కృష్ణా ప్రాజెక్టులకు పోటెత్తుతున్న వరద

కృష్ణా ప్రాజెక్టులకు పోటెత్తుతున్న వరద
  • జూరాలకు 2.4 లక్షల క్యూసెక్కుల ఇన్​ఫ్లో.. దిగువకు 2.5 లక్షల క్యూసెక్కులు
  • శ్రీశైలం ప్రాజెక్టుకు 1.9 లక్షల క్యూసెక్కుల వరద
  • మూడు రోజుల్లోనే ప్రాజెక్టుకు 50 టీఎంసీలకుపైగా జలాలు
  • 106 టీఎంసీలకు చేరిన ప్రాజెక్టు నీటి నిల్వ
  • మరో మూడు రోజుల పాటు ఎగువ నుంచి భారీగా వరద వస్తుందని అంచనా

హైదరాబాద్/నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: కృష్ణా ప్రాజెక్టులకు వరద పోటెత్తుతున్నది. ఎగువన అప్పర్​ కృష్ణా, మిడిల్​ కృష్ణా పరివాహక ప్రాంతాల్లో వర్షాలు జోరుగా కురుస్తుండడంతో భారీగా ఇన్​ఫ్లోస్​వస్తున్నాయి. మరో ఆరు రోజుల పాటు ఎగువన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న అంచనాలతో.. వరద ప్రవాహం మూడు రోజులు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. మన ప్రాజెక్టులకు 2 లక్షల క్యూసెక్కులకుపైగా వరద ప్రవాహం వస్తున్నది. ఇటు శ్రీశైలం ప్రాజెక్టు కూడా వేగంగా నిండుతున్నది. తుంగభద్ర ప్రాజెక్టుకు కూడా వరద ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది.


ఎగువన కర్నాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టుకు ప్రస్తుతం వరద తగ్గినా.. మళ్లీ బుధవారం నుంచి పుంజుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఆల్మట్టి ప్రాజెక్టుకు ఇన్​ఫ్లో 14 వేల క్యూసెక్కులకు తగ్గింది. అయితే, వరద పెరిగే అవకాశం ఉందన్న అంచనాలతో లక్షన్నర క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్​ప్రాజెక్టుకు 1.47 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా.. దిగువకు 1.48 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. జూరాలకు మాత్రం వరద భారీగా వస్తున్నది. ఉజ్జని నుంచి వరద పెరుగుతుండడం, స్థానికంగా క్యాచ్​మెంట్​లలో వర్షాలు భారీగా పడుతుండడంతో జూరాలకు వరద ఎక్కువైతున్నది. ప్రస్తుతం ఆ ప్రాజెక్టుకు 2.41 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 2.53 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. తుంగభద్ర ప్రాజెక్టుకు 82 వేల క్యూసెక్కుల వరద వస్తున్నది. 

శ్రీశైలానికి భారీగా వరద..

ఎగువ నుంచి నీటిని విడుదల చేస్తుండడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద భారీగా వస్తున్నది. మూడు రోజుల వ్యవధిలోనే ప్రాజెక్టుకు 50 టీఎంసీలకుపైగా వరద వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టులో నీటి నిల్వ వంద టీఎంసీలు దాటింది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు 1.93 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. బుధవారం నాటికి వరద ప్రవాహం 2 లక్షల క్యూసెక్కులు దాటే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి నిరుడు ఇదే టైంకు ప్రాజెక్టులో 197 టీఎంసీల జలాలుండగా.. ఈసారి మాత్రం వర్షాలు లేట్​గా పడడం, ఎగువ నుంచి వరద రాకపోవడంతో ప్రాజెక్టుకు ఆలస్యంగా నీళ్లొస్తున్నాయి. ప్రస్తుతం 106.41 టీఎంసీల నీళ్లున్నాయి. జూరాల, శ్రీశైలానికి వరదలు వస్తున్నా.. నాగార్జునసాగర్​ ప్రాజెక్టు మాత్రం వట్టిబోయి కనిపిస్తున్నది. ఈ ఏడాది ఇంకా వరద మొదలుకాకపోవడంతో.. ప్రస్తుతం నాగార్జునసాగర్​ డెడ్​స్టోరేజ్​ 131 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 137 టీఎంసీల జలాలున్నాయి. నిరుడు ఇదే టైంకు ప్రాజెక్టులో 304 టీఎంసీల నిల్వ ఉండడం గమనార్హం. ఈ నెలాఖరు నాటికైనా సాగర్​కు వరదలు మొదలవుతాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

వచ్చే మూడు రోజులూ భారీగానే..

