పంటలు ఎండుతున్నయ్‌‌‌‌..   జూరాలకు నీళ్లివ్వండి ..కర్నాటక సీఎంకు మంత్రులు జూపల్లి, వాకిటి విజ్ఞప్తి

పంటలు ఎండుతున్నయ్‌‌‌‌..   జూరాలకు నీళ్లివ్వండి ..కర్నాటక సీఎంకు మంత్రులు జూపల్లి, వాకిటి విజ్ఞప్తి
  • రోజుకు 5 వేల క్యూసెక్కుల చొప్పున నీరు వదలండి
  • భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, జూరాల కింద 5.5 లక్షల ఎకరాల్లో పంటల సాగు
  • కీలక దశలో నీళ్లందకపోతే రైతులు నష్టపోయే చాన్స్​
  • నెల రోజుల పాటు నీరు విడుదల చేస్తే గట్టెక్కుతాయి
  • పరస్పర సహకారంతో ముందుకు సాగుదాం
  • బెంగళూరులో వినతిపత్రం అందించిన మినిస్టర్స్

హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ పరిధిలోని లక్షలాది ఎకరాల్లో సాగవుతున్న పంటలను కాపాడేందుకు రాష్ట్ర ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగారు. కర్నాటక ప్రభుత్వం మానవతా దృక్పథంతో తక్షణమే కృష్ణా నదీ జలాలను విడుదల చేయాలని మంత్రులు జూపల్లి కృష్ణా రావు, వాకిటి శ్రీహరి, ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లా ఎమ్మెల్యేలు కోరారు. మంగళవారం కర్నాటక సీఎం డీకే శివకుమార్‌‌‌‌‌‌‌‌తో మంత్రులతోపాటు ఎమ్మెల్యేలు మేఘా రెడ్డి, మధుసూదన్​ రెడ్డి, కృష్ణమోహన్​ రెడ్డి సమావేశమై వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జూరాల, భీమా, నెట్టెంపాడు, కోయిల్​సాగర్​ కింద ఆయకట్టు పరిస్థితిని వివరించారు. 5.5 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయే స్థితిలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే నెలపాటు రోజూ 5 వేల క్యూసెక్కుల చొప్పున కృష్ణా జలాలను విడుదల చేసి తెలంగాణ రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం పంటల ఎదుగుదలలో అత్యంత కీలకమైన సమయం నడుస్తోందని, ఈ దశలో సమయానికి తగినంత నీరు అందకపోతే పంట దిగుబడులు భారీగా పడిపోయి రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని వివరించారు.

రిజర్వాయర్లలో పడిపోయిన నీటి నిల్వలు

ప్రస్తుతం కృష్ణా బేసిన్‌‌‌‌‌‌‌‌లోని ప్రాజెక్టులతోపాటు ఆయా లిఫ్ట్‌‌‌‌లకు నీరందించే రిజర్వాయర్లలో నీటి లభ్యత చాలా పరిమితంగా ఉందని మంత్రులు వివరించారు. దీంతో ఆ లిఫ్టుల కింద చివరి ఆయకట్టు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రస్తుత విపత్కర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని చొరవ తీసుకోవాలని కర్నాటక సీఎం డీకే శివకుమార్‌‌‌‌‌‌‌‌ను కోరారు. ప్రస్తుత వర్షాకాలం ఇంకా ముగియనందున రాబోయే రోజుల్లో కురిసే వర్షాలతో కృష్ణా బేసిన్‌‌‌‌‌‌‌‌కు ఎగువ నుంచి మరిన్ని వరద ప్రవాహాలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఈ కీలక సమయంలో కర్నాటక నుంచి నీటిని క్రమబద్ధంగా విడుదల చేస్తే పంటలను కాపాడుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న పరస్పర సహకారం, స్నేహపూర్వక బంధాన్ని దృష్టిలో ఉంచుకొని కర్నాటక ప్రభుత్వం తక్షణం సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. 

సీఎం రేవంత్‌‌‌‌తో భేటీ

డీకే శివకుమార్‌‌‌‌‌‌‌‌తో భేటీకి ముందు సెక్రటేరియెట్‌‌‌‌లో సీఎం రేవంత్​రెడ్డితో మంత్రి ఉత్తమ్​ సహా మంత్రులు సమావేశమయ్యారు. జూరాల కింద ఆయకట్టు పరిస్థితిని వివరించారు. ఈ నేపథ్యంలోనే జూరాలకు కర్నాటకలోని నారాయణపూర్​ ప్రాజెక్ట్​ నుంచి నీటిని విడుదల చేయించేలా ఆ రాష్ట్ర సీఎంతో చర్చలు జరపాలని రేవంత్​ రెడ్డి సూచించారు. అందుకు అనుగుణంగానే హుటాహుటిన మధ్యాహ్నమే మంత్రులు జూపల్లి కృష్ణా రావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు మేఘా రెడ్డి, కృష్ణ మోహన్​ రెడ్డి, మధుసూదన్​ రెడ్డి తదితరులు కర్నాటక బయల్దేరి వెళ్లి.. డీకేతో భేటీ అయ్యారు.