హైదరాబాద్, వెలుగు: ఏఐటీయూసీ, సీపీఐ పోరాటాల ఫలితంగానే మణుగూరు పీకే వోసీ-2 డీప్ సైడ్ బ్లాక్ తిరిగి సింగరేణికి దక్కిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే, ఏఐటీయూసీ గౌరవాధ్యక్షుడు కూనంనేని సాంబశివరావు అన్నారు. ఇందుకు చొరవ చూపిన సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
మంగళవారం హైదరాబాద్‌లోని మఖ్ధూమ్ భవన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మణుగూరు డీప్ బ్లాక్‌ను జెన్‌కోకు కట్టబెట్టి, ఆ తర్వాత ప్రైవేటు సంస్థకు అప్పగించేందుకు కుట్రలు జరిగాయని ఆరోపించారు. దీనిపై ఏఐటీయూసీ, సీపీఐ ఆధ్వర్యంలో ధర్నాలు, నిరాహార దీక్షలు చేశామన్నారు. సింగరేణిలో దాదాపు 40 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.
ఆర్టీసీలో తక్షణమే గుర్తింపు యూనియన్ ఎన్నికలు నిర్వహించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 6 నుంచి 14 వరకు దేశవ్యాప్తంగా ప్రచార యాత్రలు చేపడుతున్నామని వెల్లడించారు.
