ఫిక్స్‌డ్ డిపాజిట్ ఇన్వెస్టర్లకు RBI కీలక శుభవార్త చెప్పింది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు అందించే ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లలో పారదర్శకత తీసుకురావడానికి కొత్త రూల్స్ ప్రకటించింది. ఇకపై ఒకే రోజు, ఒకే మొత్తంతో, ఒకే కాలపరిమితికి ఎఫ్‌డీ చేసిన ఇద్దరు కస్టమర్లకు వేర్వేరు వడ్డీ రేట్లు ఇవ్వడానికి అవకాశం ఉండదు. అంటే ఏ బ్రాంచ్‌లో డిపాజిట్ చేసినా.. అదే బ్యాంకులో ఒకే తరహా ఎఫ్‌డీకి అందరికీ ఒకే వడ్డీ రేటు వర్తించనుంది. ఈ కొత్త రూల్ 2026 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది.
ఇప్పటివరకు కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఒకే తరహా డిపాజిట్‌పై కస్టమర్ రిలేషన్, బ్రాంచ్, ఇతర కారణాల ఆధారంగా వేర్వేరు వడ్డీ రేట్లు ఆఫర్ చేసే అవకాశం ఉండేది. దీంతో ఒకే బ్యాంకులో ఒకే మొత్తం పెట్టుబడి పెట్టినా ఇద్దరు కస్టమర్లు వేర్వేరు రిటర్న్స్ పొందే పరిస్థితులు ఉండేవి. అందుకే కొత్త ఆదేశాలతో అలాంటి అసమానతలకు పూర్తిగా చెక్ పడనుంది. ఇకపై ఒకే రోజు ఒకే కాలవ్యవధితో చేసిన రిటైల్ ఎఫ్‌డీలకు ఒకే వడ్డీ రేటు తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుంది.
ఈ నిర్ణయంతో పాటు బ్యాంకులు తమ ఎఫ్‌డీ వడ్డీ రేట్లను ముందుగానే అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించడం కూడా తప్పనిసరి చేసింది ఆర్‌బీఐ. వెబ్‌సైట్‌లో ప్రకటించిన రేట్లకే బ్యాంకులు కట్టుబడి ఉండాలి. దీంతో కస్టమర్లు వివిధ చిన్న ఫైనాన్స్ బ్యాంకుల వడ్డీ రేట్లను సులభంగా పోల్చుకునే అవకాశం లభిస్తుంది. వడ్డీ రేట్ల విషయంలో గందరగోళం తగ్గడంతో పాటు పారదర్శకత మరింత పెరుగుతుందని ఆర్‌బీఐ భావిస్తోంది.
►ALSO READ | PVR INOX మాస్టర్ ప్లాన్.. రూ.189కే మల్టీప్లెక్స్ మూవీ టిక్కెట్, తక్కువ ధరలో స్నాక్స్
అయితే రూ.3 కోట్లకు పైబడిన బల్క్ డిపాజిట్ల విషయంలో మాత్రం బ్యాంకులకు కొంత వెసులుబాటును అందించింది. ఇలాంటి భారీ డిపాజిట్లపై అవసరాన్ని బట్టి వేర్వేరు వడ్డీ రేట్లు ఇవ్వవచ్చు. అయితే ఆ విధానాన్ని కూడా ముందుగానే స్పష్టంగా ప్రకటించాల్సి ఉంటుంది. బ్యాంకు పనిచేసే ప్రతి రోజూ ఉదయం 10 గంటలకు బల్క్ డిపాజిట్ వడ్డీ రేట్లను వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేయాలని ఆర్‌బీఐ ఆదేశించింది.
మొత్తంగా ఈ కొత్త రూల్స్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో ఎఫ్‌డీ చేసే రిటైల్ పెట్టుబడిదారులకు మరింత భద్రత, పారదర్శకత, సమానత్వం లభించనుంది. "ఒకే డిపాజిట్‌కు ఒకే వడ్డీ" అనే సూత్రంతో కస్టమర్ల మధ్య వివక్షకు ముగింపు పలుకుతూ, ఎఫ్‌డీ పెట్టుబడులపై నమ్మకాన్ని మరింత బలోపేతం చేయడమే ఆర్‌బీఐ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.
