుకు సీజేపీని ఉపయోగించుకోవాలని చూస్తున్నాయి.
సీజేపీ వ్యూహాత్మక ఉద్యమం 60 రోజులు కూడా గడవకముందే ‘బీజేపీ ప్రభుత్వాన్ని తొలగిస్తాం’ వంటి పెద్ద మాటలు సీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వంతో జరిగిన తొలి పోరాటంలో దేశ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించడంలో సీజేపీ విజయం సాధించింది.
ఆ విజయం చాలావరకు సీజేపీ ఆకస్మిక ఎత్తుగడలు, ప్రభుత్వ అధ్వాన్న పాలనపై ప్రజలలో వెల్లువెత్తిన ఆగ్రహం వల్లే సాధ్యమైంది. సీజేపీ డిమాండ్లను కేంద్రం అంగీకరించడంతో ఇప్పుడు సీజేపీ ఆకస్మిక ఎత్తుగడలను ఆయుధంగా ఉపయోగించే స్థితిలో లేదు. సీజేపీ నాయకులు ఎవరో, వారు ఎలా పనిచేస్తారో ప్రభుత్వానికి, ప్రజలకు తెలిసింది. ఇప్పుడు సీజేపీ పూర్తిస్థాయిలో మనుగడ సాగించాలంటే ఇతర ఎత్తుగడలను, వ్యూహాలను ఉపయోగించాల్సి ఉంటుంది.
వేల సంవత్సరాలుగా ఒక దేశంపై దాడిచేసి దానిని లొంగదీసుకోవాలనుకున్నప్పుడు, ఆ దేశ రాజధాని నగరాన్ని లక్ష్యంగా చేసుకుని ముట్టడించడమే అత్యంత సులభమైన వ్యూహంగా ఉండేది. రాజధాని స్వాధీనమయ్యాక దేశంలోని మిగిలిన ప్రాంతం కూడా సాధారణంగా లొంగిపోయేది.
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఆందోళనకారులు ఢిల్లీకి వచ్చి తమ డిమాండ్లు నెరవేరేవరకు వెళ్లమని నిరసన తెలిపిన సందర్భాలు చాలా ఉన్నాయి. 1988లో సుమారు ఏడు లక్షల మంది రైతులు పది రోజులపాటు ఇండియాగేట్ సమీపంలో శిబిరం ఏర్పాటు చేసి, చివరకు ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ప్రభుత్వాన్ని చర్చలకు దిగివచ్చేలా చేశారు. అయితే, రైతులు ప్రభుత్వాన్ని కూలదోయాలని కాకుండా, తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుకున్నారు. అదేవిధంగా 2011లో అన్నా హజారే చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో ఆయన లక్ష్యం ప్రభుత్వ మార్పు కాదు, మరింత పటిష్టమైన అవినీతి నిరోధక చట్టాలను తీసుకురావడం.
నేపాల్, బంగ్లాదేశ్జెన్ జెడ్ శక్తికి ఉదాహరణలు
2024 ఆగస్టులో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన భారీ నిరసనల కారణంగా షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోయింది. 2025లో నేపాల్ రాజధాని కాఠ్మండులో పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు జరిగాయి. ఈ రెండు దేశాలలోనూ ఆందోళనకారులు జాగ్రత్తగా ప్రణాళికాబద్ధమైన వ్యూహాలను, ప్రతిపక్షాల మద్దతును కలిగి ఉన్నారు. రాజధానిని ముంచెత్తడం, ప్రభుత్వ కార్యాలయాలను చుట్టుముట్టడం, ప్రధాన రాజకీయ నాయకులను బెదిరించడం, హింసతో క్రమంగా ఒత్తిడిని పెంచడం వారి ప్రాథమిక వ్యూహం. బంగ్లాదేశ్, నేపాల్‌లలో ఈ జెన్ జెడ్ గుంపులు విజయం సాధించాయి.
