వెలుగు ఓపెన్ పేజీ.. అన్నదాతకు అండగా.. ఆచరణలో వ్యవసాయ సంక్షేమం!

వెలుగు ఓపెన్ పేజీ.. అన్నదాతకు అండగా.. ఆచరణలో వ్యవసాయ సంక్షేమం!

రైతును రాజు చేయడమంటే వేదికలపై ఉపన్యాసాలు దంచడం కాదు. విత్తనం వేయడం దగ్గర నుంచి ప్రతి గింజను గిట్టుబాటు ధరతో  విక్రయించే వరకు  ప్రతి దశలో వెన్నంటి ఉండి ఆదుకోవడం నిజమైన పరిపాలన. బీఆర్‌‌‌‌ఎస్ పదేళ్ల పాలనలో వ్యవసాయం ఎదుర్కొన్న తీవ్రమైన నిర్లక్ష్యాన్ని అధిగమించి ప్రస్తుత మన ప్రజా ప్రభుత్వం కేవలం రెండున్నరేళ్ల స్వల్ప వ్యవధిలోనే సాధించిన విజయాలు చరిత్రాత్మకం.  

తెలంగాణ సమాజం ఈనాడు ఒక స్పష్టమైన మార్పును, విశ్వసనీయమైన పరిపాలనా  కాలాన్ని కళ్లారా చూస్తోంది.  గత ప్రభుత్వం రైతుబంధు పేరిట కొండంత ప్రచారం చేసుకుందే తప్ప క్షేత్రస్థాయిలో  రైతుకు అవసరమైన సంక్షేమాన్ని పూర్తిస్థాయిలో అందించడంలో విఫలమైంది.  దానికి భిన్నంగా మన ప్రజా ప్రభుత్వం రైతన్నకు అండగా నిలుస్తూ వ్యవసాయాన్ని మళ్లీ పండుగలా మారుస్తోంది.  

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయానికి ఖర్చు చేసింది రూ. 4,35,198 కోట్లు అంటే నెలకు రూ. 3.626.65 కోట్లు ఖర్చుచేస్తే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రూ.5,92,602 కోట్లు అంటే నెలకు 19,753.40 కోట్లు  ఖర్చు చేసింది. ఇంత పెద్ద మొత్తంలో  వ్యవసాయ రంగానికి ప్రాముఖ్యత ఇస్తుంటే వాస్తవాలను  పక్కన పెట్టి రైతులను పక్కదోవ పట్టిచ్చే పనిగా  ప్రతిపక్షాల ఆరోపణలు ఉంటున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆర్థికవ్యవస్థకు, గ్రామీణ జీవన ప్రమాణాలకు వ్యవసాయమే వెన్నెముక.  

కోట్లాది మంది రైతుల ఆశలు, ఆకాంక్షలతో ముడిపడిన ఈ రంగం ఏ ప్రభుత్వానికైనా అత్యంత ప్రాధాన్యతా అంశమే. నూతన రాష్ట్రంగా ఆవిర్భవించిన నాటి నుంచి పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసినట్లు ప్రచారం జరిగినప్పటికీ వాస్తవ లెక్కలను గమనిస్తే ప్రచారానికి, జరిగినదానికి చాలా వ్యత్యాసం ఉంది. 

2023  డిసెంబర్‌‌లో  పగ్గాలు చేపట్టి రెండన్నరేళ్లు పూర్తి చేసుకున్న ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కర్షక సంక్షేమానికి పెద్దపీట వేశారు. అయితే, ఈ రెండు ప్రభుత్వాల ప్రాధాన్యతలను, నిధుల కేటాయింపుల వేగాన్ని అధికారిక గణాంకాల ఆధారంగా విశ్లేషిస్తే.. విధానపరమైన అమలులో స్పష్టమైన వైరుధ్యం, వేగం కనిపిస్తున్నాయి. ప్రభుత్వాల చిత్తశుద్ధికి, కార్యాచరణకు ఈ గణాంకాలే గీటురాళ్లు.

