- మంత్రి పదవులు రాని నేతలు ఓపికతో ఉండాలని సూచన
బెంగళూరు: ఎమ్మెల్యేలు ఎవరైనా రాజీనామా చేస్తే నిమిషాల్లోనే ఆమోదిస్తానని కర్నాటక సీఎం డీకే శివకుమార్ స్పష్టం చేశారు. యాక్సెప్ట్ చేసేముందు ఎమ్మెల్యేతో వ్యక్తిగతంగా మాట్లాడ్తానని చెప్పారు. కొత్త మంత్రులతో మంగళవారం డీకే సమావేశమయ్యారు. మంత్రి పదవులు రాని నేతలు ఓపికతో ఉండాలని సూచించారు.
తనకు కూడా గతంలో ఎన్నోసార్లు ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని గుర్తుచేశారు. ధరంసింగ్, సిద్ధరామయ్య హయాంలో తనను కూడా పక్కనపెట్టారని, అయినప్పటికీ పార్టీని వీడలేదని చెప్పారు. ‘వీరేంద్ర పాటిల్ హయాంలో బంగారప్పకు, ధరంసింగ్‌కు, ఖర్గేకు కూడా అవకాశాలు రాలేదు. ఆ తర్వాత వాళ్లు మంచి పొజిషన్లకు వెళ్లారు. ఓపికతో ఉండాలి. పార్టీ ఉంటేనే భవిష్యత్ ఉంటుంది’ అని డీకే సూచించారు.
కొద్దిరోజుల్లో కార్నాటకలోని అన్ని బోర్డులు, కార్పొరేషన్లలో కొత్త నియామకాలు చేపడతామని, పార్టీ కార్యకర్తలకు తొలి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. బుధవారం నుంచే రాష్ట్రంలోని కరువు ప్రభావిత జిల్లాల్లో పర్యటించాలని కొత్త మంత్రులకు సీఎం డీకే శివకుమార్ సూచించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కార చర్యలు వెంటనే చేపట్టాలని ఆదేశించారు.
కృష్ణప్పకు మద్దతుగా సామూహిక రాజీనామాలు
సోమవారం జరిగిన మంత్రివర్గ విస్తరణలో మొత్తం 19 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. దీంతో, తమకు మంత్రి పదవి దక్కలేదనే అసంతృప్తితో కొందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామని బహిరంగంగా ప్రకటించారు. ఎమ్మెల్యే ఎస్సార్ శ్రీనివాస్ తాను కర్నాటక ఆర్టీసీ చైర్మన్ పదవికి రిజైన్ చేస్తున్నట్లు ప్రకటించారు. ‘రైతు కొడుకు రాజకీయాల్లో ఎదగడం చాలా కష్టం. పెద్దల అండదండలో, డబ్బో లేకపోతే అవకాశాలు రావట్లేదు’ అంటూ ఆయన మీడియా ఎదుటే ఆవేదన వ్యక్తం చేశారు.
విజయనగర నియోజకవర్గ ఎమ్మెల్యే ఎం. కృష్ణప్పకు మంత్రి పదవి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఆ సెగ్మెంట్‌కు చెందిన కాంగ్రెస్ బ్లాక్‌ల అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు, మహిళా విభాగం, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, యువజన కాంగ్రెస్ నేతలు తమ సామూహిక రాజీనామా లేఖను కర్నాటక కాంగ్రెస్ చీఫ్ బీకే హరిప్రసాద్‌కు పంపించారు. దీంతో ఎమ్మెల్యే కృష్ణప్పను బుజ్జగించేందుకు సీనియర్ మంత్రులు చెలువరాయస్వామి, బాలకృష్ణ.. ఆయన ఇంటికి వెళ్లినా.. అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగారు.
మరోవైపు, మహిళా కోటాలో ఒక మంత్రి పదవి ఇంకా ఖాళీగా ఉండటంతో ఆ స్థానంపై లాబీయింగ్ ప్రారంభమైంది. సందూరు ఎమ్మెల్యే అన్నపూర్ణ తుకారాం తన తండ్రితో కలిసి సీఎంను కలిశారు. కాగా, మంత్రి పదవి రాకపోవడంతో రాజీనామా చేస్తానని ప్రకటించిన ఎమ్మెల్యే బేలూరు గోపాలకృష్ణ, సీఎం శివకుమార్‌తో భేటీ అనంతరం తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.
