- విధివిధానాలకు కసరత్తు చేయండి
- పొరుగు రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలన్న సీఎం
- ఎంజాయ్‌మెంట్ సర్వేతో లెక్కలు తేల్చాలి
- ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితులకు సత్వర న్యాయం
- హైలెవల్ కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి అనుగుణంగా అసైన్డ్ భూముల లబ్ధిదారులకు పూర్తిస్థాయి యాజమాన్య హక్కులు కల్పించాలని, ఇందుకోసం అవసరమైన కసరత్తు ప్రారంభించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అవసరమైతే ఒక హైలెవల్కమిటీ వేసి ఇతర రాష్ట్రాల్లో అవలంబించిన పద్ధతులపై అధ్యయనం చేయాలని సూచించినట్లు తెలిసింది. మంగళవారం సెక్రటేరియెట్‌లో ‘ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం-1989’ అమలుపై సీఎం అధ్యక్షతన ‘రాష్ట్ర స్థాయి ఉన్నత నిఘా, పర్యవేక్షణ కమిటీ’ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దళితులు, గిరిజనులకు సంబంధించిన అంశాలపైనా ముఖ్యమంత్రి చర్చించారు. ఇప్పటికే చాలాచోట్ల దళితులకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములను అగ్గువ, సగ్గువకు ఇతరులు కొనుగోలు చేశారని, ఈ నేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా అసైన్డ్ భూములకు ఎంజాయ్మెంట్సర్వే నిర్వహిస్తే భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయో తెలిసిపోతుందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డట్టు సమాచారం. ఇన్చార్జి మంత్రి చైర్మన్‌గా, కలెక్టర్ కోచైర్మన్‌గా జిల్లాల్లో అసైన్డ్కమిటీలు ఏర్పాటుచేసుకోవాలని, అందులో స్థానిక ఎమ్మెల్యే, ఆర్డీవో సభ్యులుగా ఉండాలని సూచించినట్లు తెలిసింది. వాస్తవానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో అసైన్డ్ కమిటీలను రద్దు చేసి, ఆ అధికారాలను జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. అసైన్డ్ భూములు అన్యాక్రాంతం అయినప్పుడు అమ్మినవారికి, కొన్నవారికి నోటీసులు జారీ చేసి, ఆయా భూములను ప్రభుత్వమే తిరిగి స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుంది. అమ్మినవారిలో నిరుపేదలు ఉంటే తిరిగి ఇవ్వాలనే నిబంధన ఉన్నప్పటికీ వివిధ కారణాల వల్ల అది అమలు కావడంలేదు. దీంతో ఆ దిశగా కూడా ప్రభుత్వం పునరాలోచన చేస్తున్నది.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 24.25 లక్షల ఎకరాల అసైన్డ్ భూములను కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేసినట్టు అధికారులు చెప్తున్నారు. ఇందులో దాదాపు 5 లక్షల ఎకరాల భూములకు ఇంకా డిజిటల్ సైన్ కాలేదు. కుమ్రభీం ఆసిఫాబాద్ జిల్లాలో అత్యధికంగా 2.05 లక్షల ఎకరాల అసైన్డ్ భూములున్నాయి.ఆ తర్వాత ఆదిలాబాద్‌లో 1.77 లక్షల ఎకరాలు, కామారెడ్డిలో 1.31 లక్షల ఎకరాలు, మెదక్‌లో 1.49 లక్షల ఎకరాలు, నల్గొండలో 1.41 లక్షల ఎకరాలు, నిజామాబాద్‌లో 1.31 లక్షల ఎకరాల అసైన్డ్ భూములున్నట్టు సీఎం రేవంత్ రెడ్డికి అధికారులు వివరించారు.