పెట్టుబడి సాయం: 'బంధు' నుంచి 'భరోసా' వరకు వ్యవసాయంలో ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి రైతులకు ఆసరాగా నిలిచేందుకు బీఆర్ఎస్ సర్కారు 'రైతుబంధు' పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎకరానికి రూ.4 వేలతో మొదలుపెట్టి రూ.5 వేలకు పెంచింది. తమ పదేళ్ల పాలనలో రూ.72,972 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేసింది. కానీ అన్నింటికీ రైతుబంధు సర్వరోగ నివారిణిగా చెపుతూ రైతులకు ఇవ్వాల్సిన డ్రిప్ సబ్సిడీ కానీ వ్యవసాయ యంత్రాల సబ్సిడీలు ఇతరత్రా సబ్సిడీలపై చిన్నచూపు చూసింది.

 అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పంట పెట్టుబడి సహాయం పథకాన్ని మరింత విస్తరించి 'రైతు భరోసా'గా మార్చింది. పెట్టుబడి సాయాన్ని ప్రతి సీజన్‌‌కు ఎకరానికి రూ.6,000 కు పెంచడమే కాకుండా, కేవలం రెండన్నరేళ్ల (డిసెంబర్ 2023 – 2026 జులై) స్వల్ప కాలంలోనే రూ.36,321 కోట్లు పంపిణీ చేసి సంక్షేమ వేగాన్ని రెట్టింపు చేసింది. పైగా 2023 యాసంగిలో ఇవ్వాల్సిన  రైతుబంధు గత ప్రభుత్వం ఇవ్వకపోతే కాంగ్రెస్  ప్రభుత్వమే రైతులకు ఇచ్చి ఆదుకున్నది.

రుణ విముక్తిలో కాంగ్రెస్ శరవేగం

బీఆర్ఎస్ తన పదేళ్ల కాలంలో  విడతలవారీగా వ్యవసాయ రుణాలను మాఫీచేస్తూ మొత్తంగా రూ.30,177 కోట్లు వెచ్చించింది. ఇందులోనుండి దాదాపుగా  రూ.2000 కోట్లు వివిధ కారణాల వలన రైతుల ఖాతాలలోకి వెళ్లలేదు. బీఆర్ఎస్ అవలంబించిన తప్పుడు విధానం కారణంగా రైతన్నలు రుణ విముక్తులు కాలేదు.   

కర్షకుల కష్టాలు తెలిసిన కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీని తమ అత్యున్నత ప్రాధాన్యతగా తీసుకుంది. కేవలం రెండన్నరేళ్ల కాలంలోనే ఒకే విడతలో ఏకంగా రూ.20,617 కోట్లను వెచ్చించి, లక్షలాది మంది రైతులను తక్షణం రుణ విముక్తులను చేసింది. ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి రుణమాఫీ చేయడం అనేది  దేశంలో ఏ ప్రభుత్వం కూడా రైతుల కోసం ఖర్చు చేసిన దాఖలాలు లేవు.

ధాన్యం సేకరణ.. అదనపు బోనస్ దన్ను

పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే రైతుకు నిజమైన భరోసా. బీఆర్ఎస్ పాలనలో రూ.1,34,871 కోట్ల  విలువైన 738.03 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రెండున్నరేళ్ల వ్యవధిలోనే 376.99 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి, దానికి రికార్డు స్థాయిలో రూ.4,17,386 కోట్ల చెల్లింపులు చేయడం గమనార్హం.  

వరి సాగు చేసే రైతులను ప్రోత్సహించేందుకు క్వింటాలుకు రూ.500 చొప్పున అదనపు బోనస్ అమలు చేస్తూ, అందుకోసం రూ.3,153 కోట్లు మంజూరు చేయడం రైతుల ఆదాయాన్ని పెంచే కీలక ముందడుగు.  వరితోపాటు ఇతర వాణిజ్య,  పప్పు ధాన్యాల కొనుగోళ్లలో మార్క్​ఫెడ్​ పాత్ర కీలకం. 

 బీఆర్ఎస్ పాలనలో జొన్నలు, కందులు, పెసర్లు తదితర పంటల కొనుగోలుకు రూ.11,470 కోట్లు ఖర్చు చేయగా.. కాంగ్రెస్  సర్కారు రెండున్నరేళ్లలోనే రూ.7,339 కోట్లకు పైగా వెచ్చించింది. ఒక్క 2025–-26 ఆర్థిక సంవత్సరంలోనే  రూ.5,849 కోట్ల విలువైన ప్రత్యామ్నాయ పంటలను కొనుగోలు చేయడం  వైవిధ్య వ్యవసాయం పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధిని సూచిస్తోంది. 