కృష్ణా ప్రాజెక్టులకు వచ్చే మూడు రోజులు కూడా భారీగా వరద వచ్చే అవకాశం ఉందని అంచనాలున్నాయి. ఆల్మట్టి, నారాయణపూర్​ ప్రాజెక్టులకు లక్షన్నర క్యూసెక్కుల దాకా వరద వచ్చే చాన్సెస్​ ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. అదే సమయంలో జూరాలకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద​వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. తుంగభద్ర డ్యామ్​కు కూడా తొలిసారి లక్ష క్యూసెక్కుల ఫ్లడ్​వచ్చి చేరే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 2 లక్షల నుంచి 2.30 లక్షల క్యూసెక్కులకు ఇన్​ఫ్లోస్​ చేరుతాయని పేర్కొంటున్నారు. ఆ తర్వాత వరదలు కొంచెం తగ్గినా.. స్థిరంగా కొనసాగుతాయని చెబుతున్నారు. వరదలు ఇలాగే కొనసాగితే శ్రీశైలం ప్రాజెక్టు వేగంగా నిండేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

పలు జిల్లాల్లో భారీ వర్షాలు..

సోమవారం రాత్రి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. కామారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, గద్వాల, మేడ్చల్​ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడ్డాయి. కామారెడ్డిలో అత్యధికంగా 18.2 సెంటీమీటర్ల వర్షం పడింది. అదే జిల్లా పిట్లంలో 12.7 సెంటీమీటర్లు, మఖ్దూంపూర్​లో 12.4, సర్వాపూర్​లో 11.7, వికారాబాద్​ జిల్లా కొడంగల్​లో 11.5, సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో 10.5, భద్రాద్రి జిల్లా టేకులపల్లిలో 10.3, సూర్యాపేట జిల్లా కీతవారిగూడెం 10.2, జీఎం ఆఫీస్​9.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. 

రాష్ట్రంలో వర్షపాతం లోటు కవర్ 

వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో వర్షపాతం లోటు కవర్​అయింది. సాధారణ స్థాయికి చేరుకున్నది. ఈ టైం వరకు 387.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా.. 373.1 మిల్లీ మీటర్ల వాన పడింది. లోటు వర్షపాతం ఉన్న జిల్లాలు 9కి తగ్గాయి. అత్యధికంగా జనగామలో 47 శాతం లోటు వర్షపాతం ఉండగా.. హనుమకొండలో 46 శాతం, వరంగల్​లో 43 శాతం, మేడ్చల్​ మల్కాజిగిరిలో 33 శాతం, యాదాద్రి భువనగిరి జిల్లాలో 32, ఖమ్మంలో 30, మహబూబాబాద్​లో 27, సూర్యాపేటలో 24, భద్రాద్రి కొత్తగూడెంలో 22 శాతం చొప్పున లోటు వర్షపాతం ఉంది. కాగా, కామారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు అత్యధిక వర్షపాతం నమోదైంది. ఆ జిల్లాలో 35 శాతం ఎక్కువ వర్షం కురిసింది. రంగారెడ్డి, మెదక్, మంచిర్యాల జిల్లాల్లోనూ ఎక్సెస్​ వర్షపాతం నమోదైంది.  

ఎస్సారెస్పీకి పెరిగిన ఇన్​ఫ్లో

శ్రీరాంసాగర్‌‌ప్రాజెక్టుకు గోదావరి నది నుంచి మంగళవారం వాటర్ ఇన్‌‌ఫ్లో స్వల్పంగా పెరిగింది. సాయంత్రం 6 గంటలకు 22,222 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగింది. అంతకు ముందు మధ్యాహ్నం 3 గంటలకు 28,540 క్యూసెక్కుల వరద వచ్చింది. గోదావరి నది పరివాహక ప్రాంతంలో వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ చెప్పడంతో రానున్న రెండు రోజుల్లో మరింత వరద ఎస్సారెస్సీకి వస్తుందని ఇంజినీర్లు భావిస్తున్నారు. ఇరిగేషన్‌‌ మినిస్టర్‌ ‌ఉత్తమ్‌ ‌కుమార్‌‌ ఈ నెల 1న ఎస్సారెస్పీని విజిట్‌‌ చేసినప్పుడు 27 టీఎంసీలున్న వాటర్‌‌ స్టోరేజ్‌.. ‌గడిచిన నాలుగు రోజుల్లో మరో 8 టీఎంసీలు పెరిగి 35 టీఎంసీలకు చేరింది. మిషన్‌‌ భగీరథ స్కీమ్‌‌కు నిత్యం 934 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.