- తెల్లపులి కన్నుమూత, ఉన్న రెండు పులులు హైదరాబాద్ జూకు..
- పేపర్‍మీద హామీగానే సింహం, వైల్డ్ డాగ్, హైనా రాక
- పర్మిషన్స్ రాక యానిమల్ ఎక్స్‌చేంజ్‌లో బెంగాల్ టైగర్ రావట్లే
- ఖడ్గ మృగాల్లేక బోసిపోతున్న వరంగల్ కాకతీయ జూపార్క్
వరంగల్, వెలుగు: ఓరుగల్లు కాకతీయ జూపార్క్‌లో ప్రస్తుతం ఖడ్గమృగాలు, పెద్ద పులులు లేక కళతప్పింది. తెల్లపులి మృతి చెందగా, మరో రెండు పులులను హైదరాబాద్‌కు తరలించడంతో టైగర్ ఎన్‌క్లోజర్లు నెలలుగా ఖాళీగా కనిపిస్తున్నాయి. పండుగలు, సెలవు రోజుల్లో ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల నుంచి భారీగా వచ్చే పర్యాటకులు పులులను చూడాలనే ఆశతో ఎన్‌క్లోజర్ల వద్దకు చేరుకుంటే అవి ఖాళీగా కనిపించడంతో నిరాశ చెందుతున్నారు.
1985లో మినీ జూపార్క్‌గా ప్రారంభం..
దాదాపు 48 ఎకరాల విస్తీర్ణంలో కాకతీయ జూపార్క్‌ను 1985లో అప్పటి రాష్ట్ర గవర్నర్ శంకర్ దయాళ్ శర్మ ప్రారంభించారు. ముందు మినీ జూపార్క్‌గా ప్రారంభమై 2014 జనవరిలో 'స్మాల్ జూ' కేటగిరిలో గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఇక్కడ పులులు, దుప్పులు తదితర క్షీరదాలు 134, మొసళ్లు, తాబేళ్లు, ఊసరవెల్లులు వంటి సరీసృపాలు 89, నెమళ్లు, చిలుకలు, అడవి కోళ్లు, లవ్‌బర్డ్స్ తదితర పక్షులు 196 వరకు ఉండి సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.
పులుల రాకతో పెరిగిన పర్యాటకులు..
ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి అటవీ, దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తుండగా, స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ప్రత్యేక చొరవతో జూపార్క్ అభివృద్ధి పనులు చేపట్టారు. పెద్ద పులుల కోసం ప్రభుత్వం రూ.25 లక్షలు మంజూరు చేయగా, ప్రత్యేక టైగర్ ఎన్‌క్లోజర్లు నిర్మించారు. 2024 డిసెంబర్ తొలి వారంలో హైదరాబాద్ నెహ్రూ జూపార్క్ నుంచి రాయల్ బెంగాల్ జాతికి చెందిన ఆడ పులి కరీనా, మగ పులి శంకర్‌ను వరంగల్‌కు తీసుకొచ్చారు. అనంతరం 2025 జులై 18న తెల్లపులి చరణ్‌ను కూడా తరలించారు. దీంతో అప్పటివరకు పండుగలు, సెలవు రోజుల్లో 1,000 నుంచి 1,200 మంది వరకు ఉండే సందర్శకుల సంఖ్య 1,800 నుంచి 2,000కు పెరిగింది.
పెద్ద పులులు.. నాలుగు రోజుల మురిపెమే..
పెద్ద పులుల రాకతో సందర్శకుల సంఖ్య పెరగడంతో జూపార్క్‌ను మరింత అభివృద్ధి చేయాలని అధికారులు భావించారు. సింహం, మరో ఆడ పులి, హైనా, వైల్డ్ డాగ్స్, వివిధ రకాల పాములను తీసుకురావాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే జూపార్క్‌లోని వాతావరణ పరిస్థితుల కారణంగా పులులు అనారోగ్యానికి గురికావడంతో చికిత్స నిమిత్తం తిరిగి హైదరాబాద్ నెహ్రూ జూపార్క్‌కు తరలించారు. అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరి 3న తెల్లపులి చరణ్ కూడా మృతి చెందింది. దీంతో ప్రస్తుతం టైగర్ ఎన్‌క్లోజర్లు పూర్తిగా ఖాళీగా మారాయి.
ఆగిన యానిమల్ ఎక్స్‌చేంజ్
దేశంలోని అన్ని జూపార్కులు సెంట్రల్ జూ అథారిటీ పరిధిలో పనిచేస్తున్నాయి. కొత్త జంతువులను తీసుకురావాలన్నా, ఒక జూ నుంచి మరో జూకు యానిమల్ ఎక్స్‌చేంజ్ జరగాలన్నా సెంట్రల్ జూ అథారిటీ అప్రూవల్ తప్పనిసరి. ఈ క్రమంలో వరంగల్ జూపార్క్ నుంచి విశాఖపట్నం జూపార్కుకు కొండగొర్రెలను పంపించి, అక్కడి నుంచి రాయల్ బెంగాల్ పులిని తీసుకురావాలని ప్రతిపాదించారు. అయితే ఇప్పటికీ సెంట్రల్ జూ అథారిటీ నుంచి అనుమతి రాకపోవడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఫలితంగా బెంగాల్ టైగర్, సింహం, హైనా, వైల్డ్ డాగ్స్, జాకల్, పలు రకాల సరీసృపాల రాక ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలో జూపార్క్ అభివృద్ధికి అవసరమైన అనుమతుల విషయంలో ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.
అప్రూవల్స్వస్తేనే యానిమల్ ఎక్స్‌చేంజ్
కాకతీయ జూపార్క్ అభివృద్ధికి మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవడంతో పెద్ద పులులు, అడవి దున్నలు, తెల్లపులి జూపార్క్‌కు వచ్చాయి. ప్రస్తుతం అనారోగ్య కారణాల వల్ల అవి అందుబాటులో లేవు. యానిమల్ ఎక్స్‌చేంజ్‌లో భాగంగా బెంగాల్ టైగర్, సింహం, ఆడపులి, జాకల్, హైనా, పలు రకాల పాములను తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. అయితే, దీనికి సెంట్రల్ జూ అథారిటీ పర్మిషన్ రావాల్సి ఉంది.
- బి.మయూరి, జూపార్క్ రేంజ్ ఆఫీసర్