ఇరిగేషన్, ఉచిత విద్యుత్ బీఆర్ఎస్ పాలనలో సాగునీటి ప్రాజెక్టులకు రూ.1,00,344 కోట్లు ఖర్చు చేస్తే ప్రజా ప్రభుత్వం కేవలం రెండున్నరేళ్ల కాలంలోనే ఏకంగా రూ. 69,582 కోట్లు ఖర్చు చేసింది. ఉచిత విద్యుత్‌‌కు గత  ప్రభుత్వం రూ.61,563 కోట్లు ఖర్చు చేస్తే  కాంగ్రెస్  ప్రభుత్వం ఉచిత విద్యుత్‌‌కు రూ. 29,477 కోట్లు ఖర్చు చేసింది.  రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే  సబ్సిడీ  స్కీమ్  కేంద్ర  ప్రభుత్వ వాటా 60% రాష్ట్ర ప్రభుత్వ వాటా 40% కు  సంబంధించి గత  ప్రభుత్వం రాష్ట్ర వాటా పూర్తిగా చెల్లించకపోవడం వలన పెద్ద మొత్తంలో  స్కీమ్ వెనక్కి వెళ్లిన పరిస్థితి. 

 బీఆర్ఎస్ పాలనలో ఖర్చు చేసింది  కేవలం రూ. 1,940 కోట్లు మాత్రమే. కానీ ప్రజా ప్రభుత్వంలో  కేంద్రం నుండి వచ్చే  ప్రతి పైసా రైతులకు అందించాలనే ఆలోచనతో రెండున్నర సంవత్సరాల్లో 1,410 కోట్లు ఖర్చు చేసి రైతులకు సబ్సిడీ స్కీమ్‌‌లను అందించింది.  డ్రిప్,  వ్యవసాయ యంత్రాలు,  విత్తనాలు లాంటివి  రైతులకు ఇచ్చి అండగా నిలిచింది  ప్రభుత్వం.

ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పంట నష్ట పరిహారం 

ప్రకృతి వైపరీత్యాల మూలంగా బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పంటలు నష్టపోతే కేవలం రూ.187 కోట్లు మాత్రమే పరిహారం ఇచ్చింది. కానీ  ప్రజా ప్రభుత్వం ఇప్పటివరకు  రూ.260 కోట్ల నష్టపరిహారం అన్నదాతలకు అందించింది.  గత ప్రభుత్వం  రైతు బీమా కోసం రూ. 6,488 కోట్లు చెల్లిస్తే  ప్రజా ప్రభుత్వంలో  కేవలం రెండున్నర సంవత్సరాల్లో  రూ. 3,565 కోట్లు చెల్లించింది.  అదనంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రూ. 50 కోట్లు ఇచ్చింది. 

ఇంకా  ఇతర వ్యవసాయ స్కీమ్‌‌లకు పది సంవత్సరాలలో రూ. 15,186 కోట్లు చెల్లిస్తే  కేవలం  రెండున్నర  సంవత్సరాలలో  కాంగ్రెస్ సర్కార్  రూ. 3,442 కోట్లు  ఖర్చు చేసింది.  మొత్తంగా  కాంగ్రెస్  ప్రభుత్వం రెండున్నరేళ్ల స్వల్ప వ్యవధిలోనే  వ్యవసాయ రంగం కోసం రూ. 5.92 లక్షల కోట్లకు పైగా వెచ్చించింది.  

ఇందులో సాగునీరు, విద్యుత్‌‌తోపాటు.. నేరుగా రైతుల చేతికి అందే రుణమాఫీ,  పెరిగిన భరోసా,  బోనస్ వంటి  ఆర్థిక  ప్రయోజనాలకు పెద్దపీట వేసింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా పంట నష్ట పరిహారం కింద రూ.260 కోట్లు మంజూరు చేయడం మరో సానుకూల పరిణామం.  ‘కాంగ్రెస్ రైతులకు ఏం చేసింది?’ అని  ప్రశ్నించేవారికి పొలాల్లో కనిపిస్తున్న ఫలితాలే  సమాధానంగా నిలుస్తున్నాయి.

-అన్వేష్ రెడ్డి సుంకేట 
చైర్మన్,తెలంగాణ కిసాన్ కాంగ్రెస్‌‌ 
ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ  openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. 
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.