- అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు
- మంత్రి శ్రీధర్ బాబు
మంథని, వెలుగు: అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. శనివారం మంథనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల కోసం ఎదురుచూసే పరిస్థితి రాకూడదని కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందించేలా కార్యాచరణ చేపట్టిందని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలనేదే సర్కారు ధ్యేయమన్నారు.
మంథని నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన కర్తవ్యమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వోడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్పర్సన్ సహేందర్ రెడ్డి, పాలకవర్గం సభ్యులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కె.వెంకన్న, సింగిల్ విండో చైర్మన్ కె.శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు ఎ.ప్రసాద్, ఎలక్షన్ కోఆర్డినేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి, న్యాయవాది శశిభూషణ్ కాచే తదితరులు పాల్గొన్నారు.
