- 12 అంశాల్లో ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్న సర్కార్
- అక్టోబర్ 1న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో మరిన్ని నిర్ణయాలు
- లీజ్‌హోల్డ్ ఆస్తులనూ ఫ్రీహోల్డ్‌గా మార్చే దిశగా కసరత్తు
హైదరాబాద్, వెలుగు: జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలోని ఆస్తులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అధికారిక అనుమతులతో ఉన్న లేఅవుట్లు, ప్లాట్లను 22-ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించనుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్థానిక సంస్థల నుంచి అనుమతులు పొందిన ఆస్తులకు ఈ వెసులుబాటు కల్పించనున్నారు. సాంకేతిక కారణాలతో నిషేధిత జాబితాలో చేరి రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన ఆస్తులకూ పరిష్కారం చూపనున్నారు.
గతంలో రిజిస్టర్ అయి, లేఅవుట్ అనుమతులు ఉన్న ప్లాట్లను డాక్యుమెంట్ల పరిశీలన అనంతరం క్లియర్ చేయనున్నారు. దీంతో ఏళ్లుగా రిజిస్ట్రేషన్‌కు నోచుకోని అనేక ప్లాట్లకు మార్గం సుగమం కానుంది. దీనికి సంబంధించి బుధవారం ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉన్నది. 22-ఏ కింద నమోదైన ఆస్తులపై ఉన్న సాంకేతిక, రికార్డు సంబంధిత సమస్యలను విడివిడిగా పరిశీలిస్తున్నారు.
ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే హైలెవల్ కమిటీని ఏర్పాటు చేసింది. సీసీఎల్‌ఏ కార్యదర్శి డీఎస్ లోకేష్‌కుమార్ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. న్యాయశాఖ కార్యదర్శి పాపిరెడ్డి, స్టాంపులు–-రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రాజీవ్‌గాంధీ సభ్యులుగా ఉన్నారు. అక్టోబర్ 1వ తేదీన సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరగనున్న కేబినెట్ సమావేశంలో 22-ఏకు సంబంధించి మరిన్ని నిర్ణయాలు తీసుకోనున్నారు.
నిషేధిత భూముల పరిధిలోని సుమారు 12 రకాల సంక్లిష్ట సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నెల రోజుల్లో సమస్యలను పరిష్కరించాలని సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా అధికారులను ఆదేశించారు. ఆ గడువులోనే ప్రక్రియ పూర్తి చేసేందుకు రెవెన్యూ శాఖ కసరత్తు చేస్తోంది. ఎల్‌బీనగర్ నియోజకవర్గంలో 9,700 ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఇప్పటికే మెమో జారీ చేశారు.
దీంతో అక్కడ రెగ్యులరైజేషన్ ప్రక్రియకు అధికారికంగా శ్రీకారం చుట్టారు. సింగరేణి స్థలాల్లోని ఇళ్ల జాగాల క్రమబద్ధీకరణకు 76 జీవో ప్రకారం ఉత్తర్వులు జారీ చేశారు. దేవాదాయ, వక్ఫ్ సంస్థలు చట్టబద్ధంగా వేలం వేసిన భూముల కొనుగోలుదారుల సమస్యలను కూడా పరిశీలించనున్నారు. చట్టబద్ధమైన వేలం ద్వారా కొనుగోలు చేసినట్లు రికార్డులు ఉంటే సంబంధిత ఆస్తులను క్లియర్ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ప్రతి అంశాన్ని విడిగా పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా పరిష్కారం చూపేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
బ్యాంకు వేలం ఆస్తులపై డాక్యుమెంట్ల ఆధారంగా నిర్ణయం..
రుణాలు చెల్లించకపోవడంతో బ్యాంకులు, డీసీసీబీలు, పీఏసీఎస్‌లు వేలం వేసిన ఆస్తులపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. చట్టబద్ధమైన వేలం ప్రక్రియలో కొనుగోలు చేసినట్లు ఆధారాలు ఉంటే 22-ఏ జాబితా నుంచి తొలగించే అంశాన్ని పరిశీలించనున్నారు. సంబంధిత పత్రాలను పరిశీలించిన తర్వాత ఆస్తులపై ఉన్న నిషేధాన్ని తొలగించే చర్యలు చేపట్టనున్నారు.
ప్రభుత్వ భూముల్లో ఏర్పాటైన అనధికార లేఅవుట్లు, కాలనీల సమస్యపైనా నిర్ణయం తీసుకోనున్నారు. గతంలో జారీ చేసిన జీవోల స్ఫూర్తితో కొత్త క్రమబద్ధీకరణ పథకం తీసుకొచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ పథకం ద్వారా అర్హత ఉన్న ఇళ్లను క్రమబద్ధీకరించే అవకాశం కల్పించనున్నారు. సికింద్రాబాద్ పరిధిలోని లీజ్‌హోల్డ్ ఆస్తులను నిబంధనల ప్రకారం ఫ్రీహోల్డ్‌గా మార్చే అంశంపైనా కసరత్తు జరుగుతోంది.
దీనికి సంబంధించిన రికార్డులు, హక్కులు, ప్రభుత్వ నిబంధనలను పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నారు. మిగిలిన అంశాలపైనా త్వరలోనే స్పష్టత ఇవ్వాలని రెవెన్యూ శాఖ ప్రక్రియ కొనసాగిస్తోంది. నిషేధిత జాబితాలో చిక్కుకున్న అర్హమైన ఆస్తులకు దశలవారీగా పరిష్కారం చూపడమే ప్రభుత్వ లక్ష్యంగా అధికారులు చెబుతున్నారు.
