వనపర్తి జిల్లాలో రూ.474 కోట్ల విలువైన  సీఎంఆర్ వడ్లు స్వాహా!

వనపర్తి జిల్లాలో రూ.474 కోట్ల విలువైన  సీఎంఆర్ వడ్లు స్వాహా!
  •      రికార్డు స్థాయిలో ధాన్యం కాజేసిన మిల్లర్లు
  •      వసూళ్ల కోసం సివిల్ సప్లై అధికారుల నోటీసులు
  •      వనపర్తి జిల్లాలో వెలుగుచూసిన భారీ వడ్ల కుంభకోణం

వనపర్తి, వెలుగు :  ప్రభుత్వం మిల్లర్లకు కేటాయించిన రూ.వందల కోట్ల విలువ చేసే ధాన్యాన్ని రాబట్టుకోవడంలో వనపర్తి జిల్లాలో సివిల్ సప్లయ్ ఆఫీసర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 2022-–23 రబీ సీజన్‌‌‌‌‌‌‌‌లో పండిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకోగా, మిగిలిన నిల్వలను జిల్లాలోని 114 రైస్​ మిల్లులకు మొత్తం రూ.474.59 కోట్ల విలువ చేసే 2,12,175.271 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేటాయించారు. ఆ సమయంలో ఎలాంటి కఠిన నిబంధనలు లేకపోవడంతో మిల్లర్లు ఆ వడ్లను అప్పనంగా భావించి ఇష్టారీతిగా సొంతానికి వాడుకోవడంతో పాటు, కొందరు ఇతర రాష్ట్రాలకు తరలించి అమ్ముకున్నట్టు తెలుస్తోంది.

మూడేండ్ల తర్వాత.. 

మూడేండ్ల తర్వాత ప్రభుత్వం 2022–-23 రబీ సీజను తాలూకు వడ్ల బకాయిలను వెంటనే చెల్లించాలంటూ రైసు మిల్లర్లకు నోటీసులు పంపడంతో వారు ఒక్కసారిగా కంగుతిన్నారు. స్వాహా చేసిన వడ్లకు ధర కట్టించి ఇవ్వాలని సివిల్ సప్లయ్ అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో, ఆ భారీ మొత్తాన్ని ఎలా చెల్లించాలో అర్థం కాక మిల్లర్లు తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఈ బకాయిల వసూలు వ్యవహారం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

90 రోజుల్లో బకాయిలు చెల్లించాల్సిందే...

నోటీసులు అందుకున్న మిల్లర్లు క్వింటాలుకు రూ.2,236.81 చొప్పున కేటాయించిన మొత్తానికి ధర కట్టించి ఇవ్వాలని, 90 రోజుల్లోపు బకాయిలు చెల్లించాలని అధికారులు స్పష్టం చేశారు. గడువులోగా చెల్లించకపోతే క్వింటాలుకు రూ.2,441.90 చొప్పున అదనంగా 25 శాతం పెనాల్టీ, 12 శాతం వడ్డీతో కలిపి చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. చట్టపరమైన కేసులూ తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ, మిల్లర్ల నుంచి స్పందన మాత్రం అంతంతమాత్రంగానే 
ఉంది.


విడతల వారీగా ఇవ్వమన్నాం

సీఎంఆర్​ వడ్ల తాలూకు బకాయిలను విడతల వారీగా ఇవ్వమన్నాం. ఈ నెల 10 వరకు 50శాతం, తరువాత 25శాతం చొప్పున రెండు సార్లు చెల్లించాలని చెప్పాం. కొందరు మిల్లర్లు స్పందిస్తూ బకాయిలు చెల్లించేందుకు ముందుకు వచ్చారు కూడా. ఎట్టి పరిస్థితుల్లో వడ్ల తాలూకు బకాయిలను నూరు శాతం వసూలు చేస్తాం. 
-ఆంజనేయులు, సివిల్​ సప్లయీస్​ డీఎం, వనపర్తి