LIC షేర్లు ఎందుకు కుప్పకూలాయి : మోదీ సర్కార్ నిర్ణయంతో ఇన్వెస్టర్లు మునిగిపోయారా..?

LIC షేర్లు ఎందుకు కుప్పకూలాయి : మోదీ సర్కార్ నిర్ణయంతో ఇన్వెస్టర్లు మునిగిపోయారా..?

ప్రభుత్వ రంగ ఇన్సూరెన్స్ దిగ్గజం LIC షేర్లు ఆగస్టు 4న మార్కెట్‌లో భారీ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. మోడీ ప్రభుత్వం ప్రకటించిన వాటాల అమ్మకం నిర్ణయం ఆఫర్ ఫర్ సేల్(OFS)తో ఇన్వెస్టర్లు అమ్మకాల బాట పట్టారు. దీంతో ఉదయం ట్రేడింగ్‌లో LIC షేరు రూ.398.50 వద్ద ట్రేడవుతూ దాదాపు 7 శాతం మేర క్షీణించింది. ఈ ఏడాది ఇప్పటివరకు కూడా LIC షేరు నష్టాల్లోనే ఉంది. దాదాపుగా ఐపీఓ సమయంలో కొన్న ఇన్వెస్టర్లు ఇప్పటికీ అప్పటి నష్టాలను పూడక ఇబ్బంది పడుతున్న వేళ మరో బాంబులా వాటాల విక్రయం అది కూడా మార్కెట్ ధర కంటే భారీ డిస్కౌంట్ రేటుకు చేయటం ఇన్వెస్టర్లను నిండా ముంచేసింది. 

భారీ డిస్కౌంట్‌నే పతనానికి ప్రధాన కారణం
ప్రభుత్వం OFSలో ఒక్కో షేరు ఫ్లోర్ ప్రైస్‌ను రూ.382గా నిర్ణయించింది. ఇది సోమవారం ముగింపు ధరతో పోలిస్తే సుమారు 11 శాతం తక్కువ. ఇంత పెద్ద డిస్కౌంట్‌కు షేర్లు విక్రయించనున్నట్లు ప్రకటించడంతో మార్కెట్‌లో ఇప్పటికే షేర్లు కొనుక్కుని హోల్డ్ చేసిన ఇన్వెస్టర్లలో ఆందోళన పెరిగింది. ఫలితంగా మార్కెట్ ధర కూడా OFS ధరకు దగ్గరగా పడిపోవడం ప్రారంభమైంది. ఉదయం ట్రేడింగ్‌లో షేరు ధర OFS ఫ్లోర్ ప్రైస్ కంటే కేవలం 4 శాతం మాత్రమే ఎక్కువగా ఉండటం దీనికి నిదర్శనం.

ఇన్వెస్టర్లకు భారీ దెబ్బ ఎలా తగిలింది?
ఇప్పటికే అధిక ధరలకు LIC షేర్లు కొనుగోలు చేసిన రిటైల్ ఇన్వెస్టర్లకు ఈ నిర్ణయం గట్టి దెబ్బగా మారింది. ప్రభుత్వం తక్కువ ధరకు కొత్తగా షేర్లు అందుబాటులోకి తీసుకురావడంతో మార్కెట్‌లో ఉన్న షేర్ల విలువ కూడా తగ్గిపోయింది. దీంతో ఇప్పటికే పెట్టుబడి పెట్టిన వారి పోర్ట్‌ఫోలియో విలువ ఒక్కరోజులోనే క్షీణించింది. ముఖ్యంగా లిస్టింగ్ తర్వాత నష్టాలతోనే షేర్లను హోల్డ్ చేస్తున్న పెట్టుబడిదారులకు ఇది మరో ఎదురుదెబ్బగా మారింది.

ప్రభుత్వం ఎందుకు వాటాలు అమ్ముకుంటోంది?
ప్రస్తుతం LICలో కేంద్ర ప్రభుత్వ వాటా 96.5 శాతంగా ఉంది. సెబీ రూల్స్ ప్రకారం కనీసం 10 శాతం పబ్లిక్ షేర్‌హోల్డింగ్‌ను 2027 మే నాటికి కలిగి ఉండాలి. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రభుత్వం మొదట 2.5 శాతం వాటాలను విక్రయిస్తోంది. అవసరమైతే మరో 4 శాతం గ్రీన్‌షూ ఆప్షన్ ద్వారా అమ్మే అవకాశం ఉంది. మొత్తం 6.5 శాతం వాటాలు విక్రయిస్తే మోడీ ప్రభుత్వానికి సుమారు రూ.31వేల కోట్లు సమకూరే అవకాశం ఉంది.

దీర్ఘకాలంలో ప్రయోజనం ఉన్నా.. తక్షణ నష్టం
ప్రభుత్వ వాటా తగ్గితే మార్కెట్‌లో ఫ్రీ ఫ్లోట్ పెరిగి, భవిష్యత్తులో LIC షేరు పాసివ్ ఇండెక్స్‌ల్లో చోటు దక్కించుకునే అవకాశాలు మెరుగుపడవచ్చు. ట్రేడింగ్ లిక్విడిటీ కూడా పెరగవచ్చు. అయితే ఇవన్నీ దీర్ఘకాల ప్రయోజనాలు మాత్రమే. ప్రస్తుతం మాత్రం భారీ డిస్కౌంట్‌తో జరిగిన OFS ప్రకటన మార్కెట్‌కు ప్రతికూల సంకేతాలు పంపింది. దాంతో షేరు ధర కుప్పకూలి, ఇప్పటికే పెట్టుబడి పెట్టిన లక్షలాది LIC ఇన్వెస్టర్ల సంపద ఒక్కరోజులోనే భారీగా ఆవిరైపోయింది. మెుత్తానికి సాధారణ ఇన్వెస్టర్లకు LIC ప్రస్తుతం భారీ విలువ నష్టాన్ని మిగిల్చిందనే అభిప్రాయం మార్కెట్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.