నిరసనల సమయంలో ఆ ప్రభుత్వాల ముందు రెండు మార్గాలు ఉన్నాయి. నిరసనలను అణచివేయమని పోలీసులను ఆదేశించడం లేదా చర్చలు జరపడం. అయితే బలప్రయోగంతో ఎదురయ్యే సమస్య ఏమిటంటే వందలాది మరణాలు ప్రపంచ దృష్టిని ఆకర్షించి ఆందోళనను మరింతగా తీవ్రతరం చేస్తాయి. అదేవిధంగా మరింత మంది ఆందోళనలో చేరడానికి మృతుల త్యాగాలు ప్రోత్సహిస్తాయి. నేపాల్ జనాభా సుమారు మూడు కోట్లు.
అయినప్పటికీ నిరసనలలో సాధారణంగా 50,000 కంటే తక్కువ మంది పాల్గొన్నారు. బంగ్లాదేశ్‌లో కూడా చురుకైన నిరసనకారులు మొత్తం జనాభాలో ఒక చిన్న భాగం మాత్రమే. అయితే, టీవీలలో ప్రసారమైన దృశ్యాలు యావత్ దేశం తిరుగుబాటు చేసిందనే అభిప్రాయాన్ని కలిగించాయి. కానీ, ఇది ఎంతమాత్రం నిజం కాదు. ఆందోళనకారులను దేశ రాజధానిలోకి తీసుకువచ్చి నిరంతర ఆందోళనను ప్రారంభించడమే వ్యూహం. ఉత్సాహం పెరిగేకొద్దీ మరింత మంది ప్రజలు చేరతారు.
మీడియా ఈ ఉద్యమాన్ని విస్తృతం చేస్తుంది, అంతర్జాతీయ మీడియా కూడా వస్తుంది. దేశంతోపాటు ప్రపంచ దృష్టిని ఆందోళన ఆకర్షించడంతో ప్రభుత్వం భయభ్రాంతులకు గురవుతుంది. అయినప్పటికీ ఏ దేశంలోనైనా 95% మంది ప్రజలు సాధారణంగా నిష్క్రియాత్మకంగానే కేవలం చూస్తూనే ఉంటారు. అంటే ఒక చిన్న గుంపు కూడా తమ ఆందోళన ఉధృతం చేసి దేశ రాజధానిని
నియంత్రించగలదనేదే ఇక్కడి సూత్రం.
జూన్ 6 నుంచి సీజేపీ కార్యకలాపాలు ఇలా...
సీజేపీ తన మొదటి సమావేశాన్ని జూన్ 6, 2026న జంతర్ మంతర్ వద్ద నిర్వహించింది. కానీ పెద్దగా ఫలితం సాధించలేకపోయింది. ఆ తర్వాత జూన్ 20, 2026న రెండో సమావేశం జరిగింది. పోలీసులు కేవలం ఒక రోజు సమావేశానికి మాత్రమే అనుమతి ఇచ్చినప్పటికీ, సీజేపీ మాత్రం జంతర్ మంతర్ నుంచి ఖాళీ చేయడానికి నిరాకరించింది. సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష ప్రారంభించడంతో పరిస్థితులు మారాయి.
సీజేపీ కూడా ఆందోళనను కొనసాగించింది. వేలాది మంది యువకులు ఆందోళనలో పాల్గొనడంతో అక్కడ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. చివరకు, ప్రభుత్వం నిర్వాహకులతో చర్చలు జరిపి వారి డిమాండ్లను అంగీకరించింది. సీజేపీతోపాటు విద్యార్థులను ఢిల్లీ, జంతర్ మంతర్ ప్రాంతాలను విడిచిపెట్టి వెళ్లేలా ఒప్పించింది.
తరువాత ఏమిటి?
కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు సీజేపీ ప్రధాన నాయకులు, వారి ఎత్తుగడల గురించి స్పష్టంగా తెలిసింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ ర్యాలీలకు అందుబాటులో లేకుండా ప్రభుత్వం చూసుకుంటుంది. అటువంటి వేదిక లేకుండా సీజేపీకి ప్రజలను సమీకరించడం చాలా కష్టమవుతుంది. వరంగల్ లేదా విజయవాడలో ఐదు లక్షల మంది గుమిగూడితే దేశవ్యాప్తంగా పెద్దగా పట్టించుకోరు. కానీ జంతర్ మంతర్ వద్ద కొన్ని వేలమంది గుమిగూడినా జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం సాధ్యమైనచోటల్లా సీజేపీతో చర్చలు కొనసాగిస్తుంది. మరోవైపు ప్రతిపక్షాలు సీజేపీకి మద్దతు ఇస్తాయి. ఇది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. ప్రతిపక్షాల మద్దతు ఉద్యమాన్ని సంస్థాగతంగా బలోపేతం చేసినప్పటికీ, సీజేపీని అడ్డుపెట్టుకుని వారిపేరుతో ప్రతిపక్షాలే ఆందోళన చేస్తున్నాయని ప్రజలు భావించేలా కూడా ఇది చేయవచ్చు. సీజేపీ యువతకు సంబంధించిన సమస్యలకే కట్టుబడి ఉండాలా లేక ప్రతిపక్ష రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలా అని కూడా నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. తన ప్రతిష్టకు భంగం కలగకుండా ఉండేందుకు సీజేపీ ఇప్పుడు కఠినమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంది.
ప్రధాన వ్యూహం
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిరంతరాయంగా ర్యాలీ నిర్వహించలేకపోతే అది బలహీనపడుతుంది. ఇప్పుడు సీజేపీకి ఇదే అతిపెద్ద అడ్డంకి కాబోతోంది. జంతర్ మంతర్ వద్ద కూర్చోవడం సీజేపీకి ఒక ఉన్నతమైన హోదాను ఇస్తుందని ప్రభుత్వం గ్రహించింది. లక్షలాది మంది ఆ దారిలో వెళతారు. జన సమూహాలు వస్తాయి. జంతర్ మంతర్ వద్ద తిరిగి స్థిరపడకుండా లేదా ఢిల్లీలో సుదీర్ఘ నిరసన చేపట్టకుండా ప్రభుత్వం సీజేపీని అడ్డుకుంటే, ఈ ఉద్యమం క్లిష్టమైన సమస్యలు, ప్రత్యామ్నాయ ఎంపికలను ఎదుర్కోవలసి వస్తుంది. దీంతో సీజేపీతోపాటు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కూడా ప్రధాన వ్యూహాలకు పదునుపెడతాయి.
రాజధాని ప్రాముఖ్యతను గుర్తుంచుకోవాలి
1917 అక్టోబర్ విప్లవం సమయంలో వ్లాదిమిర్ లెనిన్ అయినా, 1949లో బీజింగ్‌లో మావో జెడాంగ్ విజయాన్ని ప్రకటించినా, లేదా 1959లో ఫిడెల్ కాస్ట్రో హవానాలోకి ప్రవేశించినా.. రాజకీయ నియంత్రణ అంతిమంగా జాతీయ రాజధానిపైనే కేంద్రీకృతమై ఉంది. ఇది ఒక చదరంగం ఆటగా మారింది. సీజేపీ తన ఎత్తుగడ వేయడం కోసం ప్రభుత్వం ఎదురుచూస్తోంది. జంతర్ మంతర్ వద్ద మరో సమావేశం జరపాలన్న తమ ప్రణాళికకు చెక్‌మేట్ అవుతుందని సీజేపీకి తెలుసు. ఇప్పుడు ఏ ఎత్తుగడలు వేస్తారో.. ఇక్కడ గ్రాండ్‌మాస్టర్ ఎవరో వేచిచూద్దాం!
- డా. పెంటపాటి పుల్లారావు,పొలిటికల్ ఎనలిస్ట్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