రాజకీయాలకు అతీతంగా కృషిచేయాలి
దళితులు, గిరిజనులు, ఆదివాసీల అభివృద్ధే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ఇందుకు రాజకీయాలకతీతంగా అందరూ కృషి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి ద్వారానే ఆయా వర్గాల్లో మార్పు వస్తుందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలపై అణచివేతను అధిగమించేందుకు రాష్ట్రంలో చట్టం అమలు తీరుపై సమీక్షించారు. జిల్లాలవారీగా నమోదైన కేసులు, దర్యాప్తు పురోగతి, న్యాయస్థానాల్లో విచారణ, కేసుల పరిష్కారం, బాధితులకు అందుతున్న ఆర్థిక సహాయం, పునరావాస చర్యలను సీఎం ఆరా తీశారు. కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానాలు, మొబైల్ కోర్టుల పనితీరుతోపాటు చట్టంపై చేపడుతున్న అవగాహన కార్యక్రమాలపై సమావేశంలో చర్చించారు. ఉమ్మడి ఏపీలో 2013 ఫిబ్రవరి 11న అప్పటి సీఎం అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ నిరోధక చట్టం అమలుపై రాష్ట్ర స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం దాదాపు 13 ఏండ్ల తర్వాత సీఎం అధ్యక్షతన రాష్ట్ర స్థాయి ఉన్నత నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం.
ఇందిరమ్మ ఇండ్లలో 31 శాతం మంది లబ్ధిదారులు ఎస్సీలే
దళితులు, గిరిజనులు, ఆదివాసీలకు ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రతి ప్రభుత్వ పథకం, అభివృద్ధి కార్యక్రమంలో వారికి తగిన ప్రాధాన్యమిస్తున్నట్టు చెప్పారు. దళితులు, గిరిజనులను కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటినుంచో సొంత బిడ్డల్లా ఆదరిస్తున్నదని, అందుకే పల్లెపల్లెనా ఇప్పటికీ ఇందిరమ్మను తలుచుకుంటున్నారని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీ జనాభా దాదాపు 16 శాతం ఉంటే.. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో 31 శాతం మంది లబ్ధిదారులు ఎస్సీలే ఉన్నారన్నారు. ఎస్టీల జనాభా 10 శాతం ఉంటే, వారికి 17 శాతం ఇండ్లను మంజూరు చేశామని వివరించారు. 27.5 లక్షల మంది విద్యార్థులకు నర్సరీ నుంచి పన్నెండో తరగతి వరకు బ్రేక్‌ఫాస్ట్ అందిస్తున్నామని తెలిపారు. 3.48 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, దీనివల్ల దళితులు, గిరిజనులు, ఆదివాసీలు సహా పేద కుటుంబాలకు నాణ్యమైన భోజనం అందుతోందని చెప్పారు. దళితులు, గిరిజనులు, ఆదివాసీల అవసరాలను దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తున్నదని తెలిపారు. చదువు ఒక్కటే జీవితాలను మారుస్తుందని.. విద్యతోనే సమాజంలో అసమానతలకు, అణిచివేత రుగ్మతలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. పిల్లలను చదువుతో పాటు క్రీడలవైపు ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ‘‘ఈ ప్రభుత్వం మీది. మీ సంక్షేమం, అభివృద్ధి కోసమే పనిచేస్తుంది’’ అని స్పష్టంచేశారు. సమావేశంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, కడియం కావ్య, ఎమ్మెల్యేలు తోట లక్ష్మీకాంతరావు, మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, మందుల సామేల్, మట్టా రాగమయి, వెడ్మ బొజ్జు, మురళీ నాయక్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
73 గ్రామాల్లో ఎక్కువ అట్రాసిటీ కేసులు
రాష్ట్రంలో గడిచిన ఐదేండ్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయని సీఎం రేవంత్‌రెడ్డికి అధికారులు వివరించారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో.. ప్రధానంగా 73 గ్రామాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని నివేదించారు. అక్కడ పోలీసు విభాగం ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరముందని తెలిపారు. జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీల మీటింగులు క్రమం తప్పకుండా జరిగేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ నిరోధక చట్టం కింద బాధితులకు చెల్లించాల్సిన నష్ట పరిహారాన్ని వెంటనే చెల్లించాలన్నారు. బడ్జెట్ కేటాయింపులతో ముడిపెట్టకుండా గ్రీన్ చానల్ ద్వారా నిధులు విడుదల చేయాలని ఆదేశించారు. అట్రాసిటీ ఘటనల్లో బాధితుల పట్ల ప్రభుత్వం మానవీయ కోణంలో స్పందించాలని, వారికి సకాలంలో నష్టపరిహారం, సహాయం, పునరావాసం అందేలా చూడాలని స్పష్టం చేశారు. ఇటీవల షాబాద్ హత్యల కేసు, తుక్కుగూడలో నర్సుపై హత్యాచారం కేసులను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించి, బాధిత కుటుంబాలకు సత్వర న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.
