సివిల్ డ్రెస్ లో వాహనాల తనిఖీ.. ట్రాఫిక్ పోలీసుల తీరుపై వాహనదారుడి ఆగ్రహం

సివిల్ డ్రెస్ లో వాహనాల తనిఖీ.. ట్రాఫిక్ పోలీసుల తీరుపై వాహనదారుడి ఆగ్రహం

మెహిదీపట్నం, వెలుగు: సివిల్ డ్రెస్​లో ఉండి వాహనాలను తనిఖీ చేస్తున్న ఆసిఫ్ నగర్ ట్రాఫిక్ పోలీసుల తీరుపై ఓ వాహనదారుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. సోమవారం మెహిదీపట్నం నుంచి మాసబ్ ట్యాంక్ వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడిని సివిల్ డ్రెస్​లో ఉన్న ఓ వ్యక్తి అడ్డగించి తనిఖీ చేయడానికి ప్రయత్నించాడు. అయితే, ఆ బైకర్.. సివిల్ డ్రెస్​లో ఉన్న నువ్వు ఎవరు అంటూ నిలదీయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కొద్దిసేపటి తర్వాత అక్కడికి వచ్చిన ట్రాఫిక్ పోలీసులు.. అతను క్రేన్ సహాయకుడని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రైవేట్ వ్యక్తులకు వాహనాలు ఆపే హక్కు ఎవరిచ్చారంటూ వాహనదారుడు ప్రశ్నించడంతో గందరగోళం నెలకొంది. చివరకు ట్రాఫిక్ మొబైల్ వెహికల్‌‌లో పనిచేసే సహాయకుడేనని, తాము పక్కనే ఉన్నామని ఎస్సై మాధవ్ తెలపడంతో శాంతించాడు. ప్రస్తుతం ఈ తనిఖీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది.