- ఆద్య కళ వ్యవస్థాపకుడు జయదీర్ తిరుమలరావు
ముషీరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్దానికి పైగా గడిచినా జానపద కళలకు ప్రత్యేక అకాడమీ లేకపోవడం బాధాకరమని ఆద్య కళ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ జయదీర్ తిరుమలరావు అన్నారు. జానపద కళల పరిరక్షణ కోసం ప్రత్యేక అకాడమీ ఏర్పాటు చేసి, కళాకారులకు సమగ్ర సంక్షేమ విధానం అమలు చేయాలని కోరారు. మంగళవారం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సకల కళల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతరించిపోతున్న కళారూపాలను రక్షించే చట్టబద్ధ వ్యవస్థను తీసుకురావాలని సూచించారు. ఒకప్పుడు తెలంగాణలో వందకు పైగా జానపద కళారూపాలు ఉండేవని, ప్రస్తుతం అనేక కళారూపాలు అంతరించిపోయే దశకు చేరుకున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వృత్తి పురాణాలు, మాండలికాలు, వాయిద్యాలు, సాంస్కృతిక జ్ఞానం కనుమరుగవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో ద్రావిడ యూనివర్సిటీ మాజీ వీసీ పులికొండ సుబ్బాచారి, పాశం యాదగిరి, భూపతి వెంకటేశ్వర్లు, సుభాష్ చంద్రబోస్, సంకె రాజేశ్తదితరులు పాల్గొన్నారు
