ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు అకాడమీకి మంత్రి నారా లోకేశ్ 2026, ఆగస్టు 5వ తేదీన శంకుస్థాపన చేశారు. విశాఖపట్నంలో ఆమెకు కేటాయించిన 3 ఎకరాల స్థలంలో బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
విశాఖలోని అరిలోవ ప్రాంతంలోని తోటగరువులో సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్ లెన్స్ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. టీడీపీ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, పీవీ సింధు కుటుంబ సభ్యుల సమక్షంలో భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
అకాడమీ భవన నమూనాతో పాటు క్రీడాకారులకు అందుబాటులోకి రానున్న అత్యాధునిక సౌకర్యాలు, వసతుల గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు. అకాడమీపై రూపొందించిన ఏవీని చూశారు.ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు, శాప్ ఎండీ ఎస్.భరణి, గ్రీన్ కో ఎనర్జీ ఎఫీషియన్సీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ చలమలశెట్టి స్వాతి తదితరులు పాల్గొన్నారు.
