భారతీయ టెకీలకు అమెరికా షాక్.. హెచ్-1బీ ఎక్స్‌టెన్షన్‌పై కొత్త ఛార్జీలు

భారతీయ టెకీలకు అమెరికా షాక్.. హెచ్-1బీ ఎక్స్‌టెన్షన్‌పై కొత్త ఛార్జీలు

అమెరికాలో H-1B వీసాపై పనిచేస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు అదనపు భారం పడే అవకాశం కనిపిస్తోంది. ట్రంప్ ప్రభుత్వం కొత్త ఇమ్మిగ్రేషన్ రూల్స్ తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే.. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న హెచ్-1బీ, ఎల్-1 వీసా ఉద్యోగుల వీసా గడువు పొడిగింపు దరఖాస్తులపై కూడా అదనపు రుసుము వసూలు చేయనుంది అమెరికా. ప్రస్తుతం ఈ ప్రతిపాదన తుది దశలో ఉండగా.. త్వరలో దీనిపై నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

ప్రస్తుతం అమెరికాలో కనీసం 50 మంది ఉద్యోగులు ఉన్న కంపెనీల్లో.. వారిలో సగానికి పైగా హెచ్-1బీ లేదా ఎల్-1 వీసాదారులు ఉన్న సంస్థలు కొత్త హెచ్-1బీ దరఖాస్తు లేదా ఉద్యోగం మారినప్పుడు మాత్రమే అదనపు ఫీజు చెల్లిస్తున్నాయి. హెచ్-1బీ కోసం 4వేల డాలర్లు, ఎల్-1 కోసం 4వేల 500 డాలర్ల అదనపు రుసుము అమల్లో ఉంది. కొత్త ప్రతిపాదన ప్రకారం ఇదే రుసుము ప్రతి వీసా పొడిగింపు సమయంలో కూడా కంటిన్యూగా చెల్లించాల్సి ఉంటుంది.

ఈ నిర్ణయం ముఖ్యంగా భారతీయ ఉద్యోగులను అధిక సంఖ్యలో నియమించుకునే ఐటీ, టెక్నాలజీ కంపెనీలపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది. వీసా పొడిగింపు కోసం కంపెనీలు అదనపు ఖర్చు భరించాల్సి రావడంతో..  రిక్రూట్మెంట్స్, ఉద్యోగుల బదిలీలు, ప్రాజెక్టుల నిర్వహణపై కూడా ప్రభావం పడే అవకాశాన్ని నిపుణులు సూచిస్తున్నారు.

►ALSO READ | వాట్సాప్‌లో టెక్నికల్ గ్లిచ్..వేలాది ఖాతాలు లాక్..గందరగోళంలో యూజర్లు

అమెరికా పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్ సేవల సంస్థ (USCIS) గణాంకాల ప్రకారం 2025 ఆర్థిక సంవత్సరంలో సుమారు 4 లక్షల 6వేల హెచ్-1బీ పిటిషన్లు ఆమోదం పొందాయి. వీటిలో దాదాపు 2లక్షల 91వేల పిటిషన్లు ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగుల వీసా పొడిగింపులకే సంబంధించినవి. ఇందులో భారతీయుల వాటా అత్యధికం. సుమారు 2లక్షల 26వేల మంది భారతీయులకు హెచ్-1బీ వీసా పొడిగింపులు లభించగా.. ఇది మొత్తం ఎక్స్‌టెన్షన్ ఆమోదాల్లో దాదాపు 78 శాతం.

ప్రముఖ కంపెనీల్లో అమెజాన్ అత్యధికంగా హెచ్-1బీ ఎక్స్‌టెన్షన్ ఆమోదాలు పొందగా, తర్వాత టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్, మెటా, యాపిల్, గూగుల్ వంటి సంస్థలు ఉన్నాయి. ఈ కొత్త నిబంధన అమల్లోకి వస్తే.. అమెరికాలో పనిచేస్తున్న వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులు, వారిని నియమించుకునే సంస్థలు అదనపు ఆర్థిక భారం ఎదుర్కొనే అవకాశముంది.