కాంట్రాక్ట్ వర్కర్ల గ్రాట్యుటీ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు.. యజమాని బాధ్యత వహించనక్కర్లే!

కాంట్రాక్ట్ వర్కర్ల గ్రాట్యుటీ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు.. యజమాని బాధ్యత వహించనక్కర్లే!

కాంట్రాక్టర్ల ద్వారా నియమించబడిన కార్మికులకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రధాన యజమానికి.. కాంట్రాక్ట్ వర్కర్లకు మధ్య ప్రత్యక్ష ఉపాధి సంబంధం లేకపోతే, వారి గ్రాట్యుటీ చెల్లింపులకు ప్రధాన యజమానిని బాధ్యుడిగా చేయలేమని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు, కంపెనీలకు వర్తించనుంది.

ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ONGC) విషయంలో బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను జస్టిస్ అహసానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. కాంట్రాక్ట్ కార్మికులకు గ్రాట్యుటీ చెల్లించాల్సిందిగా ONGCని ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ.. అప్పీలేట్ అథారిటీ ఇచ్చిన నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది.

ఈ వివాదంలో పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ కింద ఉన్న కంట్రోలింగ్ అథారిటీ పరిధిపై కూడా సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. గ్రాట్యుటీ మొత్తాన్ని లెక్కించడం మాత్రమే అథారిటీ విధి అని.. బాధ్యత ఎవరిదో తేల్చే అధికారం ఆ అథారిటీకి లేదని కోర్టు పేర్కొంది. కంట్రోలింగ్ అథారిటీ తన అధికార పరిధిని దాటి వ్యవహరించిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

ONGC తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. కాంట్రాక్టు ద్వారా పనిచేసే కార్మికులు కంపెనీకి ప్రత్యక్ష ఉద్యోగులు కారని, కాంట్రాక్ట్ లేబర్ చట్టం ప్రకారం ప్రధాన యజమానికి గ్రాట్యుటీ చెల్లించే బాధ్యత ఉండదని తెలిపారు. 2025 నాటి ఒక మునుపటి తీర్పును ఉదాహరణగా చూపుతూ.. కాంట్రాక్ట్ కార్మికులు ప్రధాన యజమానితో ఉద్యోగ సంబంధాన్ని క్లెయిమ్ చేయలేరని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.

ALSO READ : LIC నిధుల దారి మళ్లింపు కేసు

అయితే ఈ కేసుకు సంబంధించి ONGC ఇప్పటికే గ్రాట్యుటీ మొత్తాన్ని చెల్లించిందని కోర్టు గుర్తించింది. కాబట్టి ఆ డబ్బును కార్మికుల నుంచి ఎలాంటి పరిస్థితుల్లోనూ రికవరీ చేయకూడదని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే కోర్టు ఇచ్చిన తీర్పు కాంట్రాక్ట్ ఉద్యోగులకు గ్రాట్యుటీ ఎవరు చెల్లించాలి అనే అంశంపై ఒక క్లారిటీని అందించింది. రానున్న రోజుల్లో ఇలాంటి వివాదాలకు జవాబు లభించిందని చెప్పుకోవాలి ధర్మాసనం తాజా తీర్పుతో.