సోషల్ మీడియాలో పరిచయం.. పెళ్లి పేరుతో మోసం.. రెండు నెలలు కాపురం చేసి జంప్ .

సోషల్  మీడియాలో పరిచయం..  పెళ్లి పేరుతో మోసం.. రెండు నెలలు కాపురం చేసి జంప్ .
  • బాధితురాలు అడ్వకేట్..

హుజూర్ నగర్, వెలుగు: సోషల్  మీడియాలో పరిచయమై ప్రేమ పేరుతో పెండ్లి చేసుకొని, ఓ మహిళా అడ్వకేట్​ను మోసం చేశాడు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దివ్యాంగురాలైన అడ్వకేట్  షేక్  మౌలాబీ తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన షేక్  కరీముల్లా ఏడాది కింద సోషల్​ మీడియాలో పరిచయమయ్యాడు. ఆ తర్వాత కరీముల్లా పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో మత పెద్దలతో మాట్లాడి 10 నెలల కింద హుజూర్ నగర్ లో పెళ్లి చేసుకున్నారు. 

రెండు నెలల తరువాత అడ్వకేట్​ ఇంట్లో లేని సమయంలో ఇంట్లో ఉన్న రూ.7.50 లక్షల నగదు, ఫర్నిచర్  తీసుకొని కరీముల్లా పరారయ్యాడు. ఈ విషయంపై అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కరీముల్లాకు గతంలోనే పెళ్లి జరిగి భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా, ఆచూకీ తెలుసుకొని సోమవారం తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో అప్పగించామని బాధితురాలు తెలిపారు. మంగళవారం తాను వచ్చే సరికి కరీముల్లాను పోలీసులు విడిచి పెట్టారని వాపోయారు. 

ఈ విషయాన్ని బార్  అసోసియేషన్  నాయకులకు తెలియజేసి స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. ఈ విషయంలో పోలీసులు, అడ్వకేట్ల మధ్య వాగ్వాదం జరిగింది. కేసు నమోదు చేసి బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.