- దశాబ్దాలుగా ఎదురుచూపులు
- ఆదిలాబాద్‌నుంచి ప్రస్తుత రైల్వే మార్గంలో హైదరాబాద్ వెళ్లాలంటే మహారాష్ట్ర తిరగాల్సిందే
- అదనంగా 130 కి.మీ. ప్రయాణించాల్సిన దుస్థితి
- ఏండ్లుగా కేంద్రానికి వినతులిస్తున్న నేతలు.. లభించని మోక్షం
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్, నిర్మల్, ఆర్మూర్ ప్రజలు ఏండ్లుగా ఎదురుచూస్తున్న ఆదిలాబాద్–ఆర్మూర్ రైల్వే లైన్ కు మోక్షం దక్కడం లేదు. ఈ రైల్వే మార్గం ఏర్పాటైతే ఉత్తర తెలంగాణ ప్రజలకు ప్రయాణ సేవలు మరింత మెరుగయ్యే అవకాశం ఉన్నప్పటికీ ప్రాజెక్టు మాత్రం ముందుకు కదలడం లేదు. పలుమార్లు స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రులను కలిసి విన్నవించినప్పటికీ రైల్వే లైన్‌పై స్పష్టమైన నిర్ణయం మాత్రం రావడంలేదు. ఆదిలాబాద్ టూ ఆర్మూర్ వయా నిర్మల్‌కు 136 కిలోమీటర్ల రైల్వే లైన్ ఏర్పాటు చేసేందుకు 2009లోనే కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అప్పుడు నిర్మాణానికి రూ.700 కోట్లతో అంచనా వేశారు. కానీ బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడంతో అంచనా వ్యయం అంతకంతకూ పెరిగిపోయింది. చివరగా 2023 లో ఫైనల్ లొకేషన్ సర్వే నిర్వహించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అనేక ఆటుపోట్ల మధ్య గతేడాది దక్షిణ మధ్య రైల్వే శాఖ ఈ లైన్ కోసం రూ. 4,300 కోట్లతో డీపీఆర్ సిద్ధం చేసింది. కానీ ఇప్పటివరకు ఈప్రాజెక్టు పనులు పట్టాలెక్కలేదు. ప్రస్తుతం ఫైల్ రైల్వే బోర్డు వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇస్తేగానీ ఫైనాన్షియల్ క్లియరెన్స్ వచ్చే అవకాశాలు లేవు.
130 కిలోమీటర్ల అదనంగా ప్రయాణం
ఆదిలాబాద్ ప్రజలు రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ కు వెళ్లాలంటే 44వ జాతీయ రహదారి గుండా ఆదిలాబాద్, నిర్మల్, ఆర్మూర్, కామారెడ్డి మీదుగా సుమారు 305 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. అదే రైలు మార్గంలో అయితే ఆదిలా బాద్ నుంచి మహారాష్ట్రలోని కిన్వాట్, ముత్కేడ్ జంక్షన్‌కు వెళ్లి అక్కడి నుంచి తెలంగాణలోకి ప్రవేశించి నిజామాబాద్ మీదుగా హైదరాబాద్ చేరుకోవాల్సి వస్తోంది. ఈ మార్గం ద్వారా ప్రజలు దాదాపు 9 గంటల పాటు 435 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. అదనంగా 130 కిలోమీటర్ల దూరం పెరుగుతోంది. తక్కువ చార్జీ అని రైలెక్కితే.. మహారాష్ట్రలోకి వెళ్లి సమయం వృథా అవుతుండడంతో జిల్లా వాసులు నిరాశకు గురవుతున్నారు. అదే ఈ రైల్వే లైన్ పూర్తయితే కేవలం 3 గంటల్లోనే చేరుకునే అవకాశం ఉంటుంది. ఆదిలాబాద్‌లో నిజాం కాలంలో నిర్మించిన రైల్వేలైన్ ఒక్కటే ఉంది. ఇప్పటివరకు కొత్త రైల్వే లైన్ నిర్మించలేదు. దీంతో ఏళ్లుగా ఆదిలాబాద్ ప్రజలు, ప్రజాప్రతినిధులు కొత్త రైల్వే లైన్ కోసం ఎదరుచూస్తున్నారు.
డీపీఆర్ సిద్ధమైనా పట్టాలెక్కని ప్రాజెక్టు..
గతేడాది ఆదిలాబాద్–ఆర్మూర్ రైల్వే లైన్ కోసం రూ.4300 కోట్లతో డీపీఆర్ పూర్తి చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వ, రైల్వే బోర్డు దీనిపై ముందడుగు వేయలేదు. అధికారులు రూపొందించిన డీపీఆర్ లో సోన్ వద్ద గోదావరి నదిపై బ్రిడ్జితో పాటు ఘాట్ రోడ్లలో 8 టన్నెళ్లు నిర్మించాలని ప్రతిపాదించారు. ఆదిలాబాద్, ఇచ్చోడ, నేరడిగొండ, గోపాల్ పూర్, నిర్మల్, పొచంపాడ్, బూసాపూర్, బాల్కొండ, ఆర్మూర్ లో ప్రయాణికుల కోసం స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించారు. ఆదిలాబాద్ నుంచి జాతీయ రహదారి పక్క నుంచి కాకుండా అటవీ ప్రాంతం గుండా రైల్వే లైన్ వెళ్లేలా రూట్ మ్యాప్ తయారు చేశారు. ఒకవేళ ఈ రైల్వే నిర్మాణం పూర్తయితే ఉత్తర తెలంగాణలోని లక్షల మంది ప్రజలకు రైల్వే సేవలు అందుబాటులోకి వస్తాయి.
