సాధారణంగా ట్రైన్ క్యాన్సల్ అయినా, వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నా లేదా రైలు బాగా లేటైనా మన డబ్బులు మనకు రిఫండ్ వస్తాయని అందరికీ తెలుసు. కానీ, రైలు ఎక్కి గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత కూడా రైల్వే శాఖ మన డబ్బులు మనకు రిఫండ్ ఇస్తుందనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అదెలాగో తెలుసుకుందామా ...!
"లోయర్ క్లాస్ సర్టిఫికేట్" (LLC) మ్యాజిక్?
మీ జర్నీ పూర్తయిన తర్వాత డబ్బులు వెనక్కి తీసుకోవడంలో 'ఎల్‌ఎల్‌సీ' (LLC - Lower Class Certificate) చాలా ముఖ్యం. మనం ఏ కోచ్‌కైతే డబ్బులు కట్టి టికెట్ బుక్ చేసుకుంటామో, కొన్నిసార్లు అనుకోని కారణాల వల్ల దానికంటే కింది స్థాయి కోచ్‌లో (తక్కువ ఛార్జీ ఉన్న దాంట్లో) ప్రయాణించాల్సి వస్తుంది. అప్పుడే ఈ సర్టిఫికేట్ పనికొస్తుంది.
రైలులో ఉండే టీటీఈ (TTE) మనకోసం ఈ LLCని రాసిస్తారు. దీని ద్వారా మనం గమ్యస్థానానికి చేరుకోవడంతో పాటు, మనం కట్టిన టికెట్ డబ్బులకు, ప్రయాణించిన కోచ్‌కు మధ్య ఉన్న డబ్బుల తేడాను తిరిగి పొందవచ్చు.
టీటీఈ ఈ సర్టిఫికేట్ ఎప్పుడు ఇస్తారు?
సౌకర్యాలు లేకపోతే: ఉదాహరణకు మీరు సెకండ్ ఏసీ (2AC) టికెట్ తీసుకున్నారు అనుకుందాం.... కానీ ఆ ఏసీ కోచ్‌లో ఏదైనా సాంకేతిక సమస్య వచ్చి ఏసీ పనిచేయకపోతే, మిమ్మల్ని థర్డ్ ఏసీ (3AC) లేదా స్లీపర్ కోచ్‌లోకి మారుస్తారు.
►ALSO READ | వాట్సాప్‌లో టెక్నికల్ గ్లిచ్..వేలాది ఖాతాలు లాక్..గందరగోళంలో యూజర్లు
ఇలాంటి సందర్భాల్లో టీటీఈ మీకు LLC సర్టిఫికేట్ ఇస్తారు. మీరు ఎక్కువ డబ్బులు పెట్టి బుక్ చేసిన టికెట్ ధరకూ, చివరకు మీరు ఏ కోచ్‌లో అయితే ప్రయాణించారో ఆ ధరకూ మధ్య ఉండే వ్యత్యాసాన్ని రైల్వే శాఖ మీకు రిఫండ్ ఇస్తుంది.
ఇతర సందర్భాల్లో కూడా :
ఎల్‌ఎల్‌సీ కాకుండా, కొన్ని పరిస్థితుల్లో కూడా రైల్వే మన డబ్బులు రిఫండ్ ఇస్తుంది:
రైలు 3 గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఆలస్యమైతే: రైలు చాలా లేట్ కావడంతో మీరు ప్రయాణాన్ని క్యాన్సల్ చేసుకుంటే, మీ టికెట్ డబ్బులు పూర్తిగా రిఫండ్ తీసుకోవచ్చు. అయితే దీనికి సకాలంలో వెంటనే TDR ఫైల్ చేయడం ముఖ్యం.
రైలు రద్దయితే: రైలు పూర్తిగా క్యాన్సల్ అయితే మీ డబ్బులు పూర్తిగా రిటర్న్ వస్తాయి. దీనికోసం ప్రత్యేకంగా ఎలాంటి టీడీఆర్ పెట్టాల్సిన పనిలేదు.
టికెట్ వెయిటింగ్ లిస్ట్‌లోనే ఉంటే: సీటింగ్ చార్ట్ తయారైన తర్వాత కూడా మీ టికెట్ కన్ఫర్మ్ కాకపోతే, ఆటోమేటిక్‌గా మీ డబ్బులు మీ అకౌంట్లోకి రిఫండ్ అవుతాయి.
రైలు రూట్ మార్చితే: రైలు వెళ్లే మార్గాన్ని మార్చినా లేదా రైలు మధ్యలోనే ఆపేసినా, మీరు రీఫండ్ కోసం టీడీఆర్ ఫైల్ చేయవచ్చు.
