భారత్ ఫ్యూచర్ సిటీ’ సమగ్ర మాస్టర్ ప్లాన్‌ను ఈ ఏడాది డిసెంబర్‌లో నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమిట్’ వేదికగా ఆవిష్కరించాలని రాష్ట్ర సర్కారుసూత్రప్రాయంగా నిర్ణయించింది. సింగపూర్ సంస్థ ‘సుర్బానా జురాంగ్’ రూపకల్పన చేస్తున్న ఈ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) తుది దశకు చేరుకున్నది. గ్లోబల్సమిట్ నాటికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ శాశ్వత క్యాంపస్ నిర్మాణాన్ని పూర్తి చేసి, అదే ప్రాంగణంలో గ్లోబల్ సమిట్ నిర్వహించేలా పనులు సాగుతున్నాయి
ప్రపంచంలోనే అత్యంత అగ్రగామిగా నిలిచే ఫార్చూన్-500 కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే తెలంగాణనే ఎంచుకునేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఐటీ, డేటా సెంటర్లు, జీసీసీ సెంటర్లు, లైఫ్ సైన్సెస్, ఫార్మా, ఆటోమేషన్, ఎలక్ట్రానిక్స్‌లాంటి విభిన్న రంగాల కోసం ప్రత్యేక జోన్లను ఫ్యూచర్ సిటీలో కేటాయిస్తున్నారు. రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఫ్యూచర్ సిటీవ్యాప్తంగా భారీ రోడ్డు నెట్‌వర్క్‌ను నిర్మిస్తున్నారు.
ఫ్యూచర్ సిటీలో రూపుదిద్దుకుంటున్న లైఫ్ సైన్సెస్ హబ్ కోసం నాగార్జున సాగర్ జాతీయ రహదారి (ఎన్‌హెచ్565) నుంచి నేరుగా ప్రత్యేక రోడ్డు సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఈ మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తుండడంతో, త్వరలోనే పలు ప్రముఖ అంతర్జాతీయ లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్, బయో టెక్నాలజీ కంపెనీలు ఇక్కడ తమ యూనిట్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయని సెక్రటేరియెట్ వర్గాలు పేర్కొన్నాయి.
గ్లోబల్ ఐటీ దిగ్గజం అమెజాన్ ఇప్పటికే ఫ్యూచర్ సిటీలో రూ. వేల కోట్ల పెట్టుబడితో నూతన డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. దేశంలోనే అత్యంత వేగంగా జీసీసీలను ఆకర్షిస్తున్న నగరంగా హైదరాబాద్ చరిత్ర సృష్టించగా, ఈ వ్యవధిలోనే 200కు పైగా అంతర్జాతీయ సంస్థలు తమ కార్యాలయాలను ఇక్కడ ప్రారంభించాయి. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా భారత్ ఫ్యూచర్ సిటీలోనే ఒక ‘ప్రత్యేక జీసీసీ హబ్’ను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఇదివరకే అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ స్థాయి వర్క్ ప్లాజాలు, ప్లగ్ అండ్ ప్లే సౌకర్యాలతో రూపుదిద్దుకోనున్న ఈ హబ్‌తో వేలాది మంది ఐటీ నిపుణులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తున్నది.
ఇప్పటివరకు దేశంలో రూపుదిద్దుకున్న పారిశ్రామిక హబ్‌లు, నాలెడ్జ్ సిటీలు కేవలం 500 నుంచి 600 ఎకరాల వరకే పరిమితమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రాబోయే 5 దశాబ్దాల పారిశ్రామిక అవసరాలను అంచనా వేస్తూ భారత్ ఫ్యూచర్ సిటీని 30 వేల ఎకరాల ప్రాంగణంలో రూపొందిస్తోంది. సుర్బానా జురాంగ్ నిపుణుల బృందం ఈ ప్రాంతంలోని భౌగోళిక పరిస్థితులు, వనరులు, రవాణా సౌకర్యాలను అధ్యయనం చేస్తూ అంతర్జాతీయ ప్రమాణాలతో మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తోంది. పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ ఎనర్జీ, ఆధునిక రవాణా వ్యవస్థల కలయికగా ఈ నగరం రూపుదిద్దుకోనుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక మౌలిక వసతులు ఇక్కడ అందుబాటులోకి తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
