- మిలటరీ ఒత్తిడి తగ్గిస్తే 7 రోజుల్లో హార్మూజ్ తెరుస్తం
- అమెరికాకు ఇరాన్ ఆఫర్
- తమపై సైనిక ఒత్తిడి
- తగ్గించాలని కండీషన్
- ప్రెసిడెంట్ల మధ్య నేరుగా
- చర్చలు వద్దన్న టెహ్రాన్
- మధ్యవర్తుల ద్వారా చర్చలకు ఓకే
- ట్రంప్, పెజెష్కియాన్ భేటీ
- జరగదని వెల్లడి
టెహ్రాన్: అమెరికాతో చర్చల పునరుద్ధరణకు, హార్మూజ్ జలసంధిని తెరిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ తాజాగా ప్రకటించింది. చర్చల ద్వారా పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పే విషయంలో అమెరికా చిత్తశుద్ధితో వ్యవహరించాలని కోరింది. ఈమేరకు ఇరాన్‌కు చెందిన ఉన్నతాధికారి ఒకరు క్యోడో న్యూస్‌తో మాట్లాడుతూ కీలక వివరాలను వెల్లడించారు.
శాంతి కోసం, చర్చల పునరుద్ధరణ కోసం హార్మూజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ సుముఖంగా ఉన్నట్లు తెలిపారు. చర్చల పునరుద్ధరణ అంటూ జరిగితే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు శాశ్వత పరిష్కారాన్ని సూచించేలా ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. అదేసమయంలో, చర్చల విషయంలో తాము చిత్తశుద్ధితో ఉన్నామని అమెరికా నిరూపించుకోవాలని అన్నారు.
ఇందుకోసం ఇరాన్ పై సైనిక ఒత్తిడిని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇరాన్ పోర్టులపై ఆంక్షల తొలగింపు, మిలటరీ ప్రెజర్ ను తగ్గించే చర్యలు తీసుకున్న వారం రోజుల్లో హార్మూజ్ జలసంధిని తెరుస్తామని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనను మధ్యవర్తుల ద్వారా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు చేరవేశామని చెప్పారు.
ఒప్పందం కుదిరే ఛాన్స్..
చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు, అమెరికా ఆంక్షల కారణంగా నౌకల రాకపోకలు గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ఎగుమతులు, దిగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. ఇరాన్ కు ప్రధాన ఆదాయ వనరు ఆయిల్ ఎగుమతుల ద్వారానే వస్తోంది.
అయితే, పోర్టులపై ఆంక్షల కారణంగా ఎగుమతులకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఈ నేపథ్యంలోనే అమెరికాతో చర్చలకు ఇరాన్ సిద్ధపడినట్లు తెలుస్తోంది. మరోవైపు, అమెరికా కూడా చర్చలకు సుముఖంగా ఉన్నట్లు సంకేతాలు వస్తున్నాయంటూ ఇరాన్ ఉన్నతాధికారులు తెలిపారు. ఇరు దేశాల మధ్య తొందర్లోనే ఒప్పందం కుదిరే అవకాశం ఉందని చెప్పారు.
మధ్యవర్తులతోనే చర్చలు..
ఇరు దేశాలకు చెందిన ప్రెసిడెంట్ల ప్రత్యక్ష భేటీ కన్నా మధ్యవర్తుల ద్వారానే శాంతి చర్చలు జరగాలని ఇరాన్ భావిస్తోంది. ఇదే విషయాన్ని అమెరికాకు తెలియజేశామని ఇరాన్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజెష్కియాన్ అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా ట్రంప్, పెజెష్కియాన్ మధ్య భేటీ జరగనుందనే వార్తలను అధికారులు తోసిపుచ్చారు. చర్చలకు మధ్యవర్తులతోనే మార్గం ఏర్పడాలని సుప్రీం లీడర్ సహా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రెటరీ మెహ్సన్ రెజాయ్ అభిప్రాయపడుతున్నట్లు పేర్కొన్నారు. కాగా, మెహ్సన్ రెజాయ్ రెండ్రోజుల క్రితం 7 షరతులను అమెరికా ముందుంచారు.
ఇరాన్ పోర్టులపై బ్లాకేడ్‌ను ఎత్తివేయడంతోపాటు విదేశాల్లోని ఆస్తులను రిలీజ్ చేయాలనేవి వాటిలో ప్రధానమైనవి. మరోవైపు, ఈ ప్రతిపాదనలకు గడువును ఆగస్టు 16 నుంచి లెక్కిస్తామని చెబుతూ 45 రోజుల్లో దీని గడువు ముగుస్తుందని ఇరాన్ స్పష్టంచేసింది. అమెరికా తమ ప్రతిపాదనలకు ఒప్పుకోకున్నా, ఈ గడువులోగా బ్లాకేడ్ ఎత్తేయకున్నా.. అమెరికా బలగాలపై మరోసారి దాడులు చేస్తామని హెచ్చరించింది.
