ఇటీవలి కాలంలో ప్రభుత్వ విద్య నాణ్యతపై సందేహాలు వ్యక్తమవడం వంటి పరిణామాలు విద్యావ్యవస్థకు సవాళ్లుగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందించవచ్చని నిరూపించేందుకు మహబూబ్‌నగర్‌లో ప్రారంభమైన కార్యక్రమమే 'శత శాతం'. పేరుచూస్తే ఇది వంద శాతం ఉత్తీర్ణత కోసం రూపొందించిన కార్యక్రమంలా అనిపించవచ్చు.
కానీ దీని పరిధి అంతకంటే విస్తృతమైనది. ప్రతి విద్యార్థిని గుర్తించడం, ఆ విద్యార్థి సామర్థ్యానికి అనుగుణంగా తీర్చిదిద్దడం, పోటీ పరీక్షలకు సిద్ధం చేయడం, సమగ్ర దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇది మార్కుల కోసం చేపట్టిన కార్యక్రమం కాదు, విద్యార్థి జీవితాన్ని మార్చే లక్ష్యంతో ప్రారంభమైన విద్యా ఉద్యమం.
ప్రభుత్వ విద్యలో నాణ్యత పెరగాలంటే
ప్రభుత్వ యంత్రాంగం ఒక్కటే సరిపోదు. ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సమాజం కలిసి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈ ఆలోచనతోనే మహబూబ్‌నగర్ జిల్లాను రాష్ట్రంలోనే విద్యా రంగంలో మొదటి స్థానంలో నిలిపేందుకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ‘మహబూబ్‌నగర్ ఫస్ట్’ విజన్‌తో 'మై విలేజ్ స్కూల్' సహకారంతో ‘శతశాతం’ విద్యా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
మహబూబ్‌నగర్ నియోజకవర్గాన్ని విద్యారంగంలో రాష్ట్రానికే ఆదర్శంగా నిలబెట్టాలనే లక్ష్యంతో గత విద్యా సంవత్సరంలో 35 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటి ఏడాదిలోనే విద్యార్థుల్లో వచ్చిన మార్పు, ఉపాధ్యాయుల్లో పెరిగిన ఉత్సాహం, తల్లిదండ్రుల్లో ఏర్పడిన నమ్మకం పరీక్షా ఫలితాల్లో నమోదైన పురోగతి రుజువు చేసింది. అదే అనుభవంతో ఈ విద్యా సంవత్సరంలో ఏకంగా 100 ప్రభుత్వ పాఠశాలలకు విస్తరించారు.
ప్రభుత్వ విద్యకోసం వ్యక్తిగత వనరులు
టీటీసీ, బి.ఎడ్. పూర్తిచేసి, టెట్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ప్రత్యేక ప్రవేశపరీక్ష నిర్వహించి, దాదాపు 400 మంది అభ్యర్థుల్లో ప్రతిభ ఆధారంగా మెరుగైన అభ్యర్థులను ఎంపిక చేశారు. వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో నియమించారు. విద్యా వాలంటీర్లకు అందించే గౌరవ వేతనాలను ప్రభుత్వం కాకుండా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తన సొంత నిధుల నుంచి అందిస్తున్నారు. ప్రభుత్వ విద్య కోసం వ్యక్తిగత వనరులు వినియోగించడం నిజమైన సేవకు నిదర్శనం.
ఈ కార్యాచరణలో భాగంగా వందేమాతరం ఫౌండేషన్ భాగస్వామిగా ఉండటం మరో విశేషం. 'శత శాతం'లో అమలు చేస్తున్న పీర్ లెర్నింగ్ విధానం విశేష ఫలితాలను ఇస్తున్నది. విద్యార్థులను చిన్న బృందాలుగా విభజించి లిటిల్ లీడర్, లిటిల్ టీచర్, బడ్డీ ఫ్రెండ్‌లుగా బాధ్యతలు అప్పగించడం విద్యార్థులే ఒకరికొకరు బోధించే వాతావరణాన్ని సృష్టించడంతో అభ్యాసం మరింత ఆసక్తికరంగా మారింది.
డిజిటల్ విద్యకు ప్రాధాన్యత
మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ విద్యకు ఈ కార్యక్రమంలో ప్రాధాన్యత ఇచ్చారు. డిజిటల్ కంటెంట్, క్యూ ఆర్ కోడ్ ఆధారిత స్టడీ మెటీరియల్, స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, విజువల్ లెర్నింగ్ సౌకర్యాలను ప్రభుత్వ పాఠశాలలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా ఆధునిక విద్యా పద్ధతులను అనుభవించే అవకాశాన్ని పొందుతున్నారు.
పరీక్షల సమయంలో ప్రత్యేక శిక్షణ శిబిరాలు నిర్వహించడం ద్వారా అద్భుతమైన ఫలితాలు రాబట్టడంలో విజయం సాధించారు. ట్రిపుల్ ఐటీ, పాలీసెట్, ఇంజినీరింగ్, మెడిసిన్ ప్రవేశ పరీక్షలకు కోచింగ్ అందిస్తున్నారు. అవసరమైన విద్యార్థులకు ఉచిత భోజనం, వసతి, డిజిటల్ స్టడీ మెటీరియల్ అందించడంతో ఆర్థిక పరిస్థితి చదువుకు అడ్డంకి కాకుండా చూస్తున్నారు.
విద్యార్థి ఉన్నత విద్యలో అడుగుపెట్టే వరకు అండగా నిలవాలనే ఉద్దేశంతో 'విద్యానిధి'ని ఏర్పాటు చేశారు. ఒక విద్యార్థి జీవితాన్ని మార్చడం వల్ల వారి కుటుంబాన్ని, ఈ సమాజాన్ని మార్చవచ్చనే విశ్వాసంతో ప్రభుత్వ బడులపై నమ్మకాన్ని తిరిగి నింపుతూ, జ్ఞానమే ఆయుధం అని నిరూపిస్తూ ‘శత శాతం’ కార్యక్రమం సమాజ మార్పుకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నది.
-జంపాల ప్రవీణ్, పరిశోధకుడు
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
