డాబర్ ఉత్పత్తులను అమ్మకుండా బ్యాన్ చేసిన ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్.. ఎందుకంటే?

డాబర్ ఉత్పత్తులను అమ్మకుండా బ్యాన్ చేసిన ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్.. ఎందుకంటే?

దేశంలోని ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ కంపెనీ డాబర్ ఇండియాకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI) షాక్ ఇచ్చింది. తమ ఆహార ఉత్పత్తులపై వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా "100% నేచురల్", "100% ప్యూర్", "100% ప్యూరిటీ గ్యారంటీ", "100% ఆర్గానిక్" వంటి ప్రకటనలు ఉపయోగిస్తున్నందుకు ఆయా ఉత్పత్తుల అమ్మకాలపై నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రకటనలు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (అడ్వర్టైజింగ్ అండ్ క్లెయిమ్స్) రెగ్యులేషన్స్–2018కు విరుద్ధమని స్పష్టం చేసింది.

ఫుడ్ సేఫ్టీ చర్యలతో డాబర్‌కు చెందిన పలు ప్రముఖ ఉత్పత్తులు ప్రభావితమయ్యాయి. వాటిలో హనీ, హిమాలయన్ ఆర్గానిక్ ఆపిల్ సైడర్ వెనిగర్, వర్జిన్ కొబ్బరి నూనె, నువ్వుల నూనె, ఆవు నెయ్యి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి పాలు ఉన్నాయి. ముఖ్యంగా డాబర్ హోమ్‌మేడ్ కొబ్బరి పాలుపై "100% Purity" అనే క్లెయిమ్‌ను తప్పుదోవ పట్టించే ప్రకటనగా గుర్తించింది ఫుడ్ సేఫ్టీ.

►ALSO READ | భారతీయ టెకీలకు అమెరికా షాక్.. హెచ్-1బీ ఎక్స్‌టెన్షన్‌పై కొత్త ఛార్జీలు

అలాగే డాబర్ హిమాలయన్ ఆర్గానిక్ ఆపిల్ సైడర్ వెనిగర్, డాబర్ ఆర్గానిక్ హనీ ఉత్పత్తులపై చెల్లుబాటు అయ్యే ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అనుమతి లేకుండానే 'జైవిక్ భారత్' లోగోను ఉపయోగించినట్లు రెగ్యులేటరీ గుర్తించింది. ఈ అంశాలపై గతంలో పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ కంపెనీ తగిన చర్యలు తీసుకోకపోవడంతో అమ్మకాలపై నిషేధ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ వ్యవహారంపై స్పందించిన డాబర్ ఇండియా.. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సూచించిన అంశాలను పరిశీలిస్తున్నామని, అవసరమైన మార్పులు చేసే ప్రక్రియలో ఉన్నామని వెల్లడించింది.

ఇటీవల FSSAI దేశవ్యాప్తంగా నాణ్యత ప్రమాణాలు పాటించని ఉత్పత్తులపై కఠిన చర్యలు చేపడుతోంది. డియాజియో ఇండియా తయారు చేసిన కొన్ని విస్కీ, రమ్ బ్రాండ్ల విక్రయాలను కూడా నిషేధించింది. అలాగే త్రిపురకు చెందిన ఒక ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ కంపెనీ లైసెన్స్‌ను సస్పెండ్ చేయడంతో పాటు, పంజాబ్‌కు చెందిన మరో సంస్థపై కూడా ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనల కారణంగా చర్యలు తీసుకుంది. వినియోగదారులకు నాణ్యమైన, నమ్మకమైన ఆహార ఉత్పత్తులు అందేలా ఈ చర్యలు కొనసాగుతాయని రెగ్యులేటరీ స్పష్టం చేసింది